Wednesday, May 1, 2024

తెలంగాణ నుంచే ‘తిరుగుబాటు’

- Advertisement -
- Advertisement -

Rebellion from the state of Telangana against policies of Modi

రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకే బిజెపి గిరిజనులపై లేని ప్రేమను ఒలకబోస్తుంది. నిజానికి ఆ పార్టీ గిరిజనుల సంక్షేమం కోసం ఏనాడు పాటుప డింది లేదు. అలా అయితే రాష్ట్రంలోని ఏడు గిరిజన మండలాలను తీసుకెళ్లి ఎపిలో ఎందుకు కలుపుతారు? కనీసం రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగానైనా ఎపిలో కలిపిన ఏడు మండలాలలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలి. ఆ ధైర్యం బిజెపి ప్రభుత్వానికి ఉందా? గిరిజనులపై నిజంగా ప్రేమ ఉంటే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన షెడ్యూల్ తెగల రిజర్వేషన్ల బిల్లుకు ఇప్పటివరకు ఎందుకు ఆమోదం తెలపలేదు. విభజన చట్టంలోని గిరిజన వర్శిటీ ఎందుకివ్వలేదు.
                                                                                                   – మంత్రి కెటిఆర్

దేశంలో అమలవుతున్నది మోడీ
రాజ్యాంగమే గిరిజనులపై కేంద్రానిది
కపట ప్రేమ తెలంగాణ కోరినా ఎస్‌టి
రిజర్వేషన్ పెంచలేదెందుకు? రాష్ట్రానికి
ఎస్‌టి యూనివర్శిటీ ఏమైంది? ఒడిశాలో
గిరిజనులను కాల్చినప్పుడు ముర్ము నోరు
విప్పలేదేం? రాష్ట్రానికి బిజెపి ఇచ్చింది
శూన్యం ఏమిచ్చారో రుజువులు చూపితే
మంత్రి పదవికి రాజీనామా:

కేంద్రంలో కొనసాగుతున్న నియంతృత్వ పాలన

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం నుంచే తిరుగుబాటు వస్తుందేమోనని టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. మోడీ పాలనా అంతా అస్తవ్యస్తంగా సాగుతోందన్నారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో మోడీ ప్ర భుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు తప్పకుండా వస్తాయన్నారు. ఈ పరిస్థితి రావడానికి ఇంకా ఎంతో సమయం పట్టదన్నారు. మోడీ తన అసమర్థ పాలనతో దేశాన్ని తిరోగమన దిశగా తీసుకపోతున్నారని కెటిఆర్ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నామాన్న అహంకారం తో రాజ్యాంగ వ్యవస్థలను సైతం పూర్తి గా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డా రు. ప్రస్తుతం దేశంలో అంబేద్కర్ రా జ్యాంగం అమలు కావడం లేదని, రాజ్యాంగం అమలవుతుందని నిప్పులు చెరిగారు. సమయం వచ్చినప్పడు టిఆర్‌ఎస్‌ను జాతీయ స్థాయికి విస్తరిస్తామని స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సి న్హా దాఖలు చేశారు. టిఆర్‌ఎస్ పార్టీ పక్షాన మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేస్తారనే సంపూర్ణ విశ్వాసంతో యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపామన్నారు. టిఆర్‌ఎస్ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో యశ్వంత్ సిన్హాను త్వరలోనే హైదరాబాద్ రావాలని ఆహ్వానించామని కెటిఆర్ తెలిపారు. తమ పార్టీకి చెందిన ఎంపిలు, శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఆయనకు మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సిన్హాకు మద్దతు వెనక అనేక కారణాలు ఉన్నాయని కెటిఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక నియంతలా, నిరంకుశ విధానాలతో పాలన సాగిస్తోందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో అప్రజాస్వామికంగా అన్యాయాల పరంపర కొనసాగుతోందని మండిపడ్డారు. ఇప్పటివరకు దాదాపు 8 రాష్ట్రాల్లో ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోయినా అక్కడి పరిస్థితులను తలకిందులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకే బిజెపి పార్టీ గిరిజనులపై లేని ప్రేమను ఒలకబోస్తుందన్నారు. నిజానికి ఆ పార్టీ గిరిజనుల సంక్షేమం కోసం ఏనాడు పాటుపడిందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. అలా అయితే రాష్ట్రంలోని ఏడు గిరిజన మండలాలను తీసుకెళ్లి ఎపిలో ఎందుకు కలుపుతారని నిలదీశారు. కనీసం రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగానైనా ఎపిలో కలిపిన ఏడు మండలాలలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలన్నారు. ఆ ధైర్యం బిజెపి ప్రభుత్వానికి ఉందా?అని ప్రశ్నించారు. ఆ విధంగా ఉంటే వెంటనే ప్రధాని నరేంద్రమోడీ ఒక ప్రకటన చేయాలని ఈ సందర్భంగా కెటిఆర్ డిమాండ్ చేశారు.

రిజర్వేషన్ల బిల్లుకు ఎందుకు ఆమోదం తెలుపలేదు

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి గిరిజనులపై నిజంగా ప్రేమ ఉంటే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన షెడ్యూల్ తెగల రిజర్వేషన్ల బిల్లుకు ఇప్పటి వరకు ఎందుకు ఆమోదం తెలపలేదని కెటిఆర్ ప్రశ్నించారు. దీనిపై కేంద్రానికి ఎందుకు ఉలుకు…పలుకు లేదని నిలదీశారు. రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని పునర్విజన చట్టంలో చాలా స్పష్టంగా పొందుపరిచారన్నారు. కానీ మోడీ ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీని ఇవ్వడానికి ఇప్పటి వరకు మనసు రాలేదని ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రాన్ని అనేక మార్లు కోరినప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడ్డారు.

రాజ్యాంగ సంస్థలను ఊసిగొల్పుతున్నారు

రాజ్యాంగ సంస్థలను తమ గుప్పిట్లో ఉంచుకొని విపక్షాల మీద వేటకుక్కల్లాగా ఉసిగొల్పి రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారని మోడీపై కెటిఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిని తిరస్కరించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంపై నమ్మకమున్న అన్ని పార్టీలపై ఉంటుందన్నారు. అందుకే ఆ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నామన్నారు.

వారు ఏమిచ్చారో చెబితే.. పదవికి రాజీనామా చేస్తా

ఎనిమిదేళ్ల మోడీ పాలనలో తెలంగాణకు ఒనగూరిన ప్రయోజనం అంటూ ఏదీలేదని కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి జాతీయ సమావేశాలు హైదరాబాద్ నగరంలో జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఏమి చేశారో దమ్ముంటే ఆ పార్టీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. చెప్పడమే కాదు…వాటికి రుజువులు కూడా చూపిస్తే తన మంత్రి పదవిని వదులుకునేందుకు కూడా తాను సిద్దమేనని కెటిఆర్ సవాల్ విసిరారు. కనీసం తన సవాల్‌ను అయినా బిజెపి నాయకులు స్వీకరించాలన్నారు. ఆ సత్తా వారికుందో? లేదో త్వరలోనే తేలిపోనుందన్నారు. ఐదేళ్ల క్రితం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్‌నాథ్ కోవింద్ దళితుడు అని బిజెపి నాయకులు చెప్పారన్నారు. మరి ఈ ఐదేళ్లలో దళితులకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం దేశంలో ఇప్పటి వరకు ఎవరు అమలు చేయని విధంగా దళిత బంధును తీసుకొచ్చిందన్నారు.

ఈ పథకం కింద అర్హులైన వారందరికి పది లక్షల రూపాయల చొప్పున రుణాలను అందిస్తున్నామన్నారు. ఈ రుణాన్ని లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి పథకాన్ని ఎంతో ధైర్యంగా అమలు చేస్తుంటే….కేంద్రం ఎందుకు ఏమీ చేయలేకపోతోందని ప్రశ్నించారు. అంటే గిరిజనులు అనే పదాన్ని కేవలం ఎన్నికలప్పుడే మోడీ వాడుకుంటునారని చాలా స్పష్టంగా తెలుస్తోందన్నారు. కేవలం దళితులే కాదు….బిజెపి హయంలో దేశంలోని సామాన్య ప్రజలందరికి అన్యాయమే జరుగుతోందన్నారు. మోడీ పాలన అంతా కార్పొరేటర్లకు సేవ చేయడం తప్ప….మరేమీ జరగలేదని ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా మోడీ హయంలో నిరుద్యోగం… ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయిందన్నారు. గ్యాస్ ధరలు ప్రపంచంలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయన్నారు.

మద్దతు తెలిపినంత మాత్రాన కూటమిలో ఉన్నట్లు కాదు

యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపినంత మాత్రాన విపక్షాల కూటమిలో టిఆర్‌ఎస్ ఉన్నట్లు కాదని కెటిఆర్ స్పష్టం చేశారు. యశ్వంత్ సిన్హా విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్‌లు తదితరులు టిఆర్‌ఎస్ మద్దతు కోరిన నేపథ్యంలో తాము సపోర్ట్ చేస్తున్నామన్నారు. తాము మద్దతు తెలపడమే కాకుండా ఇతర పార్టీలు కూడా మద్దతివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో యశ్వంత్ సిన్హా గెలిచి…. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.

గిరిజనులను కాల్చి చంపినప్పుడు ఆమె నోరు ఎందుకు మెదపలేదు?

ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పట్ల వ్యక్తిగతంగా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కెటిఆర్ స్పష్టం చేశారు. ఆవిడ మంచి వ్యక్తే కావొచ్చు….కానీ గిరిజన, మహిళా అభ్యర్థిని చెప్పడం సరికాదన్నారు. జనవరి 2, 2006లో ఒడిశాలో కళింగనగర్‌లో స్టీల్ ప్లాంట్ వద్ద ఆందోళన చేస్తున్న 13 మంది గిరిజనులను అప్పట్లో కాల్చిచంపారన్నారు. నాటి రాష్ట్ర ప్రభుత్వంలో బిజెపి భాగస్వామి అని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. ద్రౌపది ముర్మ అప్పట్లో మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ జరిగిన ఘటనపై ఆమె ఎలాంటి సానుభూతి తెలుపలేదన్నారు. గిరిజనులకు అన్యాయం జరిగిందని ఒక్క మాట ఆమె ఎందుకు కూడా మాట్లాడలేదని కెటిఆర్ ప్రశ్నించారు.

అది వారి భావదారిద్య్రానికి నిదర్శనం

బిజెపి మొదలు పెట్టిన సాలు దొర కాంపెయిన్‌పై కెటిఆప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అది వారి రాజకీయ భావదారిద్య్రానికి నిదర్శనమనేనారు. సిఎం కెసిఆర్ ఫోటో పెట్టకపోతే వాళ్ళను చూసే మొఖం లేదని…అందుకే సిఎం ఫోటోను పెట్టుకుని వెటకారం చేస్తున్నారన్నారు. వారికంటే చిల్లరగా ఉండాలంటే….టిఆర్‌ఎస్ పక్షాన ఎన్నో కార్యక్రమాలను చేపట్టగలమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలను రాష్ట్ర వ్యాప్తంగా దగ్ధం చేయవచ్చు అని అన్నారు. కానీ తాము అలా చేయమన్నారు. అలాంటి చిల్లర పనులకు టిఆర్‌ఎస్ దూరంగా ఉంటుందన్నారు.

దేశాన్ని దివాళా తీయించిన ఘనత మోడీ సర్కార్‌దే

దేశాన్ని మోడీ సర్కార్ పూర్తిగా దివాళా తీయించిందని కెటిఆర్ విమర్శించారు. అప్పులు ఇచ్చి గొప్పలు చెప్పుకునే దౌర్భగ్య నేత మన ప్రధానిగా ఉండడం సిగ్గుచేటని విమర్శించారు. ఎనిమిదేళ్ల బిజెపి పాలన అంతా అప్పుల మయమేనని ఆరోపించారు. పైగా తామే దేశాన్ని మోస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తునన్నారని మండిపడ్డారు. మోడీకి ఉన్నది రాజ్యాంగ దాహామే తప్ప దేశాభివృద్ధి పట్టదన్నారు. పలు రాష్ట్రాల్లో బిజెపికి అధికారంలో కొనసాగేందుకు అవసరమైన మెజారిటీ లేకపోయినా….. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారన్నారు.

గుజరాత్ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా మోడీ పని చేసినప్పటికీ ఇప్పటికీ ఆ రాష్ట్రంలో కరెంట్ ఇబ్బందులు ఉన్నాయన్నారు. దీనిని బట్టే మోడీ పాలన ఎంత గొప్పగా ఉందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. అలాగే రాష్ట్రపతి అభ్యర్ధి అయిన ద్రౌపది ముర్ము సొంతూరులో కూడా కరెంట్ లేదన్నారు. అభ్యర్ధిగా ఖరారు చేసిన తరువాతనే ఇప్పటికిప్పుడు కరెంటు ఇస్తున్నారన్నారు. బిజెపి చేసేవన్నీ జుమ్లా వ్యవహారాలేనని ఆయన మండిపడ్డారు. అయితే జుమ్లా.. లేదంటే హమ్లా అని విరుచుకుపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News