Tuesday, April 23, 2024

చట్టసభల్లో రైతు ప్రాతినిధ్యమేది?

- Advertisement -
- Advertisement -

భారతీయుల ప్రధాన వృత్తి వ్యవసాయం. దేశ జనాభాలో సుమారు 60% మంది వ్యవసాయం లేదా దాని అనుబంధ పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు. అయితే ప్రభుత్వ పాలనా పరంగా అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్న రంగం కూడా అదే. వ్యవసాయాన్ని, రైతుల ఆర్థిక పరిస్థితులను ఒక పరిపూర్ణ ప్రణాళిక ద్వారా మెరుగుపరచకుండా క్షతగాత్రుడికి బ్యాండేజి కట్లు కట్టినట్లు అరకొర పథకాలతో ఎన్నికల్ని దాటేందుకు మాత్రమే ప్రతి ప్రభుత్వం ఆలోచిస్తోంది. రైతులకు అవసరమైన విత్తనాల, ఎరువుల ధరలు పెరగని సంవత్సరం లేదు. నకిలీ మందుల బెడద తీర్చేవారు లేరు. మద్దతు ధర కాగితాలకే పరిమితం. నకిలీ విత్తనాలు, పెస్టిసైడ్స్ అమ్మే, పంటను కొనే వ్యాపారుల చేతుల్లో రైతులు నిండా మునుగుతున్నారు.

ఎన్ని కఠిన చట్టాలు ఉన్నా అమాయక రైతులకు వాటి ప్రయోజనం దక్కడం లేదు. వ్యవసాయం శాఖ నుండి ఎలాంటి శిక్షణ, రక్షణ లేక దిక్కులేని పరిస్థితుల్లో బతుకుతున్నారు. దీనికి ప్రధాన కారణం చట్ట సభల్లో రైతు ప్రతినిధులకు తగిన స్థానం లేకపోవడమే అనుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లోంచి వచ్చిన అగ్ర వర్ణాల నేతలందరూ తాము రైతులమే అని చెప్పుకుంటారు. కానీ వారంతా వందల ఎకరాల భూస్వాములే తప్ప సాగు కష్టనష్టాలను ఎదుర్కొంటున్న రైతులు కాదు. ఇంకా చెప్పాలంటే భూమికి యజమానులై వేలాది కౌలు రైతుల ఉసురు పోసుకుంటున్నవారని కూడా చెప్పవచ్చు. భూమి ఉన్నందుకు రైతుబంధు తీసుకుంటున్నాం, అందులో తప్పేంటి అని నిర్లజ్జగా వాదించే నాయకులను మనం చూస్తున్నాం. తెర వెనుక కౌలు రైతుల అరగోసకు తామే కారణమని తెలిసీ దాస్తున్న సత్యమిది. అందరూ రైతు కుటుంబం నుంచి వచ్చామని చెప్పుకున్నా నాగలి పడుతున్నవారు మాత్రం కాదు.

వ్యవసాయిక కుటుంబాల్లోంచి వచ్చిన రాజకీయ నాయకులంతా కాంట్రాక్టుల్లో, రియల్ ఎస్టేట్ దందాల్లో, వ్యాపారాల్లో, న్యాయవాద వృత్తిలో స్థిరపడి భారీగా ఆదాయాన్ని పొందుతున్నవారే. వారిని రైతు ప్రతినిధిగా లెక్కించలేము. రైతుల కోసం ఉద్యమాలు చేపట్టేవారు, చట్ట సభల్లో వారి సమస్యలపై గట్టిగా ప్రశ్నించేవారు మాత్రమే రైతు ప్రతినిధులుగా పరిగణింపబడతారు. ఈ రోజుల్లో ఏ పార్టీ తరపున గెలిచినా చట్ట సభల్లో రైతుల పక్షాన గట్టిగా గొంతెత్తేవారు, ప్రభుత్వ నిర్ణయాలను నిలదీసేవారు, నిరసన తెలిపేవారు పూర్తిగా కరువయ్యారు. అందుకే దేశంలో రైతు బతుకు కేవలం వ్యాపారవేత్తల లాభాలకు బలవుతోంది. పార్టీకి ఆర్థికంగా సాయపడేవారి కోరిక మేరకు బడ్జెట్ తయారు చేయడంతో పాటు, చట్టసభల్లో ఉన్న సభ్యులకు సాగు బాధలు స్వయంగా తెలియకపోవడం వల్ల వారి పట్ల తేలికభావం ఏర్పడింది. పైగా ఉన్నత వర్గాలకు చెందిన వారికి శ్రమ జీవులపై సానుభూతి ఉండకపోవడంతో పేదల అవసరాల పట్ల వారికి నిరాసక్తి ఉంటుంది.

అందుకే చట్టసభల్లో రైతు కష్టాలను తెలపడానికి అందులో సభ్యులుగా రైతులు లేదా రైతు ఉద్యమ నేతలు ఉండాలి. అయితే ఈ రోజుల్లో ఏ పార్టీ వారికి టికెట్ ఇచ్చే ఆలోచనలో లేదు. వారు స్వయంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే పరిస్థితులు లేవు. జంప్ జిలానీలకు టికెట్లు సర్దే విషయంలో తలమునకలైన పాలక పార్టీలకు కనీసం ఒకరిద్దరినైనా రైతుల పక్షాన సభలో కూచోబెడదామన్న ఇంగితం లేదు. రాజ్యసభ, విధానమండలి కూడా పార్టీలని మేపేవారితోనే నింపుతున్నారు. పార్టీల మారడం కూడా సంఘసేవ అని చెప్పుకొనే స్థాయిలో మనవాళ్లున్నారు. ప్రస్తుత తెలంగాణ విధాన మండలిలో ఒక్క రైతు ప్రతినిధి కానరాడు. జనాభాలో సగం మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయం తరపున చట్టసభల్లో కనీసం 10 శాతమైనా లేకపోవడం మన దౌర్భాగ్యం.

ఒకప్పుడు రైతుల సమస్యలపై అవగాహన కలవారిని వ్యవసాయశాఖ మంత్రిగా ఎంపిక చేసేవారు. సుదీర్ఘ రాజకీయ జీవితం గల వడ్డే శోభనాధీశ్వరరావు వ్యవసాయం మంత్రిగా సభలో రైతుల గురించి పక్షపాతం లేకుండా మాట్లాడేవారు. కోనేరు రంగా రావు పేదలకు భూపంపిణీ విషయంలో ఆనాటి ప్రభుత్వానికి విధివిధానాలు రూపొందించి అందించారు. రైతు నేపథ్యం గల జువ్వాడి చొక్కా రావు తెలంగాణలో సాగు, తాగు నీటి పారుదల సౌకర్యాలకై ఎంతో కృషి చేశారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్‌కు ఆయన పేరు పెట్టారు. వ్యవసాయ మంత్రిగా పని చేసిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యవసాయంలో డాక్టరేట్ చేసి పాఠాలు కూడా చెప్పా రు. చట్ట సభ్యుడిగా ఆయన ఎన్నో వ్యవసాయ సంస్కరణల కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. యలమంచిలి శివాజీ రాజ్యసభలో, బయటా రైతు శ్రేయోభిలాషిగా కృషి చేశారు. వ్యవసాయ పద్ధతులపై సాధికారిత గల రైతునేత ఆయన.
గత పదేళ్లుగా పార్లమెంట్‌లో రైతు నేపథ్య ప్రజా ప్రతినిధుల సంఖ్య తగ్గిపోతోంది.

వందకు పైగా గ్రామీణ జీవితాల్లోంచి వచ్చిన సభ్యులు ఉండే లోక్‌సభలో ఇప్పుడు కేవలం 38 మంది మాత్రమే వ్యవసాయం కుటుంబాల్లోంచి వచ్చినవారున్నారు. 40 % సభ్యులు తమ అఫిడవిట్‌లో సాగు భూమి కలిగి ఉన్నా అది కేవలం స్థిరాస్తిగానే లెక్కించాలి. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ నికార్సయిన రైతు పక్షపాతి. నెహ్రూ ప్రతిపాదించిన సామూహిక వ్యవసాయ పద్ధతిని ఆయన వ్యతిరేకించి రైతుకు భూమిపై హక్కు ఉండాలని కృషి చేశారు. ఆయన సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు. ఆయన జన్మదినాన్ని కిసాన్ దివస్‌గా ప్రకటించారు. దేవీలాల్, అజిత్ సింగ్ కూడా వ్యవసాయ శాఖా మంత్రులుగా తమ ముద్ర వేశారు. అయితే వీరితో పోల్చదగ్గ నేతలెవరూ ప్రస్తుతం చట్టసభల్లో లేరు. రైతు పక్షాన నిలబడాలనే నిబద్ధత పూర్తిగా లోపించింది. ప్రస్తుతం రైతుల సంస్థలపై ఉద్యమిస్తున్న వారెవరూ ఎన్నికల్లో నిలబడి గెలిచే అవకాశం లేదు. వారిని ఏ పార్టీ కూడా తమ అభ్యర్థులు ప్రకటించేందుకు సిద్ధంగా లేవు.

యుపిలో రైతుల కరెంటు బిల్లు, నీటి బిల్లు తగ్గించాలని పోరాడిన దివంగత రైతు నాయకుడు మహేంద్ర సింగ్ టికాయత్ రెండు పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసినా గెలుపు ఆయన్ని వరించలేదు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకొనేలా కేంద్రం మెడలు వంచిన రైతు నేత రాకేష్ టికాయత్ 2007లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. హక్కులనేత యోగేంద్ర యాదవ్ కూడా ఆప్ తరపున 2014 లో పార్లమెంటుకు పోటీచేసి గెలవలేకపోయారు. ఇలా నేటి ఎన్నికల పర్వంలో రైతు నేతలు నెగ్గుకు రాలేకపోతున్నారు. పార్టీలు నిజమైన రైతు పక్షపాతులకు టికెట్ ఇవ్వకపోవడం, నిలబడ్డవారిని జనం గెలిపించుకోకపోవడం వల్ల చివరకు రైతుల గురించి చట్టసభల్లో ప్రశ్నించేవారు లేకుండా పోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News