Friday, May 3, 2024

వర్గీకరణ దిశగా!

- Advertisement -
- Advertisement -

Sonia Gandhi holds meet with 7 state CMs షెడ్యూల్డ్ కులాల (ఎస్‌సిలు) రిజర్వేషన్లలో సగ భాగాన్ని వాల్మీకులు, మజాబీ సిక్కులకు కేటాయిస్తూ పంజాబ్ ప్రభుత్వం చేసిన చట్టం చెల్లుతుందని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం నాడిచ్చిన తీర్పు ఎస్‌సిల కోటా అమలు తీరును విశేషంగా ప్రభావితం చేయనున్నది. ఈ కోటాను విభజించి దిగువనున్న ఉప వర్గాలకు కూడా వారి జనాభా దామాషా మేరకు వాటా కల్పించాలంటూ చిరకాలంగా సాగుతున్న ఉద్యమాలకు ఈ తీర్పు బలాన్ని చేకూరుస్తుంది. 2004లో ఇవి చిన్నయ్య x ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు లో సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాజా తీర్పు పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. రాజ్యాంగం 341 అధికరణ కింద రాష్ట్రపతి ఆమోదించిన జాబితాలో గల షెడ్యూల్డ్ కులాలు అనే వర్గం విభజించడానికి వీలులేనిదని, అందుచేత ఎస్‌సి కోటా వర్గీకరణ చెల్లదని 2004 తీర్పులో అప్పటి ధర్మాసనం స్పష్టం చేసింది.

దానితో ఎస్‌సి కోటాను విభజించిన అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చట్టం రద్దయింది. గురువారం నాడు జస్టిస్ అరుణ్ మిశ్రా నాయకత్వంలోని ఐదుగురు జడ్జీల బెంచ్ ఇచ్చిన విరుద్ధమైన తీర్పు ఈ వివాదాన్ని తిరిగి ముందుకు తెస్తున్నది. అయితే ఈ రెండు తీర్పులు సమాన స్థాయి ధర్మాసనాలిచ్చినవి కాబట్టి ఈ వివాదాన్ని మరింత విస్తృతమైన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించాలని కోర్టు నిర్ణయించింది. ఆ తీర్పు వచ్చేంత వరకు ఉప కోటా అమల్లోకి రాదు. ఉప కోటా విధానం వల్ల ఎస్‌సిలందరూ ఒకే గొడుగు కింది వారనే స్థితిలో మార్పు రాగల అవకాశమున్నదని, అది దళిత ఉద్యమ ఐక్యతను దెబ్బ తీస్తుందనే వ్యాఖ్యానం అప్పుడే బయల్దేరింది. దీనికి రిజర్వేషన్ల వల్ల ఎస్‌సిల్లో పైబడిన వారి (క్రీమీలేయర్) ని వాటి పరిధి నుంచి తొలగించాలన్న తాజా తీర్పులోని ఆదేశం కూడా తోడయితే దళితుల ఐక్య సంఘటన మరింత దెబ్బ తింటుందనే ఊహాగానాలు వినవస్తున్నాయి.

తాజా తీర్పులో జస్టిస్ మిశ్రా ధర్మాసనం ఉప కులాల అంటే ఎస్‌సిలోని కింది వర్గాల తరపున గట్టిగా వకాల్తా పుచ్చుకున్నది. రిజర్వేషన్లు వర్తించే ఎస్‌సి వర్గాలలో పైనున్న కొద్ది మందే వాటి వల్ల లబ్ధి పొందుతున్నారని ఈ కారణంగా వారిలో కుల పోరాటం సాగుతున్నదని ధర్మాసనం అభిప్రాయపడింది. రిజర్వేషన్లు వాటిని ఉద్దేశించిన వర్గంలో అసమానతలు సృష్టించాయని కూడా వ్యాఖ్యానించింది. ఎస్‌సిల్లోని అన్ని కులాల వారికి సమానంగా లబ్ధి చేకూర్చవలసిన కోటాను అందులోని కొద్ది కులాల వారే అనుభవిస్తూ ఉంటే, వారు త్వరగా అభివృద్ధి చెంది మీగడ పొరగా మారితే అటువంటి రిజర్వేషన్లు అసమానతకే దారి తీస్తాయని, ఆకలితో ఉన్నవారందరికీ సమానంగా తిండి అందకపోడాన్ని గమనించాలని కూడా అభిప్రాయపడింది. అందుచేత ఏకశిలా సదృశ వర్గంగా ఎస్‌సిలను పరిగణించడం చెల్లదని పేర్కొన్నది. ఈ అసమానతను సమూలంగా తొలగించడానికి కోటాలో ఉప కోటాను కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని కూడా స్పష్టం చేసింది.

రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ యోధుడు అంబేడ్కర్ చెప్పినట్టు హిందూ సమాజంలోని కుల వ్యవస్థ అసహ్యించుకోదగిన లక్షం వైపు సాగే నిచ్చెన మెట్ల నిర్మాణమనే దానిని ఎవరూ కాదనలేరు. అందుచేత ఎస్‌సిల్లో కూడా అంతర్గతంగా ఈ నిచ్చెనే ఉన్నదని అంగీకరించి తీరాలి. ఈ అంతస్థుల సామాజిక భవనంలో పైనున్న వారు పొందే సౌకర్యం, కింది వరకు అదే స్థాయిలో చేరడం గగనంగానే ఉంటున్నది. అందుకే ఉప కోటా డిమాండ్ ఆరకుండా రగులుతూనే ఉన్నది. రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్లను శాశ్వత ప్రాతిపదిక మీద ప్రసాదించలేదని, అదే సమయంలో వాటి వల్ల బాగుపడిన వారిని వాటి పరిధి నుంచి తొలగించకుండా అర్హులుగా కొనసాగిస్తున్నారని ఈ నేపథ్యంలో ఉప కోటాకు అవకాశాన్ని నిరాకరిస్తూ పోతే అసమానులను సమానులుగా పరిగణించడమే జరుగుతుందని, సమానత్వ హక్కును అది ఓడిస్తుందని ధర్మాసనం వెలిబుచ్చిన అభిప్రాయం ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణతో పాటు మీగడ వర్గాన్ని మినహాయించాలని కూడా సూచిస్తున్నది.

సామాజికంగా, విద్యా విషయకంగా వెనుకబడిన వారికే రిజర్వేషన్లను రాజ్యాంగం ఉద్దేశించింది. విద్యలో పై మెట్టు ఎక్కి ఆర్థికంగా, హోదా పరంగా పైకి వచ్చినా కులపరంగా అనుభవిస్తున్న న్యూనత అంటే సామాజిక వెనుకబాటుతనం, నిమ్న కులాలకు చెందిన వారుగా పరిగణిస్తూ పోడం పూర్తిగా వైదొలగుతుందా? హిందూ కుల వ్యవస్థ నేపథ్యంలో పరిశీలించినప్పుడు ఈ ప్రశ్నకు గట్టిగా ఔనని చెప్పలేము. విస్తృత ధర్మాసనం వీటన్నింటినీ సమగ్రంగా పరిశీలించి అన్ని స్థాయిల్లోని, అన్ని రూపాల్లోని అసమానతలు తొలగిపోడానికి వీలుగా సర్వసమగ్రమైన తీర్పు ఇవ్వవలసి ఉంది. కేవలం రిజర్వేషన్ల వల్లనే దేశంలో సామాజిక, విద్యాపరమైన అసమానతలు నిర్మూలన కావనే వాస్తవాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవలసి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News