Tuesday, April 30, 2024

తన పర్ఫెక్షన్‌తో చావగొడుతుంటాడు

- Advertisement -
- Advertisement -

RRR Team funny complaints about SS Rajamouli

దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకుపోయిన దర్శకుడు.‘బాహుబలి’ సినిమాతో యావత్ భారతదేశ చిత్ర పరిశ్రమను టాలీవుడ్ వైపు చూసేలా చేసిన రాజమౌళి చాలా గ్యాప్ తీసుకొని ‘ఆర్.ఆర్.ఆర్’ అనే భారీ మల్టీస్టారర్‌తో వస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. శనివారం దర్శకధీరుడు 48వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ విభిన్నంగా డైరెక్టర్ రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపింది. ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ సభ్యులు రాజమౌళి మీద ఫిర్యాదు చేస్తూ ఓ వీడియో షూట్ చేసి రిలీజ్ చేశారు. కో డైరెక్టర్ త్రికోటి మాట్లాడుతూ.. “విక్రమార్కుడు సినిమా నుంచి చూస్తున్నా డైరెక్టర్ స్టోరీ సిట్టింగ్స్ ఆఫీస్‌లోనో ఇంట్లోనో పెడుతూ ఉంటాడు. అందరూ స్టోరీ డిస్కషన్స్‌కి బ్యాంకాక్, మలేషియా వెళ్తున్నారు.. మనం కూడా వెళ్దాం… అని నేను ఒకసారి డైరెక్టర్‌ని అడిగాను. తీరా చూస్తే ఇంటి మేడపైకి తీసుకెళ్లి ఇక్కడే స్టోరీ సిట్టింగ్స్‌కి బాగుంటుందని అన్నాడు. ఈసారైనా మీరు బ్యాంకాక్, మలేషియాలలో సిట్టింగ్ పెట్టాలని కోరుకుంటున్నా” అని చెప్పాడు.

కీరవాణి మాట్లాడుతూ ”జనవరిలో పల్లవి చేస్తాం. జూన్‌లో చరణం చేస్తాం. డిసెంబర్‌లో లిరిక్ రాయిస్తాడు. నెక్స్ ఇయర్ మార్చ్‌లో దాని రికార్డింగ్ అంటాడు. ఆ తర్వాత వచ్చే నవంబర్‌లో వాయిస్ మిక్సింగ్ ఉంటుంది. ఈలోపు పల్లవి ఏంటి.. మనం అసలు ఏ సినిమా కోసం పనిచేస్తున్నాం… అనేది మర్చిపోతాం. ఆసక్తి పోతుంది” అని ఫిర్యాదు చేశాడు. హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ “కాంప్లికేటెడ్ షాట్స్ ఎప్పుడూ మనం రిలాక్స్ అవుదాం అనుకునే టైమ్‌లో పెడుతుంటాడు. 12.30కి ఒక షాట్ పెడితే ఒంటి గంటకు కూడా అది ఒకే అవదు. జక్కన్న షాట్‌ని చెక్కుతూ చెక్కుతూ ఉంటే 2.30 గంటలు అవుతుంది. ఆవిధంగా సమయం గడుస్తూనే ఉంటుంది. ఆయన పర్ఫెక్షన్‌తో మమ్మల్ని చావగొడుతుంటాడు” అని చెప్పుకొచ్చాడు. ఇక చరణ్ మాట్లాడుతూ “రాజమౌళి యాక్షన్ సీన్స్ తీస్తున్నాడని జిమ్‌లో ఎక్స్‌ర్‌సైజ్‌లు చేసి వెళ్ళాను. 40 ఫీట్‌ల ఎత్తు నుంచి జంప్ చేసే సీన్ చెప్పాడు. బాగుంది సర్ ఎవరు చేస్తున్నారు అని అడిగితే… ‘నువ్వే చేస్తున్నావ్ చరణ్’ అని అంటాడు. లాప్‌టాప్ తెప్పించి రెండు రోజుల ముందే అన్ని యాంగిల్స్ షూట్ చేసింది చూపిస్తాడు. ఆయన చేసిన తర్వాత మనం చేయకపోతే ఎలా అని.. నో చెప్పలేక ముందుకు వెళ్లిపోతాం”అని చెప్పాడు. చివరగా “ఈ కారణాలకే మీకు థ్యాంక్స్ చెప్తున్నాం.. బెస్ట్ రాబట్టడం కోసం ప్రతిరోజూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్స్‌”అంటూ ఆర్.ఆర్.ఆర్’ టీమ్ దర్శకధీరుడు రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపింది.

RRR Team funny complaints about SS Rajamouli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News