Tuesday, April 30, 2024

ప్రయాణీకుడి ట్వీట్‌తో బస్ ఛార్జీలు సవరించిన సజ్జనార్

- Advertisement -
- Advertisement -

Sajjanar revised bus fares with passenger tweet

మన తెలంగాణ/హైదరాబాద్ : టిఎస్‌ఆర్‌టిసి నష్టాల్లో ఉంది, ప్రతి రూపాయికి ఆర్‌టిసికి కీలకమైన ప్రస్తుత తరుణంలో ఒక ప్రయాణికుడు చేసిన ట్వీట్‌కు స్పందించిన ఆర్‌టిసి గతంలో రౌండ్ ఆఫ్ పేరిట పెంచిన అదనపు వసూళ్లను తగ్గించింది. తాజాగా ఒక ప్రయాణీకుడు బెంగళూరు బస్సు ఎక్కాడు. అయితే టికెట్ రేట్ చూసి ఆశ్చర్యపోయాడు. టికెట్ అసలు ధర రూ.841 అయితే చెల్లించాల్సిన మొత్తం రూ.850 అని ఉండటంతో కండక్టర్‌ను ఆరా తీశాడు. అసలు ధరను మించి రూ.9 అధికంగా ఎందుకు వసూలు చేస్తారని అడిగాడు. ఆ మొత్తం ఎటు పోతోందని ప్రశ్నించాడు. ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో సదరు ప్రయాణీకుడు పోస్ట్ చేశారు. ఈ విషయం ఎండి సజ్జనార్ వరకు వెళ్లింది. అయితే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్‌కు ఈ విషయమై స్పష్టత లేక అధికారులను అడిగారు. టికెట్ ధరలు మార్చినప్పుడు చిల్లర సమస్య రాకుండా రౌండ్ ఆఫ్ చేసే విధానం ఉందని, దాని ప్రకారమే ఆ 9 రూపాయలు వసూలు చేస్తున్నామని సజ్జనార్‌కు వివరించారు.

అయితే అదనంగా వసూలు చేయటం వల్ల ఆర్‌టిసి ప్రతిష్ట తగ్గుతుందని భావించిన సజ్జనార్.. వెంటనే రేట్లను సవరించాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఎక్స్‌ప్రెస్, ఆపై కేటగిరీ బస్సుల్లో రౌండ్ ఆఫ్ ధరను సవరించారు. గతంలో రూ.841 నుంచి రూ.850కి పెంచిన బెంగళూరు టికెట్ ధరను ఇప్పుడు రూ.840కి మార్చారు. అలాగే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కనీస చార్జీ రూ.15, దీనికి సెస్ రూపాయి కలిపితే రూ.16 అవుతుంది. దీనిని చిల్లర ఇబ్బంది పేరిట రూ.20గా రౌండ్ ఆఫ్ చేసి వసూలు చేశారు. ఇప్పుడు దానిని కూడా రూ.15కు తగ్గించారు. ఇలా అన్ని రకాలుగా టికెట్ రేట్లలో మార్పులు చేశారు. దీంతో రోజూ సగటున రూ.10 లక్షల వరకు టికెట్లపై తెలంగాణా ఆర్‌టిసి ఆదాయం కోల్పోనున్నట్లు తెలుస్తోంది. అయినా ప్రజల నమ్మకాన్ని కోల్పోతే అసలుకే మోసం వస్తుందన్న కారణంగా ప్రయాణీకుల విశ్వాసాన్ని మరింత చూరగొనేలా ఆర్‌టిసి ఎండి సజ్జనార్ చర్యలు తీసుకోవడంపై అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News