మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామ రాంమోహన్ రెడ్డి ప్రతిపక్షాలను హెచ్చరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో సహా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సర్వే నిర్వహించిందని, అందులో పార్టీ పరిస్థితి బాగా లేదని నివేదిక వచ్చిందని కొంత మంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు.
ఈ దుష్పచారాన్ని వెంటనే నిలిపి వేయాలని లేకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ తనతో తరచూ సర్వేలు చేయిస్తుంటుందని సైదులు అనే వ్యక్తి మీడియాకు చెప్పడం తన దృష్టికి వచ్చిందన్నారు. పార్టీ పరంగా ఎటువంటి సర్వేలు చేయించలేదని, సైదులుకు తమ పార్టీతో ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ నేతల నుంచి డబ్బులు తీసుకుని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు.