Tuesday, April 30, 2024

85 శాతం మొక్కలు బతకకపోతే సర్పంచ్ పదవి పోతుంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Sarpanch dismissed duo to 85 percentage trees

కరీంనగర్: చెట్లను పెంచి సంరక్షించకపోతే భవిష్యత్‌లో ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగుట్టలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ మొక్కను నాటారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ఇంటింటికి నీరు వచ్చే మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టామన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తుందని, తెలంగాణలో అడవుల శాతాన్ని 33 శాతానికి పెంచడమే లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ఇప్పటి వరకు 180 కోట్లకు పైగా మొక్కలు నాటామని, ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు.

గ్రామాల్లో పెట్టిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బతకకపోతే సర్పంచ్ పదవి పోయేలా పంచాయతీరాజ్ చట్టం తెచ్చామన్నారు. అన్ని రకాల రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కరోనా సంక్షోభంలో కూడా పేదలు, రైతులకు సంబంధించిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవని, రాబోయే నాలుగేళ్లు పూర్తి స్థాయిలో అభివృద్ధిపైనే దృష్టి పెడుతామని వివరించారు. ప్రతి నెలా అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.338 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని మోతె ప్రాంతానికి సాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎంఎల్‌సి నారదాసు లక్ష్మణ్ రావు, ఎంఎల్‌ఎలు రసమయి బాలకిషన్, సతీష్ కుమార్, కోరుకంటి చందర్, సుంకే రవి శంకర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News