Tuesday, April 30, 2024

అగ్రనేత రామన్న భార్య సావిత్రి లొంగుబాట

- Advertisement -
- Advertisement -

మావోయిస్టులందరూ లొంగుబాట పట్టాలి
మావోయిస్టు రహిత రాష్ట్రమే లక్షం
డిజిపి మహేందర్‌రెడ్డి వెల్లడి

మనతెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు పోలీసుల కృషికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని డిజిపి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా పనిచేసిన రామన్న అలియాస్ రావుల శ్రీనివాస్ భార్య రావులు సావిత్రి(46) బుధవారం నాడు డిజిపి కార్యాలయంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా డిజిపి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సావిత్రి భర్త రామన్న 2019లో ఛత్తీస్‌గఢ్ అడవుల్లో గుండెపోటుతో మృతిచెందాడన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో రామన్న మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడని ఆయనపై పోలీసులు రూ.40లక్షల రివార్డు ప్రకటించారని తెలిపారు. 1983లో రామన్న అలియాస్ రావుల శ్రీనివాస్ మావోయిస్టు పార్టీలో చేరాడని, ఈక్రమంలోనే 1993లో ఛత్తీస్‌గఢ్ కుంట దళంలో చేరిన సావిత్రి మావోయిస్టు నేత రామన్నతో కలిసి పనిచేసిందన్నారు.

రామన్న 1994లో సావిత్రిని వివాహం చేసుకున్నారని, వీరి కుమారుడు రంజిత్ అలియాస్ శ్రీకాంత్ సైతం గత ఏడాది పోలీసుల ఎదుట లొంగిపోయారన్నారు. ప్రస్తుతం కిష్టారం ఏరియా కమిటీకి కార్యదర్శిగా పనిచేస్తున్న సావిత్రి తన భర్త రావుల శ్రీనివాస్ మృతిపై సమాచారం సైతం ఇవ్వకపోవడంపై మనస్తాపం చెందిందన్నారు. ఏమాత్రం విలువలు లేని మావోయిస్టులతో కలిసి పనిచేయలేక సావిత్రి లొంగుబాటు పట్టిందన్నారు. గడచిన30 ఏళ్లలో 350 మంది ఆదివాసీలను సావిత్రి మావోయిస్టు పార్టీలో చేర్పించిందని, పలు కీలక ఆపరేషన్‌లలో ఆమె పాల్గొందని తెలిపారు. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం సావిత్రిపై రూ.10లక్షల రివార్డు ప్రకటించిందని, ఇక్కడ లొంగిపోయినందుకు తక్షణ సాయం కింద రూ.50 వేల నగదును సావిత్రికి అందిస్తున్నామన్నారు. అదేవిధంగా అమెకు పునరావాసం, ప్రభుత్వం నుంచి రూ. 5లక్షల ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

మావోయిస్టు రహిత రాష్ట్రమే లక్ష్యం : డీజీపీ

తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఉండాలనే లక్ష్యంతోనే పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందని, ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్ర కమిటీ వాళ్లు రాష్ట్రంలోకి ఎంటర్ అయితే వెంటనే పట్టుకొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పోలీస్‌లోని అన్ని విభాగాలూ అహర్నిశలూ రాష్ట్రాల సరిహద్దుల్లో పనిచేస్తున్నాయని, దళంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెంటనే లొంగిపోవాలని డిజిపి పిలుపునిచ్చారు. లొంగుబాట పట్టిన మావోయిస్టులకు పునరావాస పథకం కింద వెంటనే ప్రభుత్వం తరపున లబ్ధి జరిగేలా చూస్తామన్నారు. తెలంగాణ మావోయిస్టు కమిటీ ఇన్‌చార్జ్జీ కార్యదర్శిగా చంద్రన్న వ్యవహరిస్తున్నారని, అలాగే మావోయిస్టు కేంద్ర కమిటీలో మొత్తం 20 మందిలో 13 మంది తెలుగు వాళ్లు ఉన్నారన్నారు. వారిలో 11మంది తెలంగాణ, మరో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారున్నారన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టులలో 135 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారున్నారని, వీరు ముఖ్యంగా బస్తర్ ప్రాంతంలో పనిచేస్తున్నట్లు తెలిసిందన్నారు.

9 దాడుల్లో 100పైగా పోలీసులు మృతి:

మావోయిస్టు పార్టీలో 30ఏళ్లుగా కీలక పాత్ర షోషించిన సావిత్రి పోలీసులపై జరిగిన 9 దాడుల్లో చురుగ్గా వ్యవహరించిందని, ఈ దాడుల్లో 100మందికి పైగా పోలీసులు మృతి చెందారని డిజిపి వివరించారు. 1992లో లింగన్‌పల్లిలో సావిత్రి పాల్గొన్న ఆపరేషన్‌లో 15 మంది చనిపోయారని, అలాగే 2000లో ఏటిగడ్డ వద్ద ల్యాండ్‌మైన్ బ్లాస్ట్‌లో 5 మంది, 2007 లో కొత్తచెరువు ల్యాండ్‌మైన్ బ్లాస్ట్‌లో 15 మంది నాగా పోలీస్ బెటాలియన్ వాళ్లు చనిపోయారని డిజిపి తెలిపారు. అలాగే 2017లో 24 మంది సిఆర్‌పిఎఫ్ పోలీసులు, 2017లోనే కొత్తచెరువు జరిగిన కాల్పుల్లో 12 మంది సిఆర్‌పిఎఫ్ పోలీసులు,2018 కసారం, 2020మిన్‌ప అంబూష్,2021 టేకులగూడెం అంబూష్‌లలో వెరసి 100 మందికి పైగా మృతిచెందారని డిజిపి వెల్లడించారు. అలాగే సావిత్రి క్రాంతికారి ఆదివాసి మహిళా సంఘటన్, దండకారణ్య ఆదివాసి కిసాన్ మజ్దూర్ సంఘ్, చైతన్య నిత్య మంచ్‌లను ప్రారంభించి కీలక పాత్ర పోషించిందని డిజిపి వివరించారు.

ఆదివాసిలకు సావిత్రి విజ్ఞప్తి:

తన భర్త రామన్న అనారోగ్యం పాలైనప్పుడు కనీసం తనకు సమాచారం ఇవ్వలేదని,చనిపోయినప్పుడు అంతిమ యాత్రలో మాత్రమే పాల్గొనేందుకు సమాచారం ఇచ్చారని సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మావోయిస్టు అగ్ర నేతలు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారని, మూడు దశాబ్దాలతో పోలిస్తే మావోయిజానికి క్రమంగా ఆదరణ తగ్గిందని సావిత్రి చెప్పారు. మావోయిస్టులు బలవంతపెట్టి కొంత మందిని దళంలో చేర్చుకుంటున్నారని, రామన్న దండ కారణ్య కార్యదర్శిగా పనిచేసినా అనారోగ్యం పాలైనపుడు పట్టించుకోలేదని, ఆదివాసిలతో పాటు ఎవరూ మావోయిస్టుల పట్ల ఆకర్షితులు కావొద్దని ఈ సందర్భంగా సావిత్రి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News