Sunday, April 28, 2024

పోరాట యోధుడు సెబాస్టియన్

- Advertisement -
- Advertisement -

కేరళలో జన్మించిన పి.ఎ.సెబాస్టియన్ పోలియోతో బలమైన రెండు కాళ్ళు లేకుండా పుట్టినప్పటికీ మహారాష్ట్రలో అడ్వకేట్ వృత్తిలో పేదల పక్షాల పోరాడుతూ ప్రపంచ ప్రజా న్యాయవాదుల సంస్థను ఏర్పరచి, పేద ప్రజల పక్షాన హక్కుల కోసం నిరంతరం పోరాడిన సెబాస్టియన్‌కు పౌరహక్కుల సంఘం జోహార్లు అర్పిస్తున్నది. 2015 జులై 23న గోవాలో అనారోగ్యంతో మరణించాడు. కానీ ఆయన బతికున్నప్పుడు సమాజంలో నిర్వహించిన పాత్ర చాలా అమోఘమైనది, క్రియాశీలమైనది. సరిగ్గా ప్రొఫెసర్ సాయిబాబా ఢిల్లీ యూనివర్శిటిలో ప్రొఫెసర్‌గా ఉంటూనే ప్రజలకోసం ఎలాగైతే పోరాటం నిర్వహించాడో, ఆ స్థాయిలోనే కొనసాగించినవాడు పి.ఎ. సెబాస్టియన్. పోలియో మూలంగా కాళ్ళు లేకపోయినా రెండు చంకల కింద కర్రెల సహాయంతో అఖిల భారత స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా హక్కుల ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నాడు. అవిటితనమనేది ఆదర్శాలకు, ఆచరణకు ఏ విధంగానూ ఆటంకం కాలేకపోయింది.ప్రజలపై ఎక్కడ అణచివేత జరిగినా, ప్రపంచ వ్యాప్తంగా ఒక కదలిక తీసుకువచ్చేవాడు. దానికి సంబంధించిన ప్రజాస్వామిక పోరాటాలను ఆచరించాలని ప్రజలకు దిశానిర్దేశం చేసేవాడు. నిరసనను ఆందోళనను ఒక పోరాట రూపంగా అంతర్జాతీయ ప్రజాన్యాయవాదుల సంస్థకు ఉండాల్సిన ఖచ్చితమైన లక్ష్యమని నిత్యం ప్రకటించేవాడు. అఖిల భారత న్యాయవాదుల సంస్థ సారథుడు సెబాస్టియన్ మన మధ్యన బతికి ఉంటే బీమా కోరేగావ్ ఊపా కుట్ర కేసులో ఆరోపితుడిగా మార్చేవాళ్ళు.
పి.ఎ. సెబాస్టియన్ మహారాష్ర్టలో ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కమిటీ (Committee For the Protection of Democratic Rights) వ్యవస్థాపక సభ్యుడు. ఈ సంస్థకు దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో ఆయన కృషి ఉంది. మన దేశంలో పని చేస్తున్న హక్కుల సంస్థలతో సత్సంబంధాలు కొనసాగించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో పౌరహక్కుల సంఘంతో అవినాభావ సంబంధం ఉంది. పౌర హక్కుల సంఘం చేపట్టిన అనేక కార్యక్రమాల్లో, సభల్లో పాల్గొన్నాడు. చిన్నతనంలోనే పోలియో వ్యాధి సోకింది. వికలాంగుడుగానే పెరిగి పెద్దవాడయ్యాడు. మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన తర్వాత బొంబాయికి వచ్చాడు. ఇక్కడ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత న్యాయ శాస్త్రంలో పట్టాతీసుకొని బొంబాయి హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించాడు. విద్యార్థి దశలోనే రాడికల్ ఉద్యమాలతో సన్నిహితంగా ఉన్నాడు.ఎమర్జన్సీ మహారాష్ట్రలో తర్వాత హక్కుల సంఘాన్ని (సిపిడిఆర్)ను స్థాపించి మహారాష్ర్టలో హక్కుల ఉద్యమాన్ని విస్తరించాడు. మహారాష్ర్టకే పరిమితం కాకుండా దేశంలో ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగినా వాటి పూర్వాపరాలను పరిశీలించడానికి నిజనిర్ధారణ కమిటీలను వేసి వాటికి సారథ్యం వహించాడు.
1977 మార్చిలో ఎమర్జెన్సీ ఎత్తివేయబడింది. కానీ తెలంగాణ ప్రాంతంలో అనధికారంగా ఎమర్జెన్సీ కొనసాగింది. రైతాంగ పోరాటాలపై ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధాన్ని అమలు చేసింది. కల్లోల ప్రాంతంగా ప్రకటించింది.ఈ నిర్బంధాన్ని అధ్యయనం చేసి నివేదిక తీసుకరమ్మని ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కమిటీ (Committee For the Protection of Demo- cratic Rights), పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేసింది. సిపిడిఆర్ బందం తెలంగాణలో గ్రామీణ పేదల పై నిర్బంధం పేరుతో విలువైన నివేదికను మార్చి 1980లో విడుదల చేసింది. ఈ నివేదిక తయారు చేయడంలో సెబాస్టియన్ పాత్ర ప్రముఖమైనది.
ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు కాలంలో, మార్చి- మే, 1987 కాలంలో విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో అనేక ఆదివాసీ గూడేలను పోలీసులు తగులబెట్టారు. ఆదివాసీలు అప్పటి పీపుల్స్‌వార్‌కు సహకరిస్తున్నారనే నెపంతో వారి గూడేలను తగలబెట్టడం జరిగింది. ఈ సంఘటనలపై పౌరహక్కుల సంఘం స్పందించింది. ఈ సంఘటనలపై పీపుల్స్ హ్యూమన్ రైట్ ట్రిబునల్ విచారణ చేయమని ఎ.పి.సి.ఎల్.సి విజ్ఞప్తి చేసింది. వాస్తవానికి ఈ పీపుల్స్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడంలో సెబాస్టియెన్ ప్రధాన పాత్ర పోషించాడు. పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఈ ట్రిబ్యునల్ సభ్యులుగా కొనసాగారు. దీనికి వి.ఆర్. కష్ణయ్యర్ చైర్మన్‌గా వ్యవహరించారు.
సెబాస్టియెన్ దళితులు, ముస్లింల, ఆదివాసీల హక్కుల కోసం నినదించాడు. బొంబాయిలో మత ఘర్షణల సంఘటనల తర్వాత ముస్లిం బాధితుల వైపు నిలబడ్డాడు. భారత శిక్షాస్మృతి నుండి రాజద్రోహం నేరాన్ని తొలగించాలని డిమాండ్ చేశాడు. ఇదే ‘సెడిషన్’ నేరాన్ని తొలగించాలని మొన్నీ మధ్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ కూడా ప్రయత్నించాడు, కాని దాన్ని తొలగించడమేమో కాని ఆ రాజద్రోహం నేరానికి కూడా 10 ఏళ్ళ జైలు శిక్ష విధించాలన్న ప్రయత్నం నేడు బలంగా సాగుతున్నది. ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రజాస్వామిక బాధ్యత అని నినదిస్తూ ధైర్యం ఉంటే నన్ను సెడిషన్ కింద అరెస్టు చేయండి అంటూ గర్జించాడు. రాజకీయ ఖైదీల విడుదల కోసం ప్రచారం చేశాడు. ఆ సమయంలో 1985లో అమలులోకి వచ్చిన టాడా నిర్బంధ చట్టం అప్పటికే 50 వేల మంది వరకు ప్రజలను నిర్బంధంలోకి తీసుకున్నది. ఆ నిర్బంధాలకు వ్యతిరేకంగా కూడా ఆందోళన కొనసాగుతున్నది. పీపుల్స్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడంలో ప్రధాన బాధ్యత వహించాడు. 1992 బాంబే అల్లర్ల బాధితుల పక్షాన నిలబడి సుమారు 275 మంది హిందువుల పక్షాన, 575 ముస్లింల పక్షాన శ్రీకృష్ణ కమిషన్ ముందుకు వీరి న్యాయమైన కేసులను వివరించారు. మహారాష్ర్టలోని రమాబాయినగర్ హత్యాకాండ, కళ్యాణ్ మత ఘర్షణలు, ముంబై మత ఘర్షణలలో ఖచ్చితమైన నిజనిర్ధారణ నివేదికలను సంస్థ తరఫున వెలువరించడంలో ప్రధాన భూమికను పోషించాడు. మనిషి జీవితాన్ని ఉన్నతీకరించడానికి పౌర ప్రజాస్వామిక హక్కుల అవసరం ఎంతైనా ఉంది. పౌర ప్రజాస్వామిక హక్కుల ఉద్యమాల కార్యాచరణ ద్వారానే హక్కులు వ్యవస్థీకృతమవుతున్నాయి. హక్కులను రాజ్యాంగంలో పేర్కొన్నప్పటికి అమలు చేయాల్సిన రాజ్యం ధనవంతుల పక్షాన నిలబడుతున్నది. హక్కుల కోసం ప్రశ్నించే కార్యకర్తలపై, సామాజిక ప్రజాతంత్ర ఉద్యమకారులపై తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తున్నాయి. మహారాష్ర్టలో పౌర ప్రజాస్వామిక హక్కుల ఉద్యమాలే కాకుండా హేతువాద ప్రజాస్వామ్య ఉద్యమాలపై కూడా మహారాష్ర్ట ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తున్నది. 2013లో దబోల్కర్, పన్సారేల హత్యలు ఈ రాజ్యహింసలో భాగమే. రాజ్యం కొనసాగిస్తున్న నిర్బంధానికి వెరవక హక్కుల ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో ప్రముఖపాత్ర వహించాడు మన సెబాస్టియెన్. రాష్ర్టంలో, దేశంలో ప్రపంచంలోని పీడిత ప్రజల పక్షాన నిలబడి హక్కుల కోసం నిరంతరం శ్రమించిన హక్కుల పోరాటయోధుడు పి.ఎ. సెబాస్టియన్. ప్రతి ఒక్కరూ పి.ఎ. సెబాస్టియెన్ లాగా ప్రజల కోసం, వారి హక్కుల కోసం నిబద్ధతతో పనిచేయాల్సిన తప్పనిసరి పరిస్థితులలో పౌరహక్కుల సంఘం జోహార్లు చెబుతూ గుర్తు చేస్తున్నది.

-ఎన్. నారాయణ రావు,  పౌరహక్కుల సంఘం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News