Sunday, May 5, 2024

అఖిలప్రియ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రిమాండ్ రిపోర్టుతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అఫీజ్‌పేటలోని లాండ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున ఎవి సుబ్బారెడ్డి ఆర్థికంగా లాభం పొందినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని, ప్రవీణ్‌కుమార్ 2016లో సర్వే నంబర్ 80లో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని, అయితే ఎవి సుబ్బారెడ్డి, అఖిలప్రియ, భార్గవరామ్‌లు భూమి తమదంటూ లిటిగేషన్ పెట్టడంతో ఈ భూ వివాదంపై పలు సార్లు చర్చలు జరిగాయి. కాగా చర్చల అనంతరం ప్రవీణ్ రావు భూ వివాదానికి సంబంధించి సెటిల్‌మెంట్ నిమిత్తం ఎవి సుబ్బారెడ్డికి డబ్బులు చెల్లించారు. ఈ సెటిల్‌మెంట్ విషయం తెలుసుకున్న అఖిలప్రియ భూమి విషయంలో తమతో కాకుండా ఎవి సుబ్బారెడ్డితో ఎలా ఒప్పందం కుదుర్చుకుంటారని ప్రవీణ్‌రావు, అతని సోదరులపై బెదిరింపులకు పాల్పడింది. ఈ క్రమంలో మొదటి ఒప్పందం ప్రకారం కాకుండా పెరిగిన భూమి విలువ ప్రకారం మరికొన్ని డబ్బులు చెల్లించాలని ఎబి సుబ్బారెడ్డి, అఖిలప్రియ వేర్వేరుగా ప్రవీణ్ రావుని డిమాండ్ చేశారు. అధికమొత్తాలు డిమాండ్ చేయడంతో అందుకు ప్రవీణ్ రావు నిరాకరించడంతో వివాదం మళ్లీ మొదలైంది. అఫీజ్‌పేట్ భూమికి సంబంధించి ఎవి సుబ్బారెడ్డికి, అఖిలప్రియకు డబ్బులు చెల్లించనని ప్రవీణ్‌రావు తేల్చి చెప్పడంతో ఎలాగైనా డబ్బులు రాబట్టాలని అఖిలప్రియ దంపతులు పథకం రచించారు.

ఇందులో భాగంగా కిడ్నాప్ వ్యవహారాల్లో ఆరితేరిన గుంటూరుకు చెందిన సాయితో కలిసి అఖిల ప్రియ దంపతులు ప్రవీణ్ ‌రావుతో పాటు అతని సోదరులను అపహరించాలని ప్లాన్ చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కాగా ప్రవీణ్‌రావు సోదరులను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్‌లో ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారు. సంతకాలు తీసుకునే సమయంలో అఖిలప్రియ, ఎవి సుబ్బారెడ్డి, భార్గవరామ్ పేర్లను ప్రస్తావించారు. ఈక్రమంలో కిడ్నాప్ సమయంలోనూ కిడ్నాపర్లు పదే పదే ఈ ముగ్గురితో సంభాషణ జరిపినట్లు బాధితులు చెప్పారని, అలాగే సంతకాలు తీసుకునే సమయంలో కర్రలతో కిడ్నాపర్లు బాధితులపై దాడి చేశారని రిపోర్టులో పేర్కొన్నారు. కిడ్నాప్ వ్యవహారంలో ముందే అఖిలప్రియను అదుపులోకి తీసుకోకపోతే కీలక సాక్ష్యాధారాలు తారుమారు అయ్యేవని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఇదిలావుండగా భార్గవరామ్, అఖిలప్రియ దంపతులకు నేర చర్రిత కూడా ఉందని, మంత్రిగా పనిచేసిన అఖిలప్రియకు సాక్ష్యాధారాలను తారుమారు చేయడంలో పలుకుబడి ఉందని రిపోర్టులో పేర్కొన్నారు. అఖిల ప్రియ భర్త భార్గవరామ్‌కు కూడా నేరచరిత్ర ఉందని నివేదికలో పేర్కొన్నారు.. ఈ కేసులో మరో ఐదుగురు పరారీలో ఉన్నట్టు తెలిపారు.
అఖిలప్రియ పిటిషన్ కొట్టివేత:
కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గురువారం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు కొట్టివేసింది. ఈక్రమంలో అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌తో పాటు మెరుగైన వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడగా, మెరుగైన వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. జైలులో అవసరమైన వైద్య సదుపాయాలు ఉన్నాయని, అందుబాటులో వైద్యులు కూడా ఉన్నారని కోర్టు పేర్కొంది. అయితే జైలు అధికారులు ఆస్పత్రికి తరలించాలని సూచిస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించింది. ఇక శుక్రవారం నాడు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలంటూ కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం రోజు వాదనలు కొనసాగనున్నాయి.
అఖిలప్రియ హెల్త్ రిపోర్ట్:
భూమా అఖిల ప్రియకు గైనిక్ ట్రీట్మెంట్ జరుగుతుందని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అక్టోబర్ నుండి చికిత్స పొందుతున్నట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అఖిల ప్రియ గర్భం దాల్చినట్టు హెల్త్ రిపోర్ట్స్ ను కూడా కోర్టుకు సమర్పించారు. వీటితో పాటు అఖిల ప్రియ హెల్త్ కండిషన్‌కు సంబంధించిన రిపోర్టులను పోలీసులు కోర్టుకు అందజేశారు. అయితే, జైలులో సరైన సదుపాయాలు లేవని, మెరుగైన వైద్యం అవసరమని అఖిల ప్రియ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు అఖిల ప్రియ ఆరోగ్యానికి సంబంధించిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News