Saturday, April 27, 2024

నివ్వెరపోయిన ప్రపంచం

- Advertisement -
- Advertisement -

నివ్వెరపోయిన ప్రపంచం
ప్రజాస్వామ్యం కీలకం : మోడీ
నేతలు రీతితో మెదలాలి : ఐరాస

న్యూఢిల్లీ/టోక్యో: అమెరికాలో క్యాపిటల్ బిల్డింగ్‌పై జరిగిన దాడి ఇతరత్రా హింసాత్మక ఘటనలపై ప్రపంచదేశాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి కూడా ఈ దాడి ఘటనను ఖండించింది. పలువురు నేతలు అరాచకం, గందరగోళం చెలరేగడం అవాంఛనీయం అని వ్యాఖ్యానించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉద్వేగభరిత ట్వీటు వెలువరించారు. అధికార మార్పిడి శాంతియుతంగా, సజావుగా జరగాలి. నిరసనల ప్రక్రియలతో ప్రజాస్వామ్యాన్ని మంటగలపాలనుకోవడం అవాంఛనీయం అని తెలిపారు. అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేని అసాధారణ పరిస్థితి నెలకొనడం బాధ కల్గించిందని వ్యాఖ్యానించారు. అమెరికాలో జరిగింది చాలా పెద్ద తప్పిదం అని న్యూజీలాండ్ ప్రధాని జకిండా అర్డెర్న్ విమర్శించారు. ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రస్ మాట్లాడుతూ అమెరికా పరిణామాలతో తాను కలత చెందినట్లు తెలిపారు.

ఈ విషయాన్ని ఐరాస ప్రతినిధి స్టెఫెన్ డుజార్రిక్ తెలియచేశారు. ఇటువంటి పరిస్థితుల్లోనే నేతలు సంయమనంతో వ్యవహరించాలి. వారి అనుచరులు హింసకు పాల్పడకుండా చూడాల్సి ఉంది. ప్రజాస్వామిక ప్రక్రియను ఆదరించాలి, అంతకు మించి సజావుగా అధికార మార్పిడికి సరైన వాతావరణం కల్పించాల్సి ఉందని తెలిపారు. అమెరికా మిత్రదేశాలూ, ప్రత్యర్థి దేశాల నేతలు కూడా ఇప్పటి పరిణామాలపై స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా పర్యటనకు వెళ్లవద్దని సూచించారు. జపాన్, వెనిజులా, చిలీ ఇతర దేశాల నేతలు కూడా ప్రస్తుత పరిస్థితిపై స్పందించారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పందిస్తూ అమెరికాలో జుగుప్సాకర వాతావరణం నెలకొందన్నారు. అమెరికా అంటేనే ప్రజాస్వామ్యానికి ప్రతీక అని, అక్కడ ఇటువంటి పరిస్థితి ఏర్పడటం బాధాకరం అని, ఇకనైనా అధికార మార్పిడి సజావుగా సాగిల్సి ఉందన్నారు. నైజిరియా ఇటలీలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. అమెరికాలో పరిణామాలను ఇటలియన్లు దిగ్భ్రాంతితో టీవీలలో తిలకించారు. యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షులు డేవిడ్ ససోలి స్పందిస్తూ ఇప్పటి ఘటనలను ఇయూ ఖండిస్తోందన్నారు. ట్రంప్ హయాంలో అమెరికాకు, ఇయూకు మధ్య కంటకప్రాయమైన సంబంధాలు ఉన్నాయి. ఇవి ఇప్పుడు సమసిపోతాయని, బైడెన్ ఆధ్వర్యంలో అంతా సజావుగా ఉంటుందని ఆశిస్తున్నట్లు ఇయూ నేతలు తెలిపారు.

world leaders shock with Attack on US Capitol

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News