Sunday, April 28, 2024

దేవుడితో సెల్ఫీ… ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు!

- Advertisement -
- Advertisement -

ప్రాచీన విజ్ఞానానికి మూల సూత్రం దైవ భావన. దేవుడనే వాడు వున్నాడనే భావనే దైవ భావనకు మూలం. ఆ భావననే ఇటీవల ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు సవాలు చేశారు. ‘దేవుడున్నాడని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూటరేట్ సవాలు విసిరారు. దావోస్‌లో 8 జులై 2018న జరిగిన శాస్త్ర సాంకేతిక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన అస్తిత్వవాదులకు ఒక అవకాశమిచ్చారు. దేవుడిని చూసిన మనిషిని తీసుకొచ్చినా, దేవుడితో దిగిన ఫోటో లేదా సెల్ఫీ తీసుకొచ్చినా తాను తప్పక రాజీనామా చేస్తానని అన్నారు. అయితే అది వైజ్ఞానిక పరిశీలనలకు నిలబడాలనీ ఆయన కోరారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి రాజీనామా వల్ల ప్రపంచానికి పెద్దగా ఉపయోగం వుండదు. నిజమే! కాని, దేవుని ఉనికి ప్రపంచానికి చాటి చెప్పిన వారవుతారు. దైవభావన రైలు ఇంజిన్ లాంటిదయితే, దాని వెంట ముహూర్తం, జ్యోతిస్యం, ప్రేయర్లు, భజనలు, నవాజ్‌లు, మత బోధలు, సంస్కృతి, సంప్రదాయాలు వంటివన్నీ రైలు బోగిల్లాగా… ఆ దైవభావన వెంట బిలబిలమని పెరుగెడుతుంటాయి. వాటి ఆధారంగానే బాబాలు, యోగులు రెచ్చిపోతున్నారు.

ముహూర్తం మూఢ నమ్మకమని ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. గోదావరి పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోవడాన్ని జస్టిస్ సోమయాజులు నివేదిక తప్పుడు నివేదిక సమర్పించింది. నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పిదాన్ని కప్పిపుచ్చడానికి ఆ దుర్ఘటనకు కారణం పంచాగ కర్తలు, మీడియా, ప్రవచన కర్తలు మాత్రమేనని.. ఇందులో ముఖ్యమంత్రి ప్రమేయం ఏమీ లేదని వెల్లడించింది. అంటే పాలకులు అవసరమైనప్పుడు మూఢ నమ్మకాల్ని పెంచి పోషిస్తారు. మెడకు ఉచ్చు బిగుసుకునే సరికి తప్పు పంచాగ కర్తలపైకి తోస్తారు. ఒక మూఢ నమ్మకానికి టముకేసి ప్రచారం చేసుకొన్న ప్రభుత్వాలది తప్పు. దానికి మితిమీరిన ప్రాచుర్యాన్ని ఇచ్చిన మీడియాది తప్పు. పంచాగ కర్తలది, ప్రవచన కారులది ఎలాగూ తప్పే. ప్రొటోకాల్ తప్పించి తనకు కేటాయించిన స్థలంలో వెళ్ళి మునగకుండా, మామూలు జనం స్నానాలు చేసే చోట సినిమా షూటింగ్ ఏర్పాటు చేసుకొన్న ముఖ్యమంత్రిది చాలా పెద్ద తప్పు! ఒకవైపు మూఢ నమ్మకాల్ని ప్రోత్సహించేది పాలకులే. మరో వైపు విమర్శించేదీ పాలకులే!

ఈ నీతిమాలిన రాజకీయాల్నే కదా ప్రజలు అసహ్యించుకొంటున్నారూ? కల్పనలు ఎప్పుడూ వాస్తవంలో ఇమడవు. మరో విషయం చూద్దాం. 50 ఏళ్ళు సేవ చేసిన తిరుపతి ప్రధాన అర్చకులు దీక్షితుల సమస్యనే ఆ ఏడు కొండల వెంకన్న తీర్చలేకపోయాడు. ఇక కోన్‌కిస్కా గాళ్ళ సమస్యలేం తీరుస్తాడూ? ఆలోచించాలి! పైగా ఆయనకే సరైన ఆరగింపులు, పవ్వళింపులు లేవని ప్రధాన అర్చకుడు బెంగ పెట్టుకున్నారయ్యే. తిండి లేక మలమలమాడుతున్న కోట్ల జనం గురించి ఆలోచించడం కన్నా, నిజమే అది సత్వరం ఆలోచించవల్సిన విషయమే! విషయం వివాదాస్పదమయ్యే దాకా ప్రభుత్వం వారు చూస్తున్నారూ అంటే ఏడు కొండల వెంకన్న సర్వాంతర్యామి, సకల చరాచర జగత్తుకు మూలమైనవాడు. ఆయనకు మనం భోజనం పెట్టే దేమిటీ? అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అనుకొని ఉంటారేమో ఏమో? లోగుట్టు పెరుమాళ్ళ కెరుక అని అన్నారు కదా? దేవుడి పేరుతో జరిగే అన్ని రకాల అక్రమాల్ని, ప్రభుత్వాల అవినీతికి సామాన్యులు అర్థం చేసుకొని స్పందించనంత కాలం సమాజంలో మార్పురాదు. జనంలో వివేకం పెరిగితే గాని మంచి రోజులు రావు.

చేతబడి, చిల్లంగి, బాణామతి, దయ్యాలు, భూతాలు, వశీకరణ విద్యలు, అక్షయ పాత్ర, అతీంద్రియ శక్తులు, మంత్ర శక్తులు, కుబేర యంత్రాలు, నరఘోష యంత్రాలు, ధనలక్ష్మీ యంత్రాలు, రంగు రాళ్ళు, రక్షరేకులు, రాశి ఫలాలు వంటి అనేక మోసాల నుండి, మూఢ నమ్మకాల నుండి అమాయక ప్రజల్ని కాపాడడానికి మహారాష్ట్ర, కర్నాటక, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని తీసుకొచ్చాయి. అదే రకంగా దేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా చట్టాలు తేవాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ఎ (హెచ్) స్ఫూర్తిని నిలుపుకోవాలి. అయితే సామాన్యులు వివేకవంతులు కాకుండా ఉట్టి చట్టాల వల్ల కూడా లాభం లేదు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న దుష్టచతుష్టయం క్రూరత్వాన్ని సామాన్యులే బట్టబయలు చేయాల్సి వుంది! 1. కులం, 2. మతం 3. అవినీతి రాజకీయం 4. అక్రమంగా ఆర్జించుకున్న ధనం.ఈ నాలుగే సమాజాన్ని ధ్వంసం చేస్తున్న దుష్ట చతుష్టయం. అందుకే డా. బి.ఆర్. అంబేడ్కర్ నిర్మొహమాటంగా ఎప్పుడో చెప్పారు. ‘కులాంతర విందులు, కులాంతర వివాహాలు, కుల సంఘాల మధ్య సయోధ్య.. కుల మతాల్ని నాశనం చేయలేవు. మత భావనలు సమూలంగా నాశనమైతే తప్ప కులాలు అంతం కావు’ అని!

మన దేశంలోని స్వాములు, యోగులు, బాబాలు ఎంతటి క్రియాశూన్యులంటే వాళ్ళెప్పుడైనా మద్యం, గుట్కా, తంబాకుల గురించి మాట్లాడారా? పేరుకు సద్గురువులు! కార్పొరేట్ విద్య, వైద్యం మాఫియాలకు వ్యతిరేకంగా ఎప్పుడైనా మాట్లాడారా? కల్తీలు, కాలుష్యాలు వారికి సమస్యలుగా తోచవా? బ్యాంకులు దివాలా తీసినా, సిబిఐ కుళ్ళు బయటపడ్డా దేశ భద్రతకు విఘాతం కలుగుతున్నా స్పందించరేం? ఈ దేశ పౌరులుగా వాళ్ళకు బాధ్యత లేదా? అవకాశం వెతుక్కొని అధికార పార్టీ చంక నెక్కుతారా? సామాన్యులకు నీతులు బోధిస్తారా? ఇవన్నీ సామాన్యులు గమనిస్తూ విశ్లేషించుకోవాలి. రాసలీల స్వాములుగా వినుతికెక్కిన స్వామి నిత్యానంద ఒక ప్రకటన చేశారు. తాను ఆవులతో సంస్కృతం, తమిళం వంటి భాషలు మాట్లాడిస్తానని, అందుకు తగిన సాఫ్ట్‌వేర్ తయారు చేశారని, సంవత్సరం లోగా చెప్పింది చేసి చూపుతామని సెలవిచ్చారు. కోతులు, సింహాలు, పులుల కోసం కూడా సామర్థమున్న స్వర పేటికను అభివృద్ధి చేస్తామన్నారు. ఇలాంటి ప్రకటనలతో అమాయకుల్ని మోసం చేస్తున్నందుకు కోర్టులు సుమోటాగా స్వీకరించి ఎందుకు విచారించవూ? ఇదొక పనికిమాలిన దద్దమ్న ఛాలెంజ్ అని తెలుస్తూనే వుంది.

తనకు అంతశక్తే వుంటే, ఈ దేశ పౌరుడిగా తనకు బాధ్యత వుందని భావిస్తే దేశంలో వున్న చెవిటి మూగ పాఠశాలకు వెళ్ళి మాట్లాడలేని వారికి మాట్లాడే శక్తిని ఇవ్వొచ్చుకదా? ఆవులు, పులులు మానవుల భాష మాట్లాడకపోయినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదు. వాటి భాష వాటికి వుంది. ఆ విషయం రాసలీల స్వాములుకు తెలిసినట్టు లేదు.
‘ఇంజినీరింగ్ కంటే ఈత గొప్పది’ అని రాశాడొక రచయిత. అలా ఎందుకు రాసి వుంటాడూ? అన్నది బాగా ఆలోచిస్తే విషయం అర్థమైంది. నదీ ప్రవాహానికి నువ్వు ఇంజినీరువా, డాక్టరువా, డైరక్టరువా అన్నది అనవసరం. అప్పుడు అక్కడ నీకు ఈత వచ్చా రాదా అన్నది మాత్రమే ముఖ్యం. ఈత రాకపోతే దేశ ప్రధాని అయినా సరే, నది ముంచేస్తుంది. డబ్బు సంపాదనకు తప్ప మన విద్యా విధానం వివేకం పెంచుకోవడానికి పనికి రావడం లేదు. ఎవరికి వారే స్వయంగా కామన్ సెన్స్ పెంచుకోవాలి. కామన్ సైన్స్ నేర్చుకోవాలి. ప్రశ్నించే తత్వం అలవడితే సమాధానాల అన్వేషణ దానంతట అదే వస్తుంది. ఏ దేవుడూ, దయ్యం అవసరం లేకుండానే మనం హాయిగా బతకొచ్చు. అయితే సైన్స్ ఆసరా మాత్రం తప్పకుండా వుండాలి. సైన్స్ అవసరం లేకుండా ఈ ప్రపంచమ్మీద బతకగలిగే వాళ్ళు మాత్రం లేరు.

చదువుకోవడం, డిగ్రీలు సంపాదించుకోవడం, విదేశాలకు వెళ్ళడం, పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడడం ఈ కాలపు యువతీ యువకుల్ని చూస్తే అంతా బాగానే వున్నట్టు అనిపిస్తుంది. కాని, నిజ జీవితంలో వున్న వాస్తవాల్ని గ్రహించకపోవడం, హేతబద్ధంగా విషయాలు విశ్లేషించుకోకపోవడం పెద్దలోపం. సంస్కృతి, సంప్రదాయం పేరుతో ఏళ్ళనాటి మూఢాచారాల్ని పాటిస్తూ వుండడం విజ్ఞత అనిపించుకుంటుందా? ముత్తాతల పరిజ్ఞానానికి, నేటితరం పిల్లల పరిజ్ఞానానికి బాగా వ్యత్యాసం వుంది కదా? అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు శరవేగంతో వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. అలాంటప్పుడు నేటి జీవితంతో ఏ విధంగానూ ఉపయోగపడని అంశాలకు, ఆనవాయితీలకు ప్రాధాన్యమిస్తూ, కొట్టుమిట్టాడుతూ బతకడం దేనికీ? ఎదుటి వాడిని మనిషిగా గుర్తించకపోయిన తర్వాత నువ్వు మనిషివని చెప్పుకోవడానికి సిగ్గు పడాలి కదా? ఒకప్పుడు దేవాలయాల్లో ప్రవేశానికి హరిజనులు ఉద్యమించారు.స్వాతంత్య్రం లభించిన ఏడు దశాబ్దాల తర్వాత కూడా ఆలయ ప్రవేశాలకు మహిళలు ఉద్యమిస్తున్నారు.

అంటే మనం, మన సమాజం ఎదిగినట్టా, ఎదగనట్టా? స్త్రీని శక్తిస్వరూపిణిగా కొలిచిన ఈ జనమే కొన్ని వందల ఏళ్ళు భర్తల శవాలతో పాటు భార్యలను సజీవంగా సతీసహగమనం పేరుతో నిర్దాక్షిణ్యంగా కాల్చేశారు. స్త్రీ సమానత్వం గురించి మాట్లాడేవారంతా అటు గతాన్నీ ఇటు వర్తమానాన్నీ గమనించాలి. గర్భంలో వున్నది ఆడపిల్లలని తెలిస్తే భ్రూణహత్యలు జరిపించారు కదా? పసికూనల నుండి వృద్ధ మహిళల దాకా లైంగికంగా దాడులుచేస్తూనే వున్నారు కదా? పైగా కిరాతకంగా చంపుతున్నారు కదా? ఏదీ భద్రత? స్త్రీ సమానత్వం ఎక్కడ? స్త్రీని గౌరవించింది ఎక్కడ? వాస్తవాల్ని, నిత్యసత్యాల్ని కప్పిపుచ్చేవారే మతాల గూర్చి మహోన్నతంగా మాట్లాడుతున్నారు. ఆలయ నియమాల ప్రకారం స్త్రీల ప్రవేశానికి అనుమతించకపోతే పోనీండి. స్త్రీలంతా వారి పురుష కుటుంబ సభ్యులతో సహా గుళ్ళను బహిష్కరిస్తే సరిపోతుంది. గొడవే వుండదు. దైవ భావన లేని జీవితం కూడా మానవీయ విలువలతో మహోన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. పీల్చే గాలీ ఏ దేవుడిదీ కాదు. తినే తిండీ ఏ దేవుడిదీ కాదు.

అంతా మనిషి వైఫల్యాల మీద విజయాల మీదే వుంటుంది. ఏ మతానికి సంబంధించిన దేవుడైనా ఢిల్లీ నగరాన్ని కాలుష్యం నుండి కాపాడితే, అప్పుడు ఆలోచిద్దాం? వైజ్ఞానిక పరిధిలోంచి, విశాల దృక్పథంలోంచి, ప్రపంచ పరిధిలోంచి, దేశ కాల పరిస్థితుల్లోంచి తమని తాము విశ్లేషించుకొంటూ ఉంటే మనుషులు ఎదుగుతారు. నూతిలోని ‘కప్ప’ బయటి ప్రపంచాన్నే చూడలేదు. ఇక విశ్వ రహస్యాల్నేం శోధిస్తుంది?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News