Thursday, May 2, 2024

దేశం తలొంచుకోవలసిన ఘటన

- Advertisement -
- Advertisement -

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన యావత్ దేశాన్ని సిగ్గుతో తలవంచుకొనేటట్లు చేసింది. మొత్తం సభ్యసమాజం మాటలు రాక దిగ్భ్రాంతి చెందే దుర్ఘటన. ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి మాతృకగా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా చెప్పుకొనే మనకు ఈ సంఘటన జరిగిన తీరు మాత్రమే కాకుండా, దాని పట్ల యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించిన తీరు మరింత ఆందోళన కలిగించే అంశం. మే 18 ననే పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదయితే, దానికి సంబంధించిన వీడియో రెండు నెలల తర్వాత బైటకు వస్తే గాని నామమాత్రపు అరెస్టులు చేసేందుకు అక్కడి యంత్రాంగం ముందుకు రాలేదు. పైగా, బాధితులైన ఇద్దరు మహిళలో ఒకరు కార్గిల్ యుద్ధంలో పోరాడిన యోధుడి భార్య. అదే పోలీస్ స్టేషన్ లో అంతకు రెండు రోజులకు ముందే మరో ఇటువంటి సంఘటనకు సంబంధించిన ఫిర్యాదుపై మరో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదైనా ఇప్పటికీ ఆ ఘటనపై ఎటువంటి అరెస్టులు కూడా లేవు. రెండున్నర నెలలుగా మణిపూర్‌లో అరాచకం రాజ్యమేలుతున్నది.
మూడు వేలకు పైగా తుపాకులను పోలీస్ స్టేషన్ల నుండే ‘అపహరించుకు’పోయి అమాయక ప్రజలపై కాల్పులు జరుపుతున్నారు. మొత్తం మావోయిస్టు ఉద్యమంలో సహితం అన్ని తుపాకులను దేశం అంత కలిపినా పోలీస్ స్టేషన్ల నుండి అపహరించుకుపోయి ఉండరు. అంటే ఎంతో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయని అర్థం అవుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మొత్తం దేశ ప్రజలను కలవరానికి గురిచేస్తే గాని మణిపూర్‌లో పరిస్థితులపై కొద్దీ సెకండ్ల పాటు పెదవి విప్పేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు రాలేకపోయారు. పైగా, ఈ ఘటనకు బాధ్యులను గుర్తించి, కఠినమైన చర్యలు తీసుకునేందుకు రాజకీయ సంసిద్ధతను చూసే బదులు ఈ దుర్మార్గాన్ని కప్పిపుచ్చేందుకు కొందరు బిజెపి నేతలు చేస్తున్న ప్రయత్నాలు విస్మయం కలిగిస్తోంది. పార్లమెంట్ సమావేశాలకు ముందే వీడియో ఎందుకు బైటకు వచ్చింది అంటూ గతంలో న్యాయ శాఖ మంత్రిగా ఉన్న నేత ప్రశ్నించారు. అప్పుడు వచ్చింది కాబట్టే ప్రధాని స్పందించిన విషయాన్ని ఆయన మరచిపోయిన్నట్లున్నారు. అది బైటకు వచ్చే వరకు కనీసం అరెస్టులు కూడా చేయని మణిపూర్ ప్రభుత్వాన్ని, అక్కడి శాంతి భద్రతలపై ప్రత్యేక ప్రమేయం గల కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆయన ప్రశ్నించి ఉంటే గౌరవంగా ఉండెడిది. ఎంతసేపు ఆ వీడియో ఇప్పుడు బైటకు ఎలా వచ్చింది? దానిని ట్విట్టర్‌లో ఎందుకు పోస్ట్‌చేశారు? వంటి అంశాలపై దృష్టి సారించడమే గాని ఇంతటి ఘోరమైన ఘటన జరిగినా ఎందుకు అక్కడి యంత్రాంగం స్పందించలేదనే ప్రశ్నలు లేవనెత్తకపోవడం గమనార్హం. వెంటనే అక్కడి ముఖ్యమంత్రి లేదా కేంద్ర హోం మంత్రి వెళ్లి బాధితులను కలిసి, అసలేమీ జరిగిందో విచారించే ప్రయత్నం కూడా చేయడం లేదు.
ఈ సందర్భంగా జాతీయ హక్కుల కమిషన్ల స్పందన సహితం మొక్కుబడిగా ఉంది. ఈ ఘటనపై జూన్‌లోనే జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు అందింది. బిజెపి నేతలపై ఏదో మాట్లాడారని అత్యవసరంగా సమన్లు జారీ చేసే కమిషన్ చైర్ పర్సన్ ఈ ఘటనపై మణిపూర్ డిజిపి, ప్రధాన కార్యదర్శికి రెండు లేఖలు రాసి మౌనంగా ఉండిపోయారు. కనీసం అక్కడేమి జరిగిందో తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. మే 3న అల్లర్లు ప్రారంభమైనప్పటి నుండి తనకు వచ్చిన ఫిర్యాదులపై మూడు లేఖలు అక్కడి ప్రభుత్వానికి రాసినట్లు ఆమె చెబుతున్నారు.పైగా, తనకు వచ్చిన ఫిర్యాదులు కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారి నుండి, మరి కొన్ని విదేశాలలో ఉన్నవారి నుండి వచ్చాయని అంటూ కుంటిసాకులు చెబుతున్నారు. పరోక్షంగా మణిపూర్‌లో జరుగుతున్న అనాగరిక చర్యలను సమర్ధించే విధంగా రాజస్థాన్‌లో, పశ్చిమ బెంగాల్‌లో, ఇతర రాష్ట్రాల్లో దారుణమైన హింస చోటు చేసుకోవడం లేదా? అని ప్రశ్నలు వేస్తున్నారు. మణిపూర్ ఘటనలకు, వాటికి మధ్య గల తేడాలను చూడలేకపోతున్నారు. ఆ వీడియో బయటపడితే గాని రెండున్నర నెలల తర్వాత సుప్రీంకోర్టు స్పందించ లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటారా? లేదా తామే తగు ఆదేశాలు జారీ చేయాలా? అంటూ కఠినంగా మాట్లాడింది.కానీ రాజస్థాన్, బెంగాల్ పరిస్థితులు వేరు. అక్కడి ఘటనలపై ఉన్నత న్యాయస్థానాలు స్పందించాయి. జాతీయ మీడియా తమదైన విచారణలు జరుపుతున్నాయి.
బెంగాల్‌లో హింసకు సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు స్పందించాయి. కేంద్ర భద్రతా దళాలను పెద్ద ఎత్తున రంగంలోకి దించాయి. జాతీయ మీడియా అక్కడి ఘటనలపై విస్తృతంగా కథనాలు అందజేస్తున్నది. కానీ మణిపూర్ పరిస్థితులు పూర్తిగా భిన్నం. వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతున్నది. వందల కొద్దీ ఎఫ్‌ఐఆర్‌లు దారుణమైన ఘటనలకు సంబంధించి నమోదైతే, వాటిని కనీసం సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపి తగు దర్యాప్తు జరిపించే ప్రయత్నం కూడా జరగడం లేదు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, మనమంతా సిగ్గుతో తలవంచుకొనేటట్లు దారుణంగా వ్యవహరిస్తే ఆ వీడియో బైటకు వచ్చే వరకు అక్కడి ప్రభుత్వం మౌనం వహించింది. ఏ నాగరిక ప్రభుత్వమైనా అంత దారుణంగా వ్యవహరిస్తోందని ఊహించగలమా? అసమర్ధత కారణంగా మణిపూర్‌లో మారణ హోమం కొనసాగేటట్లు చేస్తున్నారా? లేదా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి కొనసాగినట్లు చేస్తున్నారా? తెలియని దుర్భర పరిస్థితులు నేడు నెలకొన్నాయి. మణిపూర్ పోలీసులు ఇప్పుడు చెబుతున్నారు. వదంతుల వ్యాప్తి కారణంగా ఈ దారుణ ఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితి ఎందుకు దాపురించింది? దీర్ఘకాలం ఇంటర్‌నెట్ బంద్ చేయడం కారణం కాదా? ప్రపంచంలోనే అత్యధికంగా ఇంటర్ నెట్‌ను నిషేధిస్తున్న దేశంగా ఘనమైన మన ప్రజాస్వామ్య దేశం నేడు ప్రఖ్యాతి వహించింది. ఇంటర్ నెట్ నిషేధిస్తున్న కారణంగా అల్లరి మూకలు కట్టడి చేయడం ఏమో గాని దుర్మార్గాలను కప్పిపుచ్చుకునేందుకు స్వేచ్ఛ కలిగించినట్లవుతుందని మణిపూర్ ఘటనలు వెల్లడి చేస్తున్నాయి.
మణిపూర్ పరిస్థితులపై చర్చకు సిద్ధమని చెప్పిన ప్రభుత్వం కేవలం స్వల్పకాలిక అంశంగా మాత్రమే అనుమతిస్తామంటూ భీష్మించుకోవడం ఎటువంటి సంకేతాలు ఇస్తుంది? సవివరంగా చర్చించడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? భారత్‌ను ‘విశ్వగురు’గా చూడాలనుకొంటున్న మనం ఓ సరిహద్దు రాష్ట్రంలో అంతర్యుద్ధం వంటి పరిస్థితులు నెలకొంటే, సాయుధ దళాలకు అప్పచెప్పి పట్టించుకోకపోవడం అనూహ్యం. అంతర్జాతీయంగా మనకు ఎన్నో పతకాలు సాధిస్తూ మన దేశ గౌరవాన్ని ఇనుమడింప చేస్తున్న రెజర్లు అధికార పార్టీ ఎంపిపైననే లైంగిక వేధింపు ఆరోపణలు చేస్తూ వీధులలోకి వస్తే వారి పట్ల కూడా హుందాగా వ్యవహరించలేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే గాని ఎఫ్‌ఐఆర్‌ను కూడా దాఖలు చేయలేదు. ఇటువంటి ఉదాసీనత మణిపూర్ మహిళల గౌరవం పట్ల కూడా ప్రదర్శితం కావడం దురదృష్టకరం.
మొదటి సారిగా అట్టడుగు నుండి వచ్చిన ఓ గిరిజన పుత్రిక రాష్ట్రపతి భవన్‌లోకి వచ్చారని మనమంతా గర్వపడ్డాం. కనీసం ఆమె అయినా మణిపూర్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసి, జోక్యం చేసుకొని ఉంటే అమాయక గిరిజన తెగలకు కొంత భరోసా కలిగి ఉండెడిది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కడైనా దురదృష్టకర సంఘటనలు తలెత్తినప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయడం ద్వారా రాజకీయంగా తమ ఉనికి చాటుకొనే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తుండటం సహజమే. అయితే ప్రభుత్వమే ముందుగా స్పందించి, అవసరమైన చర్యలు తీసుకొని ఉంటే ప్రతిపక్షాలకు అవకాశం వచ్చిఉండెడిది కాదు. పైగా నేడు మణిపూర్‌లో జరుగుతున్న మారణహోమం రాజకీయాలకు, మతాలకు అతీతమైన మానవీయ దుర్ఘటన అని గమనించాలి. ఒక సాధారణ శాంతి భద్రతల సమస్యగా పరిగణించి, సాయుధ దళాలను మోహరింపడం ద్వారా ప్రశాంతతను పునరుద్ధరించడం సాధ్యం కాదని రెండున్నర నెలలుగా జరుగుతున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం రాజకీయ సంకల్పం, రాజకీయ జోక్యం ఇటువంటి సందర్భాలలో కీలకం కాగలవు.

-చలసాని నరేంద్ర ,  9849569050.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News