Thursday, May 9, 2024

షిండే వర్గమే సిసలైన శివసేన: ఇసి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివసేన అధికార పార్టీ పేరు, విల్లుబాణం గుర్తు సిఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని రెబెల్ వర్గానికి చెందుతాయని కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి)శుక్రవారం స్పష్టం చేసింది. షిండే వర్గానికే మెజారిటీ మద్దతు ఉందని అభిప్రాయపడింది. దీంతో మహారాష్ట్రలో ఎనిమిది నెలల ఉత్కంఠకు తెరపడింది.బాల్ థాక్రే తనయుడు ఉద్ధవ్ థాక్రేకు షాక్ ఇస్తూ..శివసేన గుర్తింపును ఏక్‌నాథ్ షిండే( ప్రస్తుత ముఖ్యమంత్రి) వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల సంఘం అధికారిక ప్రకటనచేసింది. మహా వికాస్ అఘాడి(శివపేన, కాంగ్రెస్, ఎన్‌సిపి, ఇతరులు)ని వ్యతిరేకిస్తూ గత ఏడాది జులైలో కొందరు పార్టీ ఎంఎల్‌ఎలతో ఏక్‌నాథ్ షిండే పార్ట్టీనుంచి బైటికి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బిజెపితో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తరుణంలో థాక్రే వర్గం, షిండే వర్గం సిసలైన శివసేన గుర్తింపు కోసం న్యాయ పోరాటానికి దిగాయి.

ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం శివసేన పార్టీపేరును, పార్టీ గుర్తు అయిన బాణంను పక్కన పెట్టి ఇరు వర్గాలకు ప్రత్యేక పేర్లను, వేర్వేరు గుర్తులను కేటాయించింది. అయితే ఇసి నిర్ణయంపై థాక్రేవర్గం ఢిల్లీ కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. గత నెలలో ఇరువర్గాలు తమదే సిసలైన శివసేన అంటూ తమతమ వాదనలతో ఎన్నికల సంఘం ముందు రాతపూర్వక ప్రకటనలు సమర్పించాయి. ఈ తరుణంలో ఇసి శుక్రవారం షిండే వర్గానికి శివసేన పార్టీ పేరును, గుర్తును కేటాయించి థాక్రే వర్గానికి షాక్ ఇచ్చింది.

ఈ మేరకు 78 పేజిల ఉత్తర్వును జారీ చేసిన ఇసి రాష్ట్రంలో ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు థాక్రేవర్గం తనకు కేటాయించిన కాగడా గుర్తును అట్టిపెట్టకోవచ్చని పేర్కొంది. ఇసి తీర్పుపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందిస్తూ ఇది బాలాసాహెబ్ సిద్ధాంతానికి లభించిన విజయమని వ్యాఖ్యానించారు. ఇసికి కృతజ్ఞతలు తెలియజేసిన ఆయన ప్రజాస్వామ్యంలో మెజారిటీయే లెక్కలోకి వస్తుందన్నారు. కాగా షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా ఇసి గుర్తించడాన్ని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని థాక్రే వర్గం నాయకుడు, ఎంపి సంజయ్ రౌత్ అన్నారు. ప్రజా విశ్వాసాన్ని ఇసి కోల్పోయిందన్న ఆయన ఈ నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాలు చేస్తామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News