Sunday, April 28, 2024

గాజాలో పిల్లల పరిస్థితి ఘోరం

- Advertisement -
- Advertisement -

అన్ని యుద్ధాలలో ఎక్కువగా బాధపడేది పిల్లలే. యుద్ధాలకు కూడా నియమాలు ఉంటాయి. అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం ఏ పిల్లవాడు కూడా అవసరమైన సేవలకు మానవతా దృక్పథానికి దూరం కాగూడదు. సాయుధ పోరాటంలో ఏ పిల్లవాడినీ బందీగా ఉంచకూడదు. ఏ విధంగానూ వారిని యుద్ధంలో భాగస్వామ్యం చేయగూడదు. వారిని సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. ఆసుపత్రులు, పాఠశాల మీద బాంబు దాడులు చేపట్టకూడదు. వీటికి విరుద్ధంగా గాజాలో ఇజ్రాయెల్ ప్రవర్తిస్తున్నది. ఇజ్రాయెల్‌లో హమాస్ నేతృత్వంలోని దాడులకు ప్రతిస్పందనగా గాజాపై దాడులు మొదలైన తరువాత దాదాపు 20,000 జననాలు జరిగాయి. గాజా స్ట్రిప్‌లో పెరుగుతున్న శత్రుత్వాలు పిల్లలు, కుటుంబాలపై విపత్కర ప్రభావాన్ని చూపుతున్నాయి. పిల్లలు ప్రమాదకర స్థాయిలో చనిపోతున్నారు. వేలాది మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు.

గాజా స్ట్రిప్‌లో 19 లక్షలకు పైగా ప్రజలు అంతర్గతంగా స్థానభ్రంశం చెందారని అంచనా. వారిలో సగం మంది పిల్లలే. వారికి తగినంత నీరు, ఆహారం, ఇంధనం, మందులు అందుబాటులో లేవు. వారి గృహాలు నాశనం చేయబడ్డాయి. వారి కుటుంబాలు చీలిపోయాయి. తల్లులు ప్రసవించే ముందు, ప్రసవ సమయంలో, తరువాత తగిన వైద్య సంరక్షణ, పోషకాహారం, రక్షణను పొందడంలో అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. స్వచ్ఛమైన నీరు, శుభ్రమైన మరుగుదొడ్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచే అవకాశం లేకపోవడంతో గాజాలో హెపటైటిస్ -ఎ అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా సమాచారం ప్రకారం సగటున 500 మంది ఒకే టాయిలెట్‌ను వాడుతున్నారు. 2,000 మందికి పైగా ప్రజలు ఒకే షవర్‌ని ఉపయోగించుతున్నారు.

ఇది వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదాన్ని పెంచుతుంది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలలో అతిసారం కేసులు 2023 చివరి మూడు నెలల్లో నమోదైన కేసుల సంఖ్య, 2022లో అదే కాలంలో వచ్చిన కేసుల కంటే 26 రెట్లు ఎక్కువగా నమోదయ్యాయి. బలహీనంగా ఉన్న తల్లులు నవజాత శిశువులకు పాలివ్వలేని పరిస్థితి గాజాలో ఉంది. యుద్ధం ప్రారంభమైన 105 రోజుల నుండి ఆగకుండా బాంబు దాడులు, స్థానభ్రంశం నేరుగా నవజాత శిశువులపై ప్రభావం చూపుతున్నది. ఫలితంగా పోషకాహార లోపం, ఇతర ఆరోగ్య సమస్యలు అధికమవుతున్నాయి.రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న సుమారు 1,35,000 మంది పిల్లలు ఈ రోజు తీవ్రమైన పోషకాహార లోపానికి గురయ్యే ప్రమాదంలో వున్నారు. తాత్కాలిక ఆశ్రయాలు, పేలవమైన పోషణ, అసురక్షిత నీరు వంటి అమానవీయ పరిస్థితులు కనబడుతున్నాయి.

కొంత మంది తల్లులు రక్తస్రావంతో చనిపోతున్నప్పుడు వారి నవజాత శిశువులు బాధపడుతున్న తీరు చూసినవారి గుండెలను పిండేస్తున్నాయి. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం దాదాపు 25,000 మంది మరణించినట్లు వైల్లడైన నివేదికలపై యుయన్ మానవ హక్కుల కార్యాలయం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో 70% మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. కనీసం మరో 61,500 మంది గాయపడ్డారు. ఇంకా అనేక వేల మంది శిథిలాల కింద ఉన్నారు. ఖాన్ యూనిస్‌లోని నాజర్ మెడికల్ కాంప్లెక్స్‌లో యుద్ధానికి ముందు ఉన్న వైద్యులు 24 మందితో పోలిస్తే ఇప్పుడు కేవలం ఇద్దరు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇంటెన్సివ్ కేర్ పడకలు 45 నుండి 14కి తగ్గాయి. ప్రారంభంలో ఉన్న 20 మంది నర్సులలో నలుగురు మాత్రమే అందుబాటులో ఉన్నారు.

ప్లాస్టిక్ సంచులతో తయారు చేయబడిన గుడారాలను ఉంచడానికి పురుషులు, పిల్లలు ఇటుకల కోసం తవ్వేస్థితి, భారీ మానవహక్కుల సంక్షోభం, పెద్ద మానవ నిర్మిత విపత్తుగా మారింది. ఇది గాజాకు రక్షణ ప్రతిస్పందనతో సహా మానవతా సహాయాన్ని అత్యవసరంగా పెంచవలసిన అవసరాన్ని తెలియజేస్తున్నది. గాజాలో అత్యంత దుర్బలమైన మహిళలు, పిల్లలకు సహాయం చేయడానికి యునిసెఫ్ పాల సప్లమెంట్లను అందజేస్తూనే ఉంది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు హైఎనర్జీ బిస్కెట్లు, పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే స్త్రీలకు సూక్ష్మపోషక సప్లిమెంటేషన్‌తో సహా ఇతర నిత్యావసరాలతో పాటు అవసరమైన పోషకాహారాన్ని అందిస్తున్నది. ఆశ్రయాలకు నీటి ట్రక్కింగ్, బాటిల్ వాటర్ పంపిణీకి మద్దతిస్తున్నది. నీటి కంటైనర్లు, నీటి శుద్ధీకరణ కోసం క్లోరిన్ మాత్రలు, నీటి బావులు, డీశాలినేషన్ ప్లాంట్లు, ట్రక్కింగ్ కోసం ఇంధనాన్ని అందించడం, కుటుంబ పరిశుభ్రత కిట్‌లు, వందల వేల సబ్బు బార్‌లను పంపిణీ చేస్తున్నది.

ఆసుపత్రులు, ఆరోగ్య సదుపాయాలకు అత్యవసర వైద్య సామాగ్రిని అందజేయడం, నవజాత శిశువులకు సామాగ్రి, నర్సుల కోసం వైద్యకిట్‌లు, తీవ్రమైన నీళ్ల విరేచనాలు, ప్రాణాలను రక్షించే మందులను అందజేస్తున్నది. శీతాకాలం గాజా స్ట్రిప్‌పై ప్రభావం చూపుతున్నది. కాబట్టి దుప్పట్లు, గుడారాలు, వెచ్చని దుస్తులను అందించడంపై దృష్టి సారించింది. ప్రాథమిక అవసరాలను తీర్చడానికి అత్యంత హాని కలిగి ఉండే కుటుంబాలకు నగదును అందిస్తున్నది.కొన్ని ఆశ్రయాలలో ప్రాథమిక మానసిక ఆరోగ్యం, మానసిక సామాజిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నది. పాలస్తీనాలోని పిల్లల పరిస్థితికి ప్రతిస్పందించడానికి యునిసెఫ్ పిలుపునిస్తోంది. తక్షణ, దీర్ఘకాలిక మానవతావాద కాల్పుల విరమణ ప్రకటించాలి. అపహరణకు గురైన పిల్లలందరినీ తక్షణం షరతులు లేకుండా విడుదల చేయాలి.

గాజాలో పిల్లలు అత్యవసర వైద్యకేసులను సురక్షితంగా క్లిష్టమైన ఆరోగ్య సేవలను పొందడం కోసం అవకాశం కలిగించాలి. ఉత్తరాదితో సహా గాజా స్ట్రిప్‌కి, లోపల ప్రభావితమైన జనాభా ఎక్కడ ఉన్నా వారిని చేరుకోవడానికి నియంత్రణలు ఉండకూడదు. అత్యవసర వాణిజ్య సామగ్రి ఇంధనం సురక్షితమైన తరలింపునకు అన్ని మార్గాలు తెరిచి ఉంచాలి. ప్రతిస్పందన ప్రయత్నాలను సమన్వయం చేయడానికి విశ్వసనీయ టెలికమ్యూనికేషన్స్ నెట్‌వర్క్‌లను అందుబాటులో ఉంచాలి. ఆశ్రయాలు, పాఠశాలలకు, ఆసుపత్రులకు విద్యుత్, నీరు, పారిశుధ్యం సౌకర్యాల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి.పౌరులు, పిల్లల ప్రాణాలను కోల్పోకుండా, వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి, అనారోగ్యంతో ఉన్నవారికి, గాయపడిన వారికి సంరక్షణ అందించడానికి సంఘర్షణకు సంబంధించిన అన్ని పక్షాలు అంతర్జాతీయ మానవతా చట్టాన్ని గౌరవించాలి. ఇవన్నీ జరగాలని యునిసెఫ్ కోరుతున్నది.

 

డి జె మోహన రావు
9440485824

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News