Sunday, September 15, 2024

అత్తమామలపై అల్లుడి దాడి..మామ మృతి

- Advertisement -
- Advertisement -

భార్యను కాపురానికి పంపడం లేదని అత్త, మామలపై అల్లుడు కర్రతో దాడి చేశాడు. ఈ సంఘటనలో మామ మృతి చెందగా అత్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన ములుగు జిల్లా, మంగపేట మండలం, బాలన్న గూడెం పంచాయతీ పరిధి నీలాద్రిపేటలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నీలాద్రిపేటకు చెందిన దంపతులు గొర్రె రాజ నర్సయ్య (56) నర్సమ్మకు ముగ్గురు కుమార్తెలు. రెండవ కూతురు స్వప్నను అదే గ్రామానికి చెందిన గాంధర్ల రామకృష్ణకు ఇచ్చి 17 ఏళ్ల క్రితం వివాహం చేశారు. గాంధర్ల రామకృష్ణ నాలుగేళ్ల క్రితం నుంచి అదే గ్రామానికి చెందిన మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ స్వప్న భర్తను అనుమానించి తల్లిదండ్రుల వద్ద ఉంటూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం స్వప్న కిరాణా షాపుకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రామకృష్ణ తనతో ఎందుకు మాట్లాడటం లేదని మందలించగా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయింది.

ఆమె వెనకాలే వెళ్లిన భర్తను చూసి అత్త, మామలు రామకృష్ణను మందలించడంతో మీ వల్లనే నా భార్య కాపురానికి రావడం లేదు అంటూ కోపంతో అక్కడే ఉన్న కర్రతో మామపై దాడి చేయగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. అత్త నర్సమ్మ వారించే క్రమంలో ఆమెను కూడా చంపుతానంటూ దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని అంబులెన్స్‌లో ఎంజిఎం ఆసుపత్రికి తరలించే క్రమంలో రాజనర్సయ్య మార్గమధ్యలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఏటూరు నాగారం ఎఎస్‌పి శివమ్ ఉపాధ్యాయ, సిఐ అనుముల శ్రీనివాస్‌తో కలిసి సోమవారం సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలు నర్సమ్మను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం నర్సమ్మను కూడా వరంగల్ కు తరలించామని తెలిపారు. మృతుడి చిన్న కూతురు సౌజన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News