Wednesday, May 1, 2024

సంస్కరణలకు తావివ్వని పార్టీ!

- Advertisement -
- Advertisement -

Sonia Gandhi meets with Congress Dissenters

గతంలో పివి నరసింహారావుకు పార్టీ, ప్రభుత్వ సారథ్యం అప్పచెప్పిన చేదు అనుభవాలను మరచిపోలేకపోతున్నారు. వచ్చే నెల బయటకు వస్తున్న ప్రణబ్ ముఖర్జీ ఆత్మకథలో 2014 ఎన్నికలలో పార్టీ పరాజయానికి సోనియా కుటుంబాన్నే దోషిగా నిలబెట్టిన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. పార్టీకి ఎన్నికల విజయాలు తెచ్చిపెట్టడం కన్నా పార్టీపై తమ పట్టు కాపాడుకోవడమే వారి లక్ష్యంగా కనిపిస్తున్నది. ఈ విషయంలో ఒక విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా పరోక్షంగా సహకరిస్తున్నదా అన్న అనుమానాలు కలగడం లేదు.

కాంగ్రెస్ పార్టీ వరుసగా పరాజయాలు పొందడానికి, నరేంద్ర మోడీ ఉధృత దాడులను తట్టుకోలేక పోవడానికి ఆ పార్టీ అగ్ర నాయకత్వం అసమర్థతే కారణమని పరోక్షంగా ఆ పార్టీ నేతలు బహిరంగంగానే అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. నాయకత్వం పని తీరుపై అసంతృప్తితో పాటు సంస్థాగత మార్పులు తేవాలని ఆకాంక్షిస్తూ గత ఆగస్టులో పార్టీ అధినేత్ర సోనియా గాంధీకి నేరుగా 23 మంది సీనియర్ నాయకులు లేఖ రాయడం ఒక విధంగా పార్టీ వ్యవహారాలలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వ్యవహార శైలిని ప్రశ్నించడమే.
ఈ ధోరణిని ఒక విధంగా రాహుల్ గాంధీ గత ఏడాది లోక్‌సభ ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం పొందినప్పుడే గ్రహించారు. అందుకనే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, వైఫల్యాల ప్రభావం తనపై పడకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా గాంధీ కుటుంబానికి చెందిన వారిని తన వారసుడిగా ఎన్నుకోవాలి అంటూ చెప్పడం ద్వారా పార్టీ వైఫల్యాల బాధ్యతల నుండి తన కుటుంబాన్ని కాపాడుకొనే ప్రయత్నం చేశారు.
అయితే ఇదంతా ఒక నాటకీయ ప్రక్రియగా జరిగి తిరిగి సోనియా గాంధీని తాత్కాలిక అధ్యక్షురాలిగా చేశారు. ఇది కేవలం తాత్కాలిక ఏర్పాటు మాత్రమే అని, మరో నాలుగైదు నెలల్లో వేరే వారికి అధ్యక్ష పదవి అప్పజెబుతారనే సంకేతం ఇచ్చారు. ఏడాదిన్నర అయింది, అయినా అటువంటి ప్రయత్నాలు జరగలేదు. తిరిగి ఇప్పుడు రాహుల్ గాంధీకి పార్టీ సారథ్యం అప్పచెప్పడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఏది ఏమైనా, తమ కుటుంబం నుండి కాంగ్రెస్ పార్టీపై ఆధిపత్యం వదిలిపోకూడదని సోనియా, రాహుల్ పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తున్నది. అందుకనే పార్టీలో సంస్కరణలకు సహితం వారు దూరంగా ఉంటున్నారు. మొత్తం పార్టీ సంస్థాగత వ్యవస్థను విధ్వంసం చేయడం ద్వారానే సోనియా గాంధీ రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీపై తిరుగులేని అధికారం చెలాయించ గలుగుతున్నదని ఈ సందర్భంగా అందరికీ తెలిసిందే.
23 మంది నేతలు రాసిన లేఖలో పరోక్షంగా ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆ లేఖపై పార్టీ వేడుకలలో ఇప్పటి వరకు ఎక్కడా ప్రస్తావించకుండా సోనియా, రాహుల్ జాగ్రత్త పడ్డారు. పైగా ఆ లేఖపై సంతకాలు చేసిన వారిలో అత్యధికులను క్రియాశీల పాత్రలకు దూరంగా ఉంచుతూ వస్తున్నారు. ఒక విధంగా సోనియాగాంధీ ఆరోగ్యం సహకరించకపోతున్నా, ఆమె ఇల్లు దాడి బైటకు రాలేకపోతున్నా మరొకరిని పార్టీ అధ్యక్షుడిగా చేయడానికి సాహసం చేయడం లేదు. మరో సమర్ధత గల నేతను ఆ స్థానంలోకి తీసుకు వస్తే పార్టీపై తమ కుటుంబం ఆధిపత్యం శాశ్వతంగా కోల్పోవలసి వస్తుందని భయపడుతున్నారు.
గతంలో పివి నరసింహారావుకు పార్టీ, ప్రభుత్వ సారథ్యం అప్పచెప్పిన చేదు అనుభవాలను మరచిపోలేకపోతున్నారు. వచ్చే నెల బయటకు వస్తున్న ప్రణబ్ ముఖర్జీ ఆత్మకథలో 2014 ఎన్నికలలో పార్టీ పరాజయానికి సోనియా కుటుంబాన్నే దోషిగా నిలబెట్టిన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. పార్టీకి ఎన్నికల విజయాలు తెచ్చిపెట్టడం కన్నా పార్టీపై తమ పట్టు కాపాడుకోవడమే వారి లక్ష్యంగా కనిపిస్తున్నది. ఈ విషయంలో ఒక విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా పరోక్షంగా సహకరిస్తున్నదా అన్న అనుమానాలు కలగడం లేదు.
రాహుల్ గాంధీ పార్టీ సారథిగా ఎంతకాలం కొనసాగితే అంతకాలం తమకు ఎన్నికల విజయాలు తథ్యం అంటూ పలువురు బిజెపి అగ్రనేతలు పలు సందర్భాలలో ప్రకటనలు చేస్తుండటం తెలిసిందే. కారణం ఏదైతేనేమి రాహుల్ గాంధీ చేసే ప్రకటనలకు కాంగ్రెస్ వారెవ్వరూ ఎటువంటి విలువ ఇవ్వడం లేదు. కానీ వాటిపై వెంటనే తీవ్రంగా స్పందించడం ద్వారా అతనిని రాజకీయ కేంద్ర బిందువుగా కొనసాగేటట్లు బిజెపి సహకరిస్తుందనడంలో సందేహం లేదు. తిరిగి రాహుల్ గాంధీ మాత్రమే కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టాలని బిజెపి కూడా కోరుకొంటున్నది. క్రియాశీల రాజకీయాలలోకి వచ్చిన ప్రియాంక గాంధీ సహితం అన్నకు తోడుగా పార్టీపై తమ కుటుంబం పట్టు సడలిపోకుండా మాత్రమే చూస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రోత్సహిస్తున్న నేతలు అందరూ వారసత్వ నేపథ్యం, తమ కుటుంబం పట్ల తిరుగులేని నమ్మకం గలవారు మాత్రమే. ప్రజలను సమీకరించి బిజెపికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు చేయగల వారెవ్వరిని ప్రోత్సహించడం లేదు.
వచ్చే ఫిబ్రవరి ప్రాంతంలో ఎఐసిసి సమావేశాలు జరిపి రాహుల్ గాంధీకి పార్టీ సారథ్యం అప్పచెప్పడం కోసం సోనియా సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. అందుకనే అసమ్మతి లేఖ వ్రాసిన 23 మంది నాయకులలో కొందరిని పిలిపించి మాట్లాడటం ద్వారా రాహుల్‌కు వారంతా సహకరించే విధంగా పూర్వరంగం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిపై త్వరలోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఈ సందర్భంగా ప్రకటించడం ఈ సందర్భంగా గమనార్హం. కాంగ్రెస్ ఎలక్టోరల్ కాలేజ్‌లో ఉన్న ఎఐసిసి సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, సభ్యులు అందరు కలిసి సమర్ధవంతమైన నాయకుడిని ఎన్నుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే రాహుల్‌కు సన్నిహితుడిగా పేరొందిన సూర్జేవాలా 99.9 శాతం మంది నాయకులు రాహుల్ నాయకత్వాన్ని కోరుకొంటున్నరని కూడా ప్రకటించడం ఆసక్తి కలిగిస్తుంది. రాహుల్‌ను ప్రశ్నించే వారెవ్వరూ పార్టీలో ఉండరాదనే ఈ విధమైన ప్రకటనలు ఇస్తున్నారు. గతంలో పలువురు సీనియర్లు రాహుల్ తీరుతెన్నులను తప్పు బట్టడంతో అనివార్య పరిస్థితులలో పార్టీ అధ్యక్ష పదవినుండి వైదొలగక తప్పలేదు. ప్రస్తుతం సోనియా గాంధీ పార్టీ సారథ్యం వహిస్తున్నా కీలక నిర్ణయాలు అన్నింటిని రాహుల్ తీసుకొంటూ వస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే గత ఒకటిన్నర సంవత్సర కాలంగా పార్టీ అధ్యక్ష పదవికి పార్టీలో పలువురు పేర్లు ముందుకు తెచ్చినా వారెవ్వరికీ అప్పచెప్పకుండా నెట్టుకొంటూ వచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం ఏ విధంగా తీసుకు రావాలో 2014 ఎన్నికలలో ఓటమి అనంతరం నియమించిన ఎకె ఆంటోని కమిటీ స్పష్టమైన సూచనలు చేసింది. కానీ ఆయన నివేదికపై పార్టీ వేదికలపై ఎటువంటి చర్చలు జరపలేదు. అందులో సూచించిన విధంగా పార్టీలో సంస్కరణలకు సహితం ప్రయత్నం చేయనే లేదు. ఇప్పుడు కూడా పంజాబ్ లో అమరిందర్ సింగ్, రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ వంటి వారు సోనియా, రాహుల్ లను ఒక విధంగా లెక్కచేయకుండా తమ ప్రాబల్యం సాగించుకొంటున్నారు. మహారాష్ట్రలో సహితం రాహుల్ అభీష్టానికి భిన్నంగా కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు శరద్ పవర్ ప్రభావంతో శివసేనతో పొత్తు ఏర్పాటు చేసుకుని, ప్రభుత్వంలో చేరారు.
కర్నాటకలో సహితం మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోనియా, రాహుల్ అభీష్టం మేరకు రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలు నడపడానికి సహకరించడం లేదు. కాంగ్రెస్‌కు కొంచెం పట్టు ఇంకా ఉన్న తెలంగాణలో వరుస ఎన్నికల వైఫల్యాల అనంతరం కూడా ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కొనసాగించడం ప్రజలలోకి చొచ్చుకుపోయే నాయకత్వం వస్తే గాంధీ కుటుంబ సభ్యుల పట్టు ఇక్కడ కూడా జారిపోతుందనే భయమే కావచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు కాంగ్రెస్‌కు బలం, బలహీనత – రెండు కూడా గాంధీ కుటుంబమే.

Sonia Gandhi meets with Congress Dissenters

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News