Saturday, April 27, 2024

బ్యాడ్ బ్యాంకు!

- Advertisement -
- Advertisement -

Narendra Singh Tomar's letter to Farmers

పది లక్షల కోట్ల రూపాయలకు చేరిపోయిన దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల ఎగవేత రుణాల, మొండి బకాయిల సమస్య పరిష్కారానికి బ్యాడ్ బ్యాంకు అనే ప్రత్యేక వసూళ్ల బ్యాంకును నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నదట. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ శుక్రవారం వెల్లడించారు. గత మే నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఒక సమావేశంలో ఈ ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చింది. అయితే ఆ తర్వాత దాని ఊసు వినిపించలేదు. కొరకరాని కొయ్యగా మారిన ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం యోచిస్తున్న అనేక ఉపాయాలలో బ్యాడ్ బ్యాంకు స్థాపన కూడా ఒకటని బజాజ్ ఇప్పుడు వెల్లడించారు. బ్యాంకులు తాము వసూలు చేయలేక పోయి మొండి బకాయిగా మిగిలిపోయిన రుణ మొత్తాన్ని అంతకు తక్కువ కిమ్మత్తుకు బ్యాడ్ బ్యాంకుకు విక్రయిస్తే ఆ బ్యాంకు ఆ మొత్తం అంతటినీ ఎగవేతదారుల నుంచి వసూలు చేసి లాభం చేసుకుంటుంది. బ్యాంకులు మొండి బకాయిల వసూలు కింద కాలాన్ని, శక్తియుక్తులను వెచ్చించనవసరం లేకుండా తమ దైనందిన విధుల పట్ల శ్రద్ధ చూపించడానికి ఈ విధానం తోడ్పడుతుందన్నది కొందరి ఆలోచన.

అదే సమయంలో బ్యాడ్ బ్యాంకుకు అప్పజెప్పి చేతులు దులుపుకోవచ్చనే భరోసాతో రుణాలివ్వడంలో, వసూలు చేయడంలో బ్యాంకులు మరింత నిర్లక్షాన్ని, అశ్రద్ధను చూపే ప్రమాదం కూడా లేకపోలేదు. రుణాలిచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే అవి ఎగవేతకు గురి కాకుండా అసలు వడ్డీతో సహా పూర్తిగా వసూలు కావడానికి అవకాశమేర్పడుతుంది. వసూలు కాని రుణ మొత్తం పరిమితంగానూ, బ్యాంకు తట్టుకునేదిగానూ ఉంటుంది. అటువంటి జాగ్రత్తలు తీసుకోకపోడం వల్ల, రుణ గ్రహీతల నిజాయితీ, ఆర్థిక స్తోమత, వ్యాపార పటిష్ఠత మున్నగు వాటిని బట్టి కాకుండా రాజకీయ ఒత్తిడులకు లొంగి బ్యాంకులు అప్పులిస్తున్నందున అవి ఎప్పటికీ వసూలు కాకుండా పోతున్నాయి. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మొహుల్ చౌకీ వంటి సంపన్నులు కూడా బ్యాంకులను దోచుకొని మరింత శ్రీమంతులు కావడానికి వ్యాపారాల పేరిట భారీ రుణాలు తీసుకోడాన్ని చక్కని రాజమార్గంగా ఎంచుకుంటున్నారు. మొండి బకాయిల భారానికి బ్యాంకులు చేతిలో చిల్లిగవ్వ లేకుండాపోయి ఖాతాదారులకు ముఖం చూపలేని పరిస్థితులు తలెత్తి దివాలాకు చేరుకుంటున్నాయి. కష్టపడి సంపాదించుకున్న డబ్బును వాటిలో దాచుకునే సాధారణ ప్రజలు మోసపోతున్నారు, ఆత్మహతలు చేసుకుంటున్నారు. ఆ విధంగా దివాలా తీసే బ్యాంకులకు తిరిగి ప్రాణం పోయడానికి కేంద్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్‌లో కొంత సొమ్మును కేటాయించవలసి వస్తున్నది. ప్రభుత్వ రంగ బ్యాంకులను దివాలా నుంచి కాపాడానికి గత మూడు ఆర్థిక సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షల 65 వేల కోట్లను సమకూర్చింది.

ఇదంతా ప్రజల సొమ్ము. ప్రజలు దాచుకున్న సొమ్మును దొంగలకు దోచిపెట్టి చతికిలబడిపోయే బ్యాంకులను మళ్లీ ప్రజల సొమ్ముతోనే కాపాడడమనే ఆత్మవంచనకు ప్రజావంచనకు ప్రభుత్వం పాల్పడుతున్నది. బ్యాంకుల్లో ఘరానా దొంగలు పడకుండా వాటిని కాపాడవలసిన బాధ్యతను నిర్వర్తించలేక తిరిగి ప్రజలనే బాదుతున్నది. మోసకారి రుణ గ్రహీతల నుంచి మొండి బకాయిలు వసూలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2016లో సులభతరమైన దివాలా చట్టాన్ని తీసుకొచ్చింది. ఎగ్గొట్టిన వారికి తగినంత వ్యవధి ఇచ్చి వారు తీర్చవలసిన సొమ్ము మొత్తంలో రాయితీ కల్పించి వసూలు చేసుకునే ప్రక్రియను ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో 201819లో అన్ని బ్యాంకుల మొండి బకాయిలు కలిసి సగటున 42.5 శాతం మేరకు వసూలయ్యాయి. అంతకు ముందు సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్సియల్ అసెస్ట్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటెరెస్ట్ యాక్ట్ 2002 (ఫర్నేసి) కింద 14.5 శాతం, లోక్‌అదాలత్‌ల ద్వారా 5.3 శాతం, ట్రిబ్యునల్స్ ద్వారా 3.5 శాతం మాత్రమే వసూలు చేయగలిగారు. అందుచేత 2016 దివాలా చట్టమే మెరుగైనదిగా బోధపడుతున్నది. ఈ నేపథ్యంలో ప్రత్యేక వసూళ్ల బ్యాంకు (బ్యాడ్ బ్యాంకు) ఏర్పాటు యోచనను రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వంటి వారు విమర్శించడం గమనార్హం. ఈ బ్యాంకుకు ప్రాథమికంగా రూ. 10 వేల కోట్ల పెట్టుబడిని ప్రభుత్వమే భరించవలసి ఉంటుంది. బ్యాంకులు తమ మొండి బకాయిలను తక్కువ విలువకు ఈ బ్యాంకుకు అమ్ముకుంటే అసలు మొత్తాన్ని పూర్తిగా వసూలు చేసుకుంటేగాని అది నిలబడజాలదు. ఆక్రమంలో మొండి బకాయిల వసూలుకు అది ఎటువంటి అమానవీయ పద్ధతులను అవలంబించడానికైనా అవకాశముంటుంది. ఇంత జరిగితే గాని వసూలు కాని బకాయిల కోసం ఇంతింత డబ్బు పెట్టి బ్యాడ్ బ్యాంకును నెలకొల్పాలనే యోచన మంచిదిగా తోచడం లేదు.

Article About India’s govt and Private Banks

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News