Friday, May 3, 2024

ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా భారీ విజయం

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ మరో ఓటమిని చవిచూసింది. శనివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 229 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఇంగ్లండ్ 22 ఓవర్లలోనే కేవలం 170 పరుగులకే కుప్పకూలింది. రీస్ టొప్లే బ్యాటింగ్‌కు దిగలేదు. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (10), డేవిడ్ మలన్ (6)లు జట్టుకు శుభారంభం అందించలేక పోయారు. వన్‌డౌన్‌లో వచ్చిన జో రూట్ (2) కూడా నిరాశ పరిచాడు. ఇక వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్ ఆడిన స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ కూడా విఫలమయ్యాడు.

స్టోక్స్ ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. సౌతాఫ్రికా బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీస్తూ ఇంగ్లండ్‌ను కోలుకోనివ్వలేదు. హారి బ్రూక్ (17), కెప్టెన్ జోస్ బట్లర్ (15), డేవిడ్ విల్లీ (12), ఆదిల్ రషీద్ (10) వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో ఇంగ్లండ్ 100 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మార్క్‌వుడ్, గుస్ అట్కిన్‌సన్ కొద్ది సేపు మెరుపులు మెరిపించారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన మార్క్‌వుడ్ 17 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 43 పరుగులు చేసి నాటౌట్‌గానిలిచాడు. ధాటిగా బ్యాటింగ్ చేసిన అట్కిన్‌సన్ ఏడు ఫోర్లతో 35 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 170 పరుగుల వద్ద ముగిసింది. కాగా, వుడ్‌తో కలిసి అట్కిన్‌సన్ తొమ్మిదో వికెట్‌కు 70 పరుగులు జోడించాడు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జి మూడు, ఎంగిడి, జాన్సెన్ రెండేసి వికెట్లు తీశారు.

పరుగుల వరద..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకు ఇన్నింగ్స్ రెండో బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ డికాక్ (4)ను టొప్లే వెనక్కి పంపాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన వండర్ డుసెన్‌తో కలిసి మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ స్కోరును పరిగెత్తించాడు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన కృష్టి ఫలించలేదు. ధాటిగా ఆడిన వండర్ డుసెన్ 8 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. ఇక దూకుడుగా బ్యాటింగ్ చేసిన హెండ్రిక్స్ 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 85 పరుగులు సాధించాడు. కెప్టెన్ మార్‌క్రమ్ (42) పరుగులు చేసి ఔటయ్యాడు.
క్లాసెన్ మెరుపు శతకం..
ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత హెన్రిచ్ క్లాసెన్, మార్కొ జాన్సెన్ తమపై వేసుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లను హడలెత్తించిన క్లాసెన్ 67 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 109 పరుగులు సాధించాడు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన జాన్సెన్ 42 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, 3 ఫోర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో సౌతాఫ్రికా స్కోరు 399 పరుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News