Monday, December 4, 2023

యాదాద్రిలో తెప్పోత్సవం.. శ్రీ లక్ష్మీ చెరువు అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

తెప్పోత్సవ నిర్వహణ కోసం యాదాద్రిలో శ్రీ లక్ష్మీ చెరువు అభివృద్ధి
మరో రెండునెలలో అందుబాటులోకి…
25 ఎకరాల చెరువుకు సుందరీకరణ పనులు
తెప్పోత్సవం నిర్వహణకు అనుగుణంగా చెరువులో 16 నుంచి 18 ఎకరాల్లో నీటి నిల్వలు
రూ.33.70 కోట్ల వ్యయంతో సుందరీకరణ పనులు
హైదరాబాద్: యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మరో అద్భుత కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కానుంది. కొండ దిగువన ఉండే గండి చెరువును శ్రీ లక్ష్మీ చెరువుగా తీర్చిదిద్దే పనులను ఆలయ అధికారులు ముమ్మరం చేశారు. పంచ నారసింహులతో స్వయం భూ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రిని ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రంగా రూపొందించే ప్రణాళికతో కొండ కింద ఉన్న సుమారు 25 ఎకరాల చెరువును సుందరీకరణ చేస్తున్నారు. ఆలయ ఉత్సవాల్లో తెప్పోత్సవం నిర్వహణకు అనుగుణంగా చెరువులో 16 నుంచి 18 ఎకరాల్లో నీటి నిల్వలకు తగ్గట్లు పనులు పూర్తి చేశారు. రూ.33.70 కోట్ల వ్యయంతో చేపట్టిన సుందరీకరణలో భాగంగా మూడు వైపులా పచ్చదనం ఉండేలా చర్యలు చేపట్టారు. ప్రత్యేక పైపుల ద్వారా ఈ చెరువులో గోదావరి నదీ జలాలను నింపుతున్నారు.

నడుం వరకు గ్రిల్స్ బిగింపు
సంప్రదాయ హంగులతో రూపొందిన ఈ లక్ష్మీ చెరువులో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. తెప్పోత్సవ నిర్వహణ కోసం యాదాద్రిలో అభివృద్ధి చేస్తోన్న శ్రీ లక్ష్మీ చెరువు మరో రెండునెలలో అందుబాటులోకి రానుంది. ఈ ఉత్సవ పర్వాన్ని తిలకించే భక్తులకు చెరువు చుట్టూ మెట్లతో కూడిన బండ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెరువులో దిగి తిలకించే వారికి ప్రమాదం జరగకుండా నీటి మట్టంలో నడుం వరకు గ్రిల్స్ బిగించడంతో పాటు మెట్లదారిని నిర్మిస్తున్నారు. సహజత్వానికి దర్పణంగా పూలు, ఔషధ మొక్కల పెంపకం, మ్యూజికల్ వాటర్ ఫౌంటెయిన్, ఆర్నమెంటల్ లైటింగ్‌తో సహా సైకిల్ ట్రాక్, నడకదారులకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. కొండకింద తుర్కపల్లి రహదారిలోని సర్కిల్ వద్ద ఆలయనగరి నిర్మితమయ్యే పెద్దగుట్టకు వెళ్లే మార్గం ఎదుట ఆవిష్కృతం కానున్న శ్రీ లక్ష్మీ చెరువు ప్రాంగణం భవిష్యత్‌లో యాదాద్రీశుడి భక్తజనులకు ఆధ్యాత్మిక ఆహ్లాదం సంప్రాప్తించే కేంద్రం కానుంది.

Also Read: తిరుపతి వెళ్లే భక్తుల కోసం నాలుగు రోజుల టూర్ ఫ్యాకేజీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News