Monday, August 11, 2025

శ్రీశైలం ప్రాజెక్టుకు 1 లక్ష 52 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

- Advertisement -
- Advertisement -

కృష్ణా బేసిన్‌కు కొనసాగుతున్న వరద
సుంకేసులకు 70 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి ః కృష్ణా బేసిన్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో శ్రీశైలం జలాశయానికి ఒక లక్ష 52వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుత జలాశయంలో 880అడుగుల మేర నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి అనంతరం 65 వేల 742 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్ వైపుకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి జూరాల జల విద్యుత్ ద్వారా 32 వేల క్యూసెక్కులు, జూరాల 8 గేట్లు ఎత్తడం ద్వారా 52 వేల క్యూసెక్కుల చొప్పున శ్రీశైలం వైపుకు నీటిని వదులుతున్నారు. తుంగభద్ర నుంచి సుంకేసుల బ్యారేజ్‌కి 70 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా 16 గేట్లను ఒక మీటరు మేర ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టు వైపుకు 66 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

అలమట్టికి కొనసాగుతున్న వరద
కర్ణాటకలోని అలమట్టి ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. అలమట్టికి 37 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. దీంతో దిగువ నారాయణ పూర్ ప్రాజెక్టుకు 30 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణ పూర్ ప్రాజెక్టు 11 గేట్లను ఎత్తి 44 వేల క్యూసెక్కులను దిగువ జూరాల వైపుకు వదులుతున్నారు. దీంతో కృష్ణా బేసిన్‌కు ఎగువ కర్ణాటక, మహారాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలకు తోడు తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా బేసిన్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. కర్ణాటకలోకి తుంగభద్రా నదికి వరద కొనసాగుతుండడంతో తెలంగాణలోని సుంకేసుల బ్యారేజికి నిరంతరాయంగా వరద ప్రవాహం కొనసాగుతుంది. మరో వారం రోజుల పాటు వరద ఇదే మోతాదులో హెచ్చుతగ్గుల మధ్య కొనసాగే అవకాశాలు ఉన్నట్లు ఆయా ప్రాజెక్టుల అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News