Sunday, May 5, 2024

ఢిల్లీలో రాష్ట్ర మంత్రుల పర్యటన

- Advertisement -
- Advertisement -

State ministers visit Delhi

కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నగరాల్లో మ్యూజియాలను
ఏర్పాటు చేయాలి
వివిధ అంశాలపై కేంద్ర అధికారులను కలిసి విజ్ఞప్తి చేసిన తెలంగాణ మంత్రులు, ఎంపిలు

మనతెలంగాణ/హైదరాబాద్ :రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి ఈ ప్రయత్నాలు మరింతగా పెరిగాయి. ఈక్రమంలో మరోసారి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు కోసం బుధవారం కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తి చేయగా, రెండోరోజూ తెలంగాణ మంత్రులు, ఎంపిలు, కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి రాఘవేంద్ర సింగ్‌ను శాస్త్రి భవన్‌లో కలిసి పలు అంశాలపై విజ్ఞప్తిచేశారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నగరాల్లో మ్యూజియంలను ఏర్పాటు చేయాలని మంత్రుల బృందం కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేసింది. ప్రపంచ వారసత్వ కట్టడాల ప్రతిపాదనల ఆమోదంపై 2020 ఫిబ్రవరిలో 21 దేశాల ప్రతినిధుల సమావేశం చైనాలో జరగాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా వాయిదాపడింది.

సానుకూలంగా స్పందించిన కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి రాఘవేంద్ర సింగ్

ఈ సందర్భంగా మంత్రులు రామప్ప దేవాలయంకు యూనెస్కో వారసత్వ కట్టడాల గుర్తింపునకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కృషి చేయాలని విజ్ఞప్తి చేయగా, మంత్రుల విజ్ఞప్తి మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి రాఘవేంద్ర సింగ్ సానుకూలంగా స్పందించారు. వచ్చే నెలలో ప్రపంచ వారసత్వ కట్టడాల గుర్తింపు కోసం యూనెస్కో ఆధ్వర్యంలో పారిస్‌లో జరిగే సమావేశంలో రామప్ప దేవాలయం గుర్తింపు కోసం కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.

సౌండ్ అండ్ లైట్ షోను కోట మధ్యలో…

నగరంలోని చారిత్రక గోల్కొండ కోటలో నిర్వహిస్తున్న సౌండ్ అండ్ లైట్ షో వేదిక ప్రస్తుతం కోట చివరన ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకులకు అసౌకర్యం ఉందని, పర్యాటకుల సౌకర్యం కోసం సౌండ్ అండ్ లైట్ షో వేదికను కోట మధ్యలో ఏర్పాటు చేయాలని మంత్రుల బృందం కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి రాఘవేంద్ర సింగ్‌కు విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కల్చరల్ ఆడిటోరియం ఏర్పాటుకు మంత్రులు పలు ప్రతిపాదనలను ఆయనకు సమర్పించారు.

కేంద్ర పర్యాటక కార్యదర్శి అర్వింద్ సింగ్‌తో భేటీ

కేంద్ర పర్యాటక కార్యదర్శి అర్వింద్ సింగ్‌తో మంత్రులు, ఎంపిల బృందం భేటీ అయ్యింది. ఉమ్మడి మహబుబ్ నగర్ జిల్లా ప్రజల అరాధ్య దైవం మన్యంకొండ వెంకటేశ్వర స్వామి దేవాలయంను సందర్శించే భక్తులు, పర్యాటకులకు మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర పర్యాటక కార్యదర్శి అర్వింద్ సింగ్ ను కలిసి ‘ప్రసాద్ పథకం’ ద్వారా 5015.06 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. మంత్రుల విజ్ఞప్తికి కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించారు.

కేంద్ర ఉపరితల రవాణా శాఖ ప్రభుత్వ కార్యదర్శి గిరిధర్‌తో….

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ ప్రభుత్వ కార్యదర్శి గిరిధర్‌తో మంత్రులు, ఎంపిలు భేటీ అయ్యారు. మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల వరకు నిర్మిస్తున్న నాలుగు లైన్ల జాతీయ రహదారి 16 కిలోమీటర్ల మేర ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అందులో 8 కిలోమీటర్ల మేర రహదారి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి వెళ్లిందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ ప్రభుత్వ కార్యదర్శితో పేర్కొన్నారు.

జాతీయ రహదారుల శాఖ నిబంధనల ప్రకారం గా సెంట్రల్ మీడియన్‌ను నిర్మాణం చేయడం వల్ల వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంలో రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవాణా శాఖ ప్రభుత్వ కార్యదర్శి గిరిధర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్‌లతో పాటు ఎంపిలు బండ ప్రకాష్, మాలోత్ కవిత, పసునూరి దయాకర్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కెఎస్ శ్రీనివాస రాజు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News