Sunday, May 12, 2024

ట్యాంక్‌బండ్‌పై శ్రీపాదరావు విగ్రహం

- Advertisement -
- Advertisement -

ప్రముఖుల విగ్రహాల ఏర్పాటుపై త్వరలో కేబినెట్ సబ్ కమిటీ
శ్రీపాదరావు జయంతి సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

స్పీకర్‌గా ఆయన పాత్ర మరవలేనిది
జయంతి సభలో సిఎం రేవంత్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా శ్రీపాదరావు పోషించిన పాత్ర మరువలేనిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి ఉత్సవాలు శనివారం రవీంద్రభారతిలో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ జయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణల పితామహుడు, భారత మాజీ ప్రధాని పివి నరసింహరావు రాజకీయ ప్రస్థానం మంథని నుండి మొదలు అయిందని తెలిపారు. చరిత్రలో పివికి, మంథని నియోజకవర్గనికి చాలా ప్రాముఖ్యత ఉందని, పివి అనుచరుడుగా శ్రీపాద రావు రాజకీయ ప్రస్థానం మొదలు అయింది అదే మంథని స్థానం నుండని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీపాద రావు స్పీకర్‌గా, ఉమ్మడి రాష్ట్రములో మంచి సంప్రదాయం నెలకొలిపారని కొనియాడారు. అసెంబ్లీ అంటే నాయకుల మధ్య గొడవ జరిగే ప్రదేశం కాదు, ప్రజల సమస్యలు ప్రస్థావించే వేదిక అని నిరూపించారని కొనియాడారు.

ఇప్పుడు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా శ్రీధర్‌బాబు కూడా అసెంబ్లీ సమావేశాలు చాలా ప్రశాంతంగా, అర్థవంతంగా జరిగేలాగా చూసారని కితాబునిచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదాలో ఎన్‌టిఆర్ శ్రీపాదరావు స్పీకర్‌గా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించారని గుర్తు చేశారు. శ్రీధర్‌బాబు అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారని, మొదటి సారి శ్రీపాద రావు తనయుడుగా గెలిచిన ఆయన ఆ తర్వాత ప్రతిభ, పనితనం వల్లే శ్రీధర్‌బాబు అనేక సార్లు గెలిచారన్నారు. అసెంబ్లీలో ఎవరం గొంతు విప్పాలన్నా శ్రీధర్ బాబు అనుమతి లేదా సైగ కావాలని రేవంత్ రెడ్డి సమత్కరించారు. తండ్రికి తగ్గ తనయుడు శ్రీధర్ బాబు అని అన్నారు. ప్రముఖుల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద ఉండాలని ఆ మేరకు ఆలోచన ఉందన్నారు. చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్నలాంటి తెలంగాణ ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటును పరిశీలిస్తామని, ఇందుకోసం త్వరలోనే మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి, ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. జీవన్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి, ఇతర ప్రముఖులు కోరినట్టు హైదరాబా లో తప్పకుండ శ్రీపాదరావు విగ్రహం ఏర్పాటుకు విధివిధానాలు రూపొందిస్తామన్నారు.
అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉంది
శ్రీపాదరావు జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని శ్రీపాదరావు తనయుడు, మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇం దుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు ముఖ్యం గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అందరిని ఆహ్వానించామన్నారు. శ్రీపాదరావు జయంతి వేడుకలను హైదరాబాద్‌లో ప్రతీ ఏటా ఘనంగా నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. మరణించే క్షణం వరకు కూడా శ్రీపాద రావు ప్రజా జీవితంలోనే గడిపారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శ్రీపాద రావు జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరుపున నిర్వహించడం సంతోషకరమన్నారు. శ్రీపాద రావు మన మధ్య లేకపోయినా ఆయన కుమారుడు శ్రీధర్ బాబు రూపంలో ప్రజలు చూసుకుంటున్నారని తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ శ్రీపాద రావు జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరుపున జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఆయన మార్గం లో అందరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన శాసన సభ ను విజయవంతంగా నడిపించారన్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీపాద రావు సర్పంచ్ నుండి, మూడు సార్లు ఎంఎల్‌ఎగా గెలిచిన గొప్ప వ్యక్తి, అని కొనియాడారు. ఆయన స్పీకర్ గా నడిపిన తీరు మీద రూపొందించిన పుస్తకాన్ని ఆయన పుస్తకాలని శాసన సభలో సభ్యులందరికీ అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలకోసం ఆయన ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News