Saturday, April 27, 2024

శ్రుతిమించిన దాడులు!

- Advertisement -
- Advertisement -

సిబిఐని పంజరంలోని చిలుకగా సుప్రీంకోర్టు వర్ణించింది. అప్పటికి అదొక్కటే పంజరంలోని చిలుక. ఇప్పుడు దాని స్థానాన్ని ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్) ఆక్రమించుకొన్నది. సిబిఐకి ఒకటొకటిగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తలుపులు మూసేస్తున్నాయి. అందుచేత కేవలం బలమైన ప్రతిపక్షాలను అప్రతిష్ఠపాలు చేయడమే లక్షంగా పని చేస్తున్న కేంద్రంలోని ఎన్‌డిఎ పాలకులు ఇప్పుడు ఇడిని తిరుగులేని మంత్రదండంగా ప్రయోగిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రజల్లో ప్రతిపక్షాల పరువు పలచబడేటట్టు చేయడానికి కమలనాథులు మితిమించి ఆరాటపడుతున్నారు. గతంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి మహాబలుడుగా ఉపయోగపడుతూ వచ్చిన ప్రస్తుత మంత్రి డికె శివకుమార్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంతగా లక్షం చేసుకొని ఎన్నెన్ని దాడులు జరిపాయో తెలిసిందే. అయినా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బిజెపి ఎత్తులు పారలేదు. కాంగ్రెస్ పార్టీ సొంత బలంతో అధికారంలోకి వచ్చి ఆశ్చర్యపరిచింది.

ఇవేమీ కేంద్రంలోని బిజెపి పాలకుల దుష్ట పన్నాగాలను బలహీనపరచడం లేదు. తమ చేతిలోని అధికారాన్ని ప్రజలకు మంచి చేయడం కోసం కాకుండా ప్రతిపక్షాలను అపకీర్తి పాలు చేయించి నీరుగార్పించడం కోసమే ఉపయోగించాలని, కాకుంటే ప్రజల మధ్య మతపరమైన చిచ్చు రగిలించి మైనారిటీలపై పగ సాధింపుకి దానిని ప్రయోగించాలని బిజెపి పాలకులు కోరుకుంటున్నారు. వీలైతే బలమైన ప్రతిపక్ష కూటములలో చీలిక తేవడానికి కుట్ర పన్నుతున్నారు. బీహార్‌లో మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంజి తనయుడు సంతోష్ కుమార్ కుమారుడు సుమన్ చేత నితీశ్ మంత్రి వర్గానికి రాజీనామా చేయించారు. గతంలో రామ్‌విలాస్ పాశ్వాన్ చిరాగ్ పాశ్వాన్‌ను ప్రయోగించి ఆ ఎన్నికల్లో మిత్ర పక్షం జెడి(యు)పై, దాని అధినేత అప్పటి ఎన్‌డిఎ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మీద దుమ్మెత్తి పోయించి ఆ పార్టీ బలం దారుణంగా పడిపోయేలా చేసిన ఘనత బిజెపి క్షుద్ర మాంత్రికులదే. ఇప్పుడు జితన్ రామ్ మాంజి పార్టీ హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) (హెచ్‌ఎఎం (ఎస్) ను నితీశ్ కేబినెట్ నుంచి బయటికి తేవడం ద్వారా మరి ఎటువంటి కుట్రను బీహార్‌లో అమలు చేయదలిచారో వేచి చూడాలి.

మాంజీ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్‌జెడిలతో కలిసి పోటీ చేసి తర్వాత ఎన్‌డిఎలో చేరి నితీశ్ కుమార్‌తో కొనసాగి ఇప్పుడు ఆయనకు దూరమయ్యింది. బీహార్‌లో ఈ నాటకాన్ని చిత్తగించిన బిజెపి పెద్దలు తమిళనాడులో, తెలంగాణలో ఇడి దాడులను ముమ్మరం చేశారు. తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ కార్యాలయంలో, ఇళ్ళల్లో బుధవారం నాడు ఇడి నిర్వహించిన దాడులు బిజెపి పాలకుల ‘నువ్వే శుంఠవు, నేను ఎల్లప్పుడూ పవిత్రుడనే’ అనే ధోరణిని మరోసారి రుజువు చేసింది. 20112015 మధ్య సెంథిల్ బాలాజీ ఎఐఎడిఎంకె మంత్రి వర్గంలో రవాణా మంత్రిగా వున్నప్పుడు డబ్బు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణకు సంబంధించి ఇంత కాలం దీర్ఘ నిద్ర తీసిన ఇడి ఇప్పుడు హడావుడిగా ఈ దాడులు చేయడమేమిటి? ఆయన ఎఐఎడిఎంకె ప్రభుత్వంలో వున్నప్పుడు కేంద్ర పెద్దలు ఎందుకు ఈ ఆరోపణ విషయంలో మౌనం వహించారు? ఇప్పుడు తమిళనాడు సచివాలయంలోకి ప్రవేశించి మంత్రి కార్యాలయంలో ఈ దాడులు, సోదాలు చేయడంలోని ఆంతర్యం ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పకుండా దాని పాలనా సౌధంలోకి ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రవేశించడంలోని తెగువ ఏమిటి? ఇది ఫెడరల్ సూత్రంపైనే ప్రత్యక్ష దాడి అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ చేసిన వ్యాఖ్య ఎంత మాత్రం ఆక్షేపించదగినది కాదు.

ఈ సోదాలు ప్రతిపక్షాలపై నరేంద్ర మోడీ ప్రభుత్వం సాగిస్తున్న వేధింపు, భయపెట్టడం మాత్రమేనని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థుల మీద దొడ్డిదారి వ్యూహాలకు బిజెపి పాల్పడుతున్నదని, అవి తాను ఆశించిన ప్రయోజనాలను దానికి కట్టబెట్టబోవని స్టాలిన్ చేసిన ప్రకటన ముమ్మాటికీ నిజం. ఈ పరిణామంపై ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కటై డిఎంకెకి మద్దతు ప్రకటించాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఇడి, సిబిఐ, ఐటిలను కేవలం తమను దెబ్బ తీయడం కోసమే ప్రధాని మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని ప్రతిపక్షాలు గతంలో సుప్రీంకోర్టుకు కూడా మొరపెట్టుకొన్నాయి. కాని ఫలితం దక్కలేదు. అందుచేత తమకు తిరుగులేదనే ధోరణిలో ఈ రాజకీయ కక్ష పూరిత చర్యలకు కేంద్ర పాలకులు పాల్పడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ దాడులు, సోదాల దుర్వూహం మరింత వికృత రూపం ధరించడం ఖాయం. ప్రజల అండతో దానిని ఎదుర్కోవడమే ప్రతిపక్షాల ముందున్న కర్తవ్యం. వెయ్యి కోళ్ళను తిన్న రాబందు ఒక్క తుపానుకు ఠా అనే సామెత వుండనే వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News