Tuesday, April 30, 2024

బెయిల్ హక్కు

- Advertisement -
- Advertisement -

Supreme Court grants Azam Khan regular bail దేశంలో ప్రజాస్వామిక చట్టబద్ధ న్యాయవ్యవస్థ ఉన్నప్పటికీ ప్రజలకు న్యాయం అందుతున్న తీరు యెంత అధ్వానంగా వున్నదో చెప్పడానికి ఉదాహరణలు కోకొల్లలు. నాలుగు కోట్ల డ్బ్భై లక్షల పెండింగ్ కేసులే మన న్యాయవ్యవస్థ సొగసును చాటుతున్నాయి. ఈ విషయమై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకి భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఔరంగాబాద్‌లోని మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్శిటీ ప్రథమ కాన్వొకేషన్‌లో రిజిజు మాట్లాడుతూ కోర్టుల్లో దాదాపు అయిదు కోట్ల కేసులు పెండింగులో వున్నాయని, లాయర్లు కూడా అత్యంత ఖరీదైపోయారని అన్నారు. సిజె ఐఎన్‌వి రమణ యిందుకు సమాధానమిస్తూ న్యాయ వ్యవస్థలో ఖాళీలను పూరించకపోడమే అందుకొక ప్రధాన కారణమన్నారు. ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు మంచి సమన్వయం అవసరమన్నారు. జైళ్లలోని ఆరు లక్షల 10 వేల మంది ఖైదీలలో 80 శాతం మంది విచారణలోని వారేనని చెప్పారు. మూలంలోని సమస్య యిలా వుండగా ఖైదీల బెయిల్ హక్కును హైకోర్టులే కాలరాస్తున్న చేదు వాస్తవం పట్ల తాజాగా సుప్రీంకోర్టు స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని గమనించాలి.

ఉత్తరప్రదేశ్ సమాజవాది పార్టీ అగ్రనేత అజాం ఖాన్ తన బెయిల్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించకుండా వల్లమాలిన జాప్యం చేస్తున్నార ని చేసుకొన్న ఫిర్యాదుపై గత మే నెలలో సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. ప్రభుత్వాలు రాజకీయ కక్షతో కేసులను యే విధంగా పెంచి పోషిస్తుంటాయో అందులో వెల్లడయింది. ‘ఏమిటిది, ఆయన్ను యెందుకు విడుదల కానివ్వరు, రెండేళ్లుగా జైల్లో కొనసాగుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు 89 కేసులా, వొక కేసులో బెయిలుపై విడుదల కాగానే మరో కేసులో లోపలికి పంపిస్తున్నారు, సమాధానం చెప్పండి’ ఆని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం నిలదీసింది. దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌కు పారిపోయిన వ్యక్తికి చెందిన ‘శత్రు’ ఆస్తిని ఆక్రమించుకొన్నాడన్న కేసులో అజాం ఖాన్‌కు అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన బెయిల్‌కు విధించిన షరతులను సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం నాడు తీవ్రంగా తప్పు పట్టింది. ఆ షరతులను రద్దు చేసింది. 73 సంవత్సరాల అజాం ఖాన్‌ను రాజకీయ బాస్ ఆని సంబోధించడాన్ని ప్రశ్నించింది.

బెయిల్ మంజూరు చేసేటప్పుడు దానికి సంబంధంలేని షరతులు విధించడం హైకోర్టుల్లో వొక ధోరణిగా మారిపోయిందని అభిప్రాయపడింది. కొన్ని ట్వీట్ల సందర్భంగా అరెస్టు చేసిన ఆల్ట్ న్యూస్ జుబైర్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది. యుపిలో జుబైర్ పై దాఖలైన అన్ని కేసుల్లోనూ ఆయనను బెయిల్ పై విడుదల చేయాలని ఆదేశిస్తూ, అరెస్టు చేసే అధికారముంది కదా అని రెచ్చిపోకూడదని దాన్ని అరుదుగా వినియోగించాలంటూ మొట్టికాయలు వేసింది. విద్వేష ట్వీట్లు చేశాడన్న ఆరోపణపై జుబైర్‌పై యుపిలో ఆరు కేసులు దాఖలయ్యాయి. నిందితునిపై ఇదే విషయంలో ఢిల్లీ పోలీసులు సమగ్ర విచారణ జరిపిన తర్వాత ఆయన స్వేచ్ఛను అరికట్టడం న్యాయం కాదని స్పష్టం చేసింది. జుబైర్, అజాం ఖాన్ కేసులు రెండింటిలోనూ సుప్రీం కోర్టు వెలిబుచ్చిన అభిప్రాయాలను దేశంలోని న్యాయస్థానాలు శిరోధార్యంగా భావించాలి. నిందితులను నిరవధికంగా జైల్లో వుంచడానికి ప్రభుత్వాలు, వాటి పోలీసులు యెన్ని పన్నాగాలు పన్నినా బెయిల్ మంజూరులో అనవసర ఆలస్యం చేయడం గాని, లేనిపోని షరతులు విధించడం గాని తగదని కోర్టులకు, ముఖ్యంగా హైకోర్టులకు ఈ రెండు కేసుల్లోనూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ కోరడమనేది వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమని, అది రాజ్యాంగం 21 అధికరణ హామీ యిస్తున్న జీవన స్వేచ్ఛలో అంతర్భాగమని ఢిల్లీ హైకోర్టు గత యేడాది వొక తీర్పులో చెప్పింది. ఉరి వంటి తీవ్ర శిక్షలు వేయదగిన కేసుల్లో తప్ప సాధారణ కేసుల్లో బెయిల్ దరఖాస్తులపై సానుకూల నిర్ణయం తీసుకోడానికే ప్రాధాన్యం యివ్వాలి.

నాన్ బెయిలబుల్ కేసుల్లో కూడా ఉచితానుచితాలను లోతుగా పరిశీలించి బెయిల్ మంజూరు చేసే అధికారం ఉన్నత న్యాయస్థానాలకు వుంటుంది. ముఖ్యంగా పాలకులు, పోలీసులు కుమ్మక్కుతో బనాయించే కేసుల్లో స్వతంత్రంగా వ్యవరించాల్సిన బాధ్యత వాటిదే. ‘కింది కోర్టులు అర్హమైన కేసుల్లో ముందస్తుగా గాని, అరెస్టు తర్వాత గాని బెయిల్ మంజూరు చేయకపోతే అది హైకోర్టులకు భారమవుతుంది. హైకోర్టులు ఆ బాధ్యత నిర్వర్తించకపోతే సుప్రీంకోర్టుకు బరువవుతుంది. తమ అధికార పరిధుల్లో వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించేలా హైకోర్టులకు గట్టి సందేశాన్ని యివ్వాలి’ అని ఆర్ణబ్ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి చంద్రచూడ్ స్పష్టం చేశారు. మొత్తం మీద చూసినప్పుడు పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు వీలైనంత వరకు భంగం కలిగించరాదన్నదే ఇందులోని గుణపాఠం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News