Wednesday, May 1, 2024

కోటాకు తూట్లు?

- Advertisement -
- Advertisement -

reservation

 

సుప్రీం కోర్టు ఉత్తర్వులపై ఆందోళన

రిజర్వేషన్లు కొనసాగేలా కేంద్రం అన్ని చర్యలు తీసుకోవాలి :
సుప్రీం ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవద్దు
రిజర్వేషన్ల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై లేదనడం సమ్మతం కాదు : ఎల్‌జెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి పాశ్వాన్
రివ్యూ పిటిషన్ వేయాలి, ప్రాథమిక హక్కుల్లో చేరుస్తూ రాజ్యాంగ సవరణ చేయాలి : మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ : ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే బాధ్యత రాష్ట్రాలపై లేదని, పదోన్నతులలో కోటాను డిమాండ్ చేయడం ప్రాథమిక హక్కు కాదని సుప్రీం కోర్టు ధర్మాసనం తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు సంచలనం రేపాయి. దీనిపై కేంద్రమంత్రి, ఎల్‌జెపి అధ్యక్షుడు రాం విలాస్ పాశ్వాన్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఆదివారం నాడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు ఇస్తున్న రిజర్వేషన్లను చెక్కు చెదరకుండా కొనసాగించాలని కేంద్రానికి సూచించారు. సుప్రీం ఉత్తర్వుపై రివ్యూ పిటిషన్ వేయాలని, రిజర్వేషన్లను ప్రాథమిక హక్కుగా పరిగణిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలని మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఎస్‌సి/ ఎస్‌టిలకు దశాబ్దాల నుంచి అమలువుతున్నట్లుగానే రిజర్వేషన్లు ఉండాలని లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అన్ని చర్యలూ తీసుకోవాలని కోరింది. ఎన్‌డిఎ మిత్రపక్షంగా ఉన్న ఎల్‌జెపి ఆదివారం ఈ డిమాండ్‌కు దిగింది. బిసిలతో పాటు ఎస్‌సి/ ఎస్‌టి కోటా కూడా చెక్కుచెదరకుండా ఉండాల్సిందేనని పార్టీ అధ్యక్షులు , కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. కోటాపై సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం లేదని పరోక్షంగా అభిప్రాయపడ్డారు. కోటా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సమ్మతం కాదన్నారు.

పదోన్నతులు లేదా నియామకాలలో కోటా కల్పన రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణా పరిధిలోకి వస్తుందనడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. ఎప్పటిలాగానే రిజర్వేషన్లు అమలు కావల్సిందేనని, ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని పాశ్వాన్ తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు, సంబంధిత విషయాలను తాను సోమవారం జరిగే ఎస్‌సి/ ఎస్‌టి ఎంపిల భేటీలో ప్రస్తావించనున్నట్లు వెల్లడించారు. లోక్‌సభ రాజ్యసభలకు చెందిన ఎస్‌సి/ ఎస్‌టి ఎంపీలందరిని తాను ఆహ్వానించినట్లు, సోమవారం ఉదయం తన నివాసంలో సమావేశం జరుగుతుందని తెలిపారు.

రివ్యూ పిటిషన్‌కు ఖర్గే డిమాండ్..
నియామకాల్లో రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం కానీ లేదా రిజర్వేషన్ ప్రాథమిక హక్కుగా పరిగణిస్తూ రాజ్యాంగాన్ని సవరించడం కానీ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత మలికార్జున ఖర్గే ఆదివారం డిమాండ్ చేశారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం తీసుకుని న్యాయవిభాగంతో సంప్రదించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4)(బి) లేదా (సి) సవరించడం కానీ లేదా ఈ కేసును విచారించాలని సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం కానీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బెంగళూరులో కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో ఆదివారం మాట్లాడారు. ఈ అంశాన్ని తమ పార్టీ పార్లమెంటు లోపల బయట చర్చకు లేవదీయనున్నట్టు చెప్పారు.

నియామకాల్లో రిజర్వేషన్ల కల్పనకు రాష్ట్రాలు కట్టుబడి ఉండనవసరం లేదని, అలాగే ఇది ప్రాథమిక హక్కు కాదని సుప్రీం కోర్టు ఉత్తర్వు జారీ చేసింది. ఉత్తరాఖండ్ లోని పబ్లిక్‌సర్వీసులకు సంబంధించిన నియామకాల్లో రిజర్వేషన్లతో ప్రమేయం లేకుండా నియామకాలు జరపాలని 2012 సెప్టెంబర్ 5న ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై తలెత్తిన వ్యాజ్యాలపై సుప్రీం కోర్టు పై విధంగా ఉత్తర్వు జారీ చేసింది. రాజ్యాంగ పరమైన ఈ అంశం కేవలం ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి పరిమితం చేయరాదని పూర్తి ధర్మాసనం విచారించాలని ఖర్గే డిమాండ్ చేశారు.

Supreme Court orders on reservation
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News