Sunday, May 5, 2024

కోర్టు ద్వారా బిడ్డను చంపించాలనుకుంటున్నారా ?

- Advertisement -
- Advertisement -

26 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు విచారణలో సుప్రీం కీలక వ్యాఖ్య

న్యూఢిల్లీ : 26 వారాల తన గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిన్నం చేసుకోడానికి అనుమతించాలని 27 ఏళ్ల ఓ మహిళ అభ్యర్థించడమే కాక, ఆమెకు వత్తాసుగా కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టును అభ్యర్థించడంపై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం లోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వుల ద్వారా బిడ్డను చంపేందుకు పిటిషనర్ అనుమతి కోరుతున్నారా ? అని సిజేఐ ప్రశ్నించారు. బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్న పిండాన్ని తాము చంపలేమని సీజేఐ వ్యాఖ్యానించారు.

తన గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలని కోరుతూ ఇద్దరు పిల్లలున్న ఓ 27 ఏళ్ల వివాహిత ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గత ప్రసవాల తర్వాత తాను కుంగుబాటుతో ఇబ్బంది పడుతున్నానని, మానసికంగా, ఆర్థికంగా తాను మూడో బిడ్డను కని పెంచే పరిస్థితుల్లో లేనని ఆమె న్యాయస్తానానికి వివరించారు. ఈ పిటిషన్‌పై మొదట విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం, వైద్యపరంగా గర్భవిఛ్ఛిత్తి చేసుకోడానికి అక్టోబర్ 9 న ఆమెకు అనుమతినిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది.

పిండం బతికే అవకాశాలు ఉన్నాయని ఎయిమ్స్ వైద్యులు తాజాగా ఇచ్చిన నివేదికను ప్రస్తావించింది. దీంతో ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం లోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు చేరింది. ఈ నేపథ్యంలో గర్భవిచ్ఛిత్తి ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన సీజేఐ నేతృత్వం లోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. “ తల్లి హక్కుతోపాటు గర్భస్థ శిశువు హక్కుల మధ్య సమతౌల్యం పాటించాల్సిన అవసరం ఉంది. ఆ పిండం సజీవంగా ఉంది.

బతికే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఆ పిండం గుండె చప్పుడును ఆపమని మేమే ఎయిమ్స్ వైద్యులతో చెప్పాలని మీరు కోరుకుంటున్నారా ? ఆ బిడ్డను మేం చంపలేం ” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. “ ఈ పిండాన్ని మోస్తూ 26 వారాలుగా ఎదురు చూశారు. ఇంకొన్ని వారాలు మోయలేరా ? అప్పుడైతే ఆరోగ్యకరమైన శిశువు జన్మించే అవకాశం ఉంటుంది. ” అని కోర్టు అభిప్రాయపడింది. మరికొన్ని వారాలు బిడ్డను మోసే బాధ్యత గురించి ఆ మహిళతో మాట్లాడాలని కేంద్రం, పిటిషనర్ తరఫు న్యాయవాదులకు సూచించింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News