Sunday, May 5, 2024

పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టండి : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వర్షాలతో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. శనివారం పురపాలక శాఖ ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కెటిఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో వారం రోజులుగా భారీగా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి కెటిఆర్ పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరా, కలుషిత నీటి ద్వారా వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సూచనలు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను ఒక సవాలుగా తీసుకొని మరింత నిబద్ధతతో ముందుకు పోవాలని అధికారులకు కెటిఆర్ పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇతర శాఖల సిబ్బందితోనూ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలన్నారు. ఎట్టి పరిస్థితులలో ప్రాణ నష్టం జరగకుండా చూడడమే అత్యంత ప్రాధాన్యతగా పరిగణించాలన్నారు.
అవసరమైతే చెరువులో నీటి ఖాళీ చేయించండి
పట్టణాల్లో ఉన్న చెరువులు పూర్తిగా నిండాయని.. వాటిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. అవసరమైతే సాగునీటి శాఖ అధికారులతో మాట్లాడి ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని కొంత ఖాళీ చేయించాలని మంత్రి కెటిఆర్ సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. పట్టణాల్లో ముఖ్యంగా ప్రధాన రహదారులపై పేరుకుపోయిన బురదను తొలగించేందుకు వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని, అదనపు వాహనాలను సమకూర్చుకోవాలని ఆదేశించారు.

ప్రజలు తాగునీటిని కాచి వడపోసుకొని వినియోగించాలని అవగాహన వచ్చే చర్యలు తీసుకోవాలని సూచించారు. సురక్షిత తాగునీరు సరఫరా కోసం మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకొని పైపులైన్ల లీకేజీలు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. వర్షాలతో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. శిధిలావస్థలో ఉన్న పురాతన భవనాలను వెంటనే తొలగించాలని, విద్యుత్ శాఖతో జాగ్రత్తగా సమన్వయం చేసుకొని మరమత్తు కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News