Friday, April 26, 2024

పట్టుబిగించిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

TeamIndia set 305-run target ahead of South Africa

బుమ్రా మ్యాజిక్, కష్టాల్లో సౌతాఫ్రికా

సెంచూరియన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు ఆలౌటైంది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని ఆతిథ్య సౌతాఫ్రికా ముందు 305 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఉంచింది. తర్వాత లక్షఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా బుధవారం ఆట ముగిసే సమయానికి 94 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఒక దశలో 72/2తో పటిష్టంగా కనిపించిన సౌతాఫ్రికాను భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా దెబ్బతీశాడు. కీలక సమయంలో బుమ్రా రెండు వికెట్లను పడగొట్టి టీమిండియాకు పైచేయి అందించాడు. సమన్వంయతో ఆడుతున్న వండర్ డుసెస్ (11)ను బుమ్రా ఔట్ చేశాడు. కెప్టెన్ డీన్ ఎల్గర్‌తో కలిసి డుసెన్ చాలా సేపటి వరకు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు.

ఆత్మరక్షణతో బాయటింగ్ చేసిన డుసెన్ 65 బంతుల్లో 11 పరుగులు చేసి బుమ్రా వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కొద్ది సేపటికే కేశవ్ మహారాజ్ కూడా ఔటయ్యాడు. 19 బంతుల్లో ఒక ఫోర్‌తో 8 పరుగులు చేసిన మహారాజ్‌ను కూడా బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా 94 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన డీన్ ఎల్గర్ 112 బంతుల్లో ఏడు ఫోర్లతో 52 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. ఓపెనర్ ఐడెన్ మార్‌క్రామ్ (1) మరోసారి నిరాశ పరిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన పీటర్సన్ (17) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. కాగా, భారత బౌలర్లలో బుమ్రా రెండు, షమి, సిరాజ్ ఒక్కో వికెట్ వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే గురువారం చివరి రోజు సౌతాఫ్రికా మరో 211 పరుగులు చేయాలి. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా మారడంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కే గెలుపు అవకాశాలు అధింకగా కనిపిస్తున్నాయి.

తక్కువ స్కోరుకే పరిమితం..

అంతకుముందు 16/1 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు బ్యాటింగ్‌ను ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. శార్దూల్ (10)ను ఔట్ చేయడం ద్వారా రబాడ వికెట్ల వేటకు శ్రీకారం చుట్టాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో రాహుల్ 23 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక సీనియర్ బ్యాట్స్‌మన్ పుజారా తన వైఫల్యాన్ని ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. 16 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి (18), అజింక్య రహానె (20) కూడా నిరాశ పరిచారు. రిషబ్ పంత్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అశ్విన్ 14 పరుగులు సాధించాడు. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి తట్టుకోలేక టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే ఆలౌటైంది. రబాడ, జాన్‌సెన్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. ఎంగిడికి రెండు వికెట్లు దక్కాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News