Thursday, May 2, 2024

టెస్టింగ్ కెపాసిటిని పెంచిన ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

Telangana Government increased Covid testing capacity

వైరస్ వ్యాప్తిని అంచనాకు తగ్గట్టు భారీ స్థాయిలో పరీక్షలు
ఒక్కొక్క కంటైన్‌మెంట్ నుంచి 150 నుంచి 250 శాంపిల్స్ సేకరణ
పది రోజుల్లో 30 నియోజకవర్గాల్లో 50వేల మంది టార్గెట్

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం టెస్టులు సంఖ్యను పెంచింది. వైరస్ వ్యాప్తిని అంచనా వేసేందుకు భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని సిఎం సూచన మేరకు వైద్యాధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి రోజు సిటీలో కొండాపూర్, బాలాపూర్, వనస్థలిపురం, గొల్కొండ, అంబర్‌పేట్, రామాంతపూర్ హోమియో ఆసుపత్రి, ఎర్రగడ్డ ఆయుర్వేదిక్, సరోజినిదేవి ఆసుపత్రులలో కేంద్రాలు ఏర్పాటు చేసి టెస్టులను షురూ చేశారు. ప్రతి కేంద్రంలో 150 నుంచి 250 వరకు శాంపిల్స్‌ను సేకరించామని వైద్యాధికారులు పేర్కొన్నారు. ఈ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఉన్న కంటైన్‌మెంట్ జోన్ నుంచి లక్షణాలు ఉన్న వారికి, అనుమానితులకు శాంపిల్స్ సేకరించమని అధికారులు స్పష్టం చేశారు.

మరి తొమ్మిది రోజుల్లో హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో 50వేల మందికి టెస్టులు చేయాలని లక్షంగా పెట్టుకున్నామని, పరిస్థితిని బట్టి వాటి సంఖ్యను పెంచుతామని వైద్యాశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి జరగలేదని ఐసిఎంఆర్ స్వయంగా చెప్పినప్పటికీ, కొంత మంది చేస్తున్న ఆరోపణలకు ప్రజలకు భయబ్రాంతులకు గురవుతున్నారని అధికారులు తెలిపారు. ఈక్రమంలో 30 నియోజకవర్గాల్లో పరీక్షలు చేసి పూర్తిస్థాయి నివేదికను ప్రజలు ముందు పెడతామని వైద్యశాఖ ఉన్నతాధికారుల్లో ఒకరు మన తెలంగాణకు వివరించారు.

హైదరాబాద్‌లోనే ఎందుకు…?

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజూ నమోదవుతున్న కరోనా కేసుల్లో దాదాపు 85 శాతం మంది జీహెచ్‌ఎంసి పరిధిలో నివసిస్తున్న వారే. గత నెల రోజుల నుంచి ప్రతి రోజు సగటున 125 తగ్గకుండా ఈ పరిధి నుంచి కేసులు వస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. మొదట కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాలను పూర్తిస్థాయిలో దిగ్భందించినా, లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కేవలం పాజిటివ్ వచ్చిన వారి గృహాలనే అధికారులు కంటైన్‌మెంట్ చేస్తున్నారు. ఈక్రమంలో కొంత మంది నిర్లక్షంగా క్వారంటైన్, కంటైన్‌మెంట్ల నుంచి కూడా మార్కెట్లకు వస్తున్నారు.

దీంతో వైరస్ వ్యాప్తి పెరిగిందని అధికారులు గుర్తించారు. ఇటీవల వనస్థలిపురంలో ఒకే ఇంట్లో 18 మందికి ఇదే విధానంలో వైరస్ వచ్చిందని స్థానిక మెడికల్ అధికారులు తెలిపారు. ఆ ఉమ్మడి కుటుంబంలో నుంచి ఓ వ్యక్తి క్వారంటైన్‌లో ఉన్న తన స్నేహితుడికి కలిసేందకు వెళ్లి వారి ఇంట్లో అందరికీ వైరస్ సోకేందుకు కారణమయ్యాడని అధికారులు పేర్కొన్నారు. ఇదిలాఉండగా లాక్‌డౌన్ తర్వాత ప్రజలు విచ్చలవిడిగా బయట తిరగడం వలన వైరస్ వ్యాప్తి పెరిగింది. దీంతోనే ప్రతి రోజూ హైదరాబాద్‌లో నగరంలో భారీగా కేసులు నమోదవుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఈక్రమంలో ర్యాండమ్‌గా టెస్టులు చేసి వైరస్ వ్యాప్తిని అంచనా వేస్తామని అధికారులు వెల్లడించారు.

ర్యాండమ్ టెస్టులు చేసే ప్రాంతాలు ఇవే……

జిహెచ్‌ఎంసితో పాటు చుట్టు పక్కల జిల్లాల్లు ఉన్న 30 అసెంబ్లీ పరిధిలో 50 వేల టెస్టులు చేసే ప్రాంతాలను అధికారులు సెలక్ట్ చేశారు. వీటిలో వికారాబాద్, తాండూర్, పరిగి, చేవేళ్ల, మేడ్చల్, మల్కాజ్‌గిరి, కుత్భుల్లాపూర్, ఉప్పల్, ఎల్‌బినగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మలక్‌పేట్, అంబర్‌పేట్, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనతనగర్, కార్వన్, నాంపల్లి, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహుదూర్‌పురా, సికింద్రాబాద్, కంటోన్మెంట్, పటాన్‌చెరు తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న 11 ల్యాబ్‌లలో ప్రతి రోజూ 4వేల మందికి టెస్టింగ్ చేసే సామార్థం ఉందని, దీనికి తోడు మరో 3వేల మందికి పరీక్షల నిర్వహించే మెషిన్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్నామని వైద్యాధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఒక్క రోజులో 7వేల మందికి టెస్టులు చేసే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా ఇటీవల ప్రైవేట్‌కు అనుమతి ఇచ్చిన ల్యాబ్‌లలో మరో 2500 నుంచి 3000 మందికి టెస్టులు చేసే సామర్థం ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది.

వీరికి మాత్రమే టెస్టులు..

వైరస్ ఎదుర్కొనేందుకు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న వైద్యసిబ్బంది, మున్సిపల్, పోలీస్, మీడియా ఉద్యోగుల్లో ఉన్న వారిలో లక్షణాలు ఉంటే టెస్టులు చేస్తామని అధికారులు ప్రకటించారు.దీంతో పాటు కంటైన్‌మెంట్ జోన్‌లో ఉన్న గర్బిణీ స్త్రీలకు ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించుకున్నారు. అదే విధంగా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని నేరుగా కలసిన ప్రైమరీ కాంటాక్ట్‌లకు, కంటైన్‌మెంట్ జోన్లలో నివసించే వారిలో వైరస్ లక్షణాలు ఉంటే పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం ట్రీపుల్ ట్రీ విధానంలో ముందుకెళ్తుందని, ప్రస్తుతం టెస్టింగ్ కెపాసిటీని పెంచామని, వీటి నిర్ధారణ తర్వాత ట్రెసింగ్, ట్రీట్‌మెంట్ విధానాలను కూడా వేగంగా చేసి కరోనాను కట్టడి చేస్తామని వైద్యారోగ్యశాఖ చెబుతుంది.

Telangana Government increased Covid testing capacity

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News