Wednesday, May 8, 2024

అభివృద్ధి,సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ: అభివృద్ధ్ది, సంక్షేమ రంగాలల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుందని మిగిలిన రాష్ట్రాలకు మోడల్‌గా నిలుస్తుందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం బాన్సువాడ మండలంలోని కొల్లూర్ గ్రామంలో పల్లె ప్రగతి దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులతో కూడిన ఫ్లెక్సీలను రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేశారు. కొల్లూర్ గ్రామంలో రూ. 60 లక్షలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 6 అదనపు తరగతి గదులను ప్రారంభించారు.

రూ. 20 లక్షలతో నిర్మించే సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నాగారం గ్రామంలో రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించే గ్రామ పంచాయతీ భవనానికి, రూ. 5 లక్షలతో నిర్మించే ముదిరాజ్ సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ దేశంలో తెలంగాణ రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలకు మోడల్‌గా తయారైందన్నారు. అభివృద్ధ్ది, సంక్షేమ రంగాలలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామన్నారు. గ్రామాలలో అభివృద్ధ్ది, మౌలిక సౌకర్యాల కల్పన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా నిధులను మంజూరు చేస్తుందన్నారు.

2004 నుంచి 2014 వరకు గత ప్రభుత్వాలు గ్రామాలలో మౌలిక వసతుల కోసం రూ. 12 వేల కోట్లు ఖర్చు చేస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 9 ఏండ్లలో 58 వేల కోట్లను ఖర్చు చేసిందన్నారు. తాగునీటి కోసం గత ప్రభుత్వాలు రూ. 4198 కోట్లు ఖర్చు చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడ్డాక ఇంటింటికి తాగునీరు కోసం రూ. 36 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ.3618 కోట్లు ఖర్చు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం రూ. 9797 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ఇచ్చాం, దానితో పాటుగా నీళ్ల సరఫరా కోసం ట్యాంకర్‌ను ఇచ్చామన్నారు. పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని, వైకుంఠ దామాలు కట్టించామన్నారు. దేశంలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో 45 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయన్నారు. ఇందులో 4.70 లక్షల మంది బిడి కార్మికులున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు,వితంతువులు, ఒంటరి మహిళలకు ఇస్తున్న రూ. 2 వేల పింఛన్, వికలాంగులకు ఇస్తున్న రూ. 3 వేల పింఛన్ దేశంలోనే అత్యధికమన్నారు. పేదింటి ఆడ బిడ్డల పెండ్లిలకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం ద్వారా నగదు సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. గర్బవతి అయిన తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని, అందుకే అంగన్‌వాడీ కేంద్రాలలో మంచి భోజనం పెడుతున్నారన్నారు. అదేవిధంగా నూట్రిషన్ కిట్‌ను అందిస్తున్నామన్నారు.

గతంలో ఆస్పత్రుల్లో సీజరియన్లు ఎక్కువగా జరిగేవని, ఇప్పుడు సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. డెలివరీ అయిన తర్వాత తల్లి, బిడ్డలకు అవసరమైన 14 రకాల వస్తువులను కేసిఆర్ కిట్ ద్వారా అందిస్తున్నామన్నారు. ప్రధాన మంత్రి స్వంత రాష్ట్రం గుజరాత్‌లో కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో కూడా మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం సూచిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఒప్పుకోలేదన్నారు. నా గొంతులో ప్రాణం ఉండగా, ఒప్పుకోనని అసెంబ్లీలో ప్రకటించారన్నారు.

గురుకులాల్లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 1.25 లక్షలు ఖర్చు చేస్తుందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా 26 వేల చెరువులను బాగు చేసుకున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తున్నాయన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని గ్రామాలలో అడిగిన అన్ని పనులకు నిధులు మంజూరు చేశామన్నారు. పేదల కోసం 100 జనరల్ ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తున్నామన్నారు.

ఇందులో కిరాయి కేవలం రూ. 5 వేలు మాత్రమే అన్నారు. సీఎం కేసిఆర్ సహకారంతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా 300 తరగతి గదులను నిర్మించామని, 150 అంగన్‌వాడీ కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఆర్డీవో రాజాగౌడ్, డీఎస్పీ జగన్నాథ రెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రాం రెడ్డి, ఎంఈవో నాగేశ్వర్ రావు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News