Thursday, April 25, 2024

2030నాటికి రూ.30 వేలకోట్లకు విత్తనోత్పత్తుల లక్ష్యం

- Advertisement -
- Advertisement -

దేశానికి సీడ్ హబ్‌గా తెలంగాణ
పార్లమెంట్‌కు కొత్త విత్తన చట్టం
ఆమోదం కోసం సంస్థల ఎదురు చూపు

Seeds for cultivation of yasangi crops in telangana
మనతెలంగాణ/హైదరాబాద్:  వ్యవసాయరంగంలో పరిశోధనలు మరింతగా ఫలవంతమవుతున్నాయి. అధునాతన శాస్త్ర సాంకేతికత పంట పోలాలకు చేరుతున్నకొలది అధికోత్పత్తుల సాధన దిశగా వ్యవసాయ రంగం పురోగమిస్తోంది. దేశ ప్రగతికి బాటలు వేసే వ్యవసాయరంగంలో పంటల సాగుకు మూలాధారం అయిన విత్తన రంగంలో దేశం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోంది. విత్తననోత్పత్తుల రంగంలో హైబ్రిబ్ టెక్నాలజి విప్లవాత్మక మార్పులకు బీజం వేస్తోంది. ప్రస్తుతం దేశంలో రూ.20వేల కోట్ల విలువమేరకు ఉన్న విత్తనోత్పత్తుల ఎగుమతులు 2030నాటికి రూ.30వేలకోట్లకు చేరుకోవాలన్నది ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. ఆదిశగా ప్రభుత్వ , ప్రైవేటు రంగాల్లో ఉన్న అవకాశాలను మరింత విస్తరించేదిశగా కృషి చేస్తున్నారు. దేశంలో విత్తనోత్పత్తుల హబ్‌గా పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రం ఈ రంగంలో సరికొత్త పరిశోధనలతో ముందుకు సాగుతోంది. దేశంలో సుమారు 400విత్తనోత్పత్తి కంపెనీలు ఉండగా, అందులో అత్యధికశాతం తెలంగాణ రాష్ట్రంనుండే తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ , ప్రైవేటు విత్తనోత్పత్తుల సంస్థల ద్వారా తెలంగాణ రాష్ట్రం నుండి ఏటా రూ.10వేలకోట్ల విలువ మేరకు వివిధ రకాల పంటలకు సంబంధించిన విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయి. రానున్న దశాబ్దకాలంలో తెలంగాణ రాష్ట్రం నుంచి విత్తనోత్పత్తులను రూ.20వేలకోట్లకు చేర్చాలన్నది లక్షంగా పెట్టుకున్నారు. ఆదిశగా విత్తనోత్పత్తుల పరిశోధనలు , విత్తనోత్పత్తుల పంటల సాగును పెంచేదిశగా చర్యలు చేపట్టారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో విత్తన పరీక్షలు:

ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న అధికశాతం విత్తనాలు దేశమంతటికే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. అయితే విదేశీ విత్తన మార్కెట్‌లో మన వాటాను మరింతగా పెంచుకునేందుకు హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన విత్తన పరీక్షా కేంద్రాన్ని రాష్ట ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించింది. వ్యవసాయరంగానికి నాణ్యమైన విత్తనాలు అందించటమే లక్షంగా ప్రత్యేక చర్యలు చేపట్టింది.

వంటనూనెల స్వయం సమృద్ధిపై దృష్టి:

ప్రజల ఆహారపు అవసరాలకోసం ఏటా వివిధ దేశాలనుంచి 16మిలియన్ టన్నులు వంటనూనెలు దిగుమతి చేసుకోవాల్సివస్తోంది. ఈ నేపధ్యంలో పామాయిల్ , పొద్దు తిరుగుడు వంటి వంటనూనెల దిగుమతిని తగ్గించి దేశీయంగానే వాటిని ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. దేశంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నారు. వంటనూనెల్లో ఒక టన్ను నూనెను ఉత్పత్తి చేస్తే , మరో టన్ను కేక్ ఉత్పత్తి కూడా లభిస్తోంది. కేక్ పశువుల దాణగా, సేంద్రీయ ఎరువుగా కూడా ఉపయోగపడుతోంది. నూనెగింజ పంటల సాగును పెంచేందుకు ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా అధిక దిగుబడులు ఇచ్చే నూనెగింజల విత్తనాలపై విత్తన పరిశోధన సంస్థలు దృష్టి సారిస్తున్నాయి.

కొత్త విత్తన చట్టం కోసం ఎదురు చూపులు :

దేశంలో విత్తనోత్పత్తుల రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశంలో 400కుపైగా విత్తనోత్పత్తులు కంపెనీలు ఉన్నాయి. అందులో కొన్ని కంపెనీలు విత్తన పరిశోధనలకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ కంపెనీలు అధిక దిగుబడులు, మంచి నాణ్యత , వాతావరణ పరిస్థితులను తట్టుకునే కొత్తరకం విత్తనాలకోసం నిరంతరం పరిశోధనలు సాగిస్తుంటాయి. వీటి వ్యాపార లావాదేవీల టర్నోవర్‌లో 10శాతం పరిశోధనలపైనే వ్యయం చేస్తుంటాయి. అయితే ప్రభుత్వం పరిశోధనలు చేసే కంపెనీలను , పరిశోధనలు చేయకుండానే విత్తనాలు మార్కెట్లోకి తెస్తున్న కంపెనీలను ఒకేగాటన కట్టేస్తోంది. అంతే కాకుండా హైబ్రిడ్ రకాల్లో కొన్నింటి మేధోసంపత్తిని సులువుగా కాపీ కొట్టి నకిలీలను సృష్టించి వాటికి తమ సొంత బ్రాండ్ ముద్రలతో లేబుళ్లు అతికించి మార్కెట్లోకి వదులుతున్నాయి. వీటి ద్వారా పరిశోధనలకు ప్రాధాన్యత ఇస్తున్న కంపెనీలు నష్టపోవాల్సివస్తోంది. విత్తన చట్టాలను పటిష్టం చేసేందకు కేంద్ర ప్రభుత్వం ముసాయిదాను రూపొందించి చట్టబద్దతకోసం పార్లమెంట్‌కు పంపింది. ఈ ముసాయిదాకు పార్లమెంట్‌లో ఆమోదముద్ర కోసం విత్తనోత్పత్తుల సంస్థలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాయి. ముసాయిదాకు కొన్ని సవరణలు కూడా ప్రతిపాదించాయి. విత్తన రంగంలొ కొత్త చట్టాలు అమల్లోకి వస్తే ఇటు రైతులకే కాకుండా విత్తనోత్పత్తి సంస్థలకు కూడా రక్షణ కలుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News