Sunday, April 28, 2024

వరికి మారుగా

- Advertisement -
- Advertisement -

Telangana to focus on alternative crops in yasangi

ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం ఇస్తూ యాసంగి సాగు ప్రణాళిక
కసరత్తు చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు

మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో రాసి కన్నా వాసికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వానాకాలపు పంటసాగు సీజన్ ముగింపు దశకు చేరుకొవటంతో ప్రభుత్వం యాసంగి పంటల సాగు ప్రణాళికలను సిద్దం చేస్తోంది. రైతులు పండించిన పంటలకు మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు కల్పించటం , పంట విక్రయాలను సులభతరం చేయటం , ఎగుమతులకు ప్రాధాన్యం ఉన్న పంటల సాగును ప్రొత్సహించటం తదితర అంశాలపైన దృష్టి పెట్టింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఎర్పడ్డాక టిఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. కృష్ణా, గోదావరి నదుల పరివాహకంగా అప్పటికే ఉన్న ప్రాజెక్టులను రీడిజైన్ల పేరుతో వాటి సామర్ధాన్ని పెంచుకుంటూ వచ్చింది. పలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి కృష్ణా,గోదావరి నదీజలాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు పలు ఎత్తిపోతల పథకాలను నిర్మించింది. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని జీవనాడిగా మలచింది.

పెద్ద ఎత్తున సాగునీటి వనరులు అందుబాటులోకి రావటం , భూగర్చ జలాలు పెరటంతో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. రైతులు పెద్ద ఎత్తున వరిసాగువైపు మళ్లటంతో జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా మారింది. ఇంత చేసినా కేంద్ర ప్రభుత్వం నుంచి ధాన్యం రైతులకు తగిన ప్రొత్సాహం లేకపోవటంతో పంటసాగులో రైతుల ఉత్సాహం నీరుగారుతోంది. ధాన్యం సేకరణ , కొనుగోళ్లపై కేంద్రం విధించిన పరిమితులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగానికి పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం రానున్న యాసంగి పంటల సాగు సీజన్ నుంచి వినూత్న రీతిలో పంటల సాగు ప్రణాళికలకు రూపకల్పన చేస్తోంది.

వరి సాగును గణనీయంగా తగ్గించాలని నిర్ణయించింది. ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో కూడా అధికారుల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. వరిసాగును తగ్గించి ఇతర లాభసాటి పంటల సాగు దిశగా రైతులను ప్రొత్సహించాలన్న నిర్ణయానికి వచ్చింది. 202021 యాసంగిలో అన్ని రకలా పంటలు కలిపి 68.14లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. అంతకు కిందటి ఏడాది యాసంగి కంటే పది లక్షల ఎకరాల్లో అధికంగా పంటలు సాగులోకి వచ్చాయి. 38లక్షల ఎకరాల విస్తీర్ణానికి పరిమితం అయిన వరిసాగు ఏకంగా రికార్డు స్థాయిలో 52.78లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చింది. ధాన్యం ఉత్పత్తులు కూడా భారీగా పెరగటంలో మార్కెటింగ్ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. రైతులు నష్టపోకుండా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే రంగంలో దిగి రైతులనుంచి ధాన్యం కొనుగోళ్లు చేసింది. ఈ ఏడాది వానాకాలంలో వరిసాగును తగ్గించాలని వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించింది. వరి స్థానంలో పత్తి, కంది పంటల సాగు విస్తీర్ణం పెంచాలని లక్ష్యాలు రూపొందించింది.

అయితే వాతావరణం అనుకూలించటం, భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులు , చెరువులు పూర్తి స్థాయిలో నిండిపోవటం ,భూగర్భజల మట్టాలు కూడా పెరగటంతో రైతులు మార్కెట్‌లో ఎదురైన గత అనుభవాలను మరిచి పోయి మళ్లీ వరిసాగుపట్ల ఉన్న అనుబంధాలను వదులుకోలేపోయారు.దీంతో ఈ వానాకాలంలో అధికశాతం రైతులు వరిసాగుకే మొగ్గు చూపారు. రాష్ట్రంలో వానాకాలపు పంటసాగు విస్తీర్ణం ఇప్పటికే 1,25,86,600ఎకరాలకు చేరుకుంది. అందులో వరి సాగు 52.72లక్షల ఎకరాలకు చేరుకుంది. ఇంకా అక్కడక్కడా రైతులు వరినాట్లు వేస్తూనే ఉన్నారు. ఈ నెలాఖరు వరకు వరినాట్ల పనులు కొనసాగనున్నాయి. సీజన్ ముగిసే సరికి వరిసాగు విస్తీర్ణం 55లక్షల ఎకరాలకు చేరుకునే అవకాశం ఉన్నట్టు వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యాసంగిలో వరి సాగు విస్తీర్ణం తగ్గించుకోలేక పోతే ధాన్యం విక్రయాల్లో రైతులు సమస్యలు ఎదుర్కోక తప్పదు. దీంతో వరిసాగు విస్తీర్ణాన్ని తగ్గిస్తూ ఆ స్థానంలో ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించే దిశకగా ప్రభుత్వం యాసంగి పంటలసాగు ప్రణాళికలను రూపొందింస్తోంది.

నూనె గింజ పంటలు , పప్పుధాన్య పంటలకు మార్కెట్‌లో లాభసాటి ధరలు లభిస్తుండటంతో ప్రభుత్వం కూడా వరికి ప్రత్యామ్నాయ పంటలుగా వాటివైపే మొగ్గు చూపుతోంది. గత రెండు సీజన్లలో కూడా రైతులు నూనెగింజలు , పప్పుధాన్య పంటల పట్ల ఆసక్తి చూపారు. 201920యాసంగిలో వేరుశనగ పంట 2.24లక్షల ఎకరాల్లో సాగు చేసిన రైతులు గత యాసంగిలో దీన్ని 2.78లక్షల ఎకరాలకు పెంచారు. పొద్దు తిరుగుడు పంట కూడా 9960ఎకరానుంచి గత ఏడాది రెట్టింపుసాగులోకి వచ్చింది. మార్కెట్లో వంట నూనెల ధరలు పెరగటం ,నూనెగింజ పంటలకు గిట్టుబాటు ధరలు లభిస్తుండటంతో గత యాసంగిలో రైతులు పొద్దుతిరగుడు పంటను 18,770ఎకరాల్లో సాగు చేశారు.

మొత్తంగా వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, కుసుమ తదితర అన్ని రకాల నూనెగింజ పంటలు కలపి 3.70లక్షల ఎకరాల్లో సాగుచేశారు. ఈ సారి యాసంగిలో నూనెగింజ పంటల సాగు విస్తీర్ణం రెట్టింపు చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. పప్పు ధాన్య పంటల సాగు విస్తీర్ణం పెంపుదలకు కూడా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. పెసర , మినుము, కంది , పప్పుశనగ తదితర అన్ని రకాల పప్పుధాన్య పంటలు కలిపి గత యాసంగిలో 4.58లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. పప్పుధాన్య పంటలకు కూడా మార్కెట్లో మంచి ధరలే లభిస్తున్నాయి. ఈ యాసంగిలో పప్పుశనగ సాగు విస్తీర్ణం 5లక్షలక పెరిగే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. మినుము , పెసర పంటలు మరో లక్ష ఎకరాల్లో సాగు చేయించాలన్న అభిప్రాయంతో ఉన్నారు. అక్టోబర్ మొదటి వారం నాటికి యాసంగి పంటల సాగు ప్రణాళిక సిద్దం కానున్నట్టు వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News