Saturday, April 27, 2024

తెలంగాణలో ప్రతిగ్రామానికి ఒక చరిత్ర

- Advertisement -
- Advertisement -

సాహిత్య అకాడమీ ఛైర్మెన్ జూలూరు గౌరీశంకర్

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో ప్రతిగ్రామానికి ఒక చరిత్ర ఉన్నదని, ఆ చరిత్ర రికార్డు చేసి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మెన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. బైరాన్‌పల్లి నుండి జనగాం వరకు , కడవెండి నుండి జంగిలిగొండ వరకు మహోజ్జలమైన చరిత్ర కలిగి ఉందన్నారు. ఆదివారం నాడు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో రచయిత గుండెల రాజు రాసిన మహబూబాబాద్ జిల్లా జంగిలిగొండ గ్రామ చరిత్ర పుస్తకాన్ని సాహిత్య అకాడమి ఛైర్మెన్ జూలూరు గౌరీశంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ జంగిలిగొండ గ్రామ చరిత్ర’ను సీనియర్ జర్నలిస్టు, రచయిత గుండెల రాజు శాస్త్రీయంగా గ్రామాన్ని విశ్లేషిస్తూ ఊరు వివరాలన్ని రికార్డు చేశారని అన్నారు. ఊరు చరిత్ర రికార్డు చేయడానికి ఏమి కావాలో తెలిసిన వ్యక్తి కావడంతో ఆయన హృదయానికి తట్టిన ఆలోచనలకు అనుగుణంగా వాస్తవాలను క్రోడీకరించి తన గ్రామ నిజమైన ఘనమైన చరిత్రను భావితరాలకు అందించాలరని కొనియాడారు.

తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామాన్ని తట్టిలేపినా ఎన్నో చారిత్రాత్మక ఘటనలకు సాక్షిభూతంగా నిలిచాయన్నారు. ప్రతి గ్రామం వందల సంవత్సరాల సాంస్కృతిక చారిత్రక వారసత్వం కలిగి ఉన్నాయని అన్నారు. ఒక జర్నలిస్టుగా, చిత్రకారుడిగా ,రచయితగా అన్ని రంగాల్లో పరకాయ ప్రవేశం చేసి సత్యాన్వేషిగా గ్రామ చరిత్రను వెలికి తీసిన గుండెల రాజు తెలంగాణ ఉద్యమ కారుడిగా కూడా మంచి గుర్తింపు ఉందన్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో మానుకోట రాళ్లదాడిలో తీవ్రంగా గాయపడిన గుండెల రాజును తెలంగాణ ఉద్యమ నేత , ప్రస్తుత సీఎం కెసిఆర్ పరామర్శించి ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బిసి కమిషన్ సభ్యులు ఉపేంద్ర మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన గ్రామ చరిత్రను భావితరాలకు అందించాలనే సదుద్దేశ్యంతో ప్రతి అంశాన్ని కూలంకశంగా పరిశీలించి నమ్మదగ్గ సమాచారంతో వ్యయప్రయాసలకోర్చి గుండెల రాజు చేసిన ప్రయత్నం అభినందనీయమని అన్నారు. తన రెండేళ్ల పరిశోధన ఫలితంగా ఆవిస్కృతమైన జంగిలిగొండ గ్రామ చరిత్ర యావత్ తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల చరిత్రను రాస్తున్న యువతకు, విద్యార్ధులకు ఆదర్శమని అన్నారు.

ఈ కార్యక్రమంలో విచ్చేసిన మరో అతిథి సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ డైరెక్టర్, ఓయూ ప్రొఫెసర్ కొండ నాగేశ్వర్ రావు మాట్లాడుతూ గ్రామం చిన్నదైన ఆ గ్రామానికి ఉన్న విరోచిత, సాంస్కృతి సాంప్రదాయ చరిత్రకు అనుగుణంగా ఆధునిక యుగంలో జరిగిన మార్పులు బేరీజు వేసుకుంటూ మొత్తం 49 అంశాలపై లోతుగా అధ్యయనం చేసి గ్రామ చరిత్రను రాసిన తీరు అబ్బురపరిచిందన్నారు. నేటి తరానికి తెలియని నాటి గ్రామ చరిత్రను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లాంటి ముఖ్యవిషయాలను ఉటంకిస్తూ గుండెల రాజు చేసిన ప్రయోగం యువకు భావితరాలకు తరగని విజ్ఞాన ఖని అని అన్నారు. అనంతరం జంగిలిగొండ గ్రామ చరిత్ర రచయిత గుండెల రాజు మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన జంగిలిగొండ గ్రామ చరిత్రను ముందు తరాలకు అందించాలనే ధ్యేయంతో గ్రామ చరిత్ర పుస్తకానికి నాందిపలకాడని అన్నారు. గ్రామానికి సంబంధించి కథనాలను అధ్యయనం చేశారన్నారు. ప్రతి అంశాన్ని శాస్త్రీయంగా పరిశోధించి రెండు సంవత్సరాల పాటు తీవ్రంగా శ్రమించామన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమి , ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా తెలంగాణలో అన్ని గ్రామాల చరిత్రలను వెలికి తీసేందుకు చేస్తున్న కృషి శుభపరిణామం అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News