Tuesday, April 30, 2024

టిఆర్‌పిల కుంభకోణం

- Advertisement -
- Advertisement -

Television rating points scandal in electronic media

 

నిజాయితీ లోపిస్తే ఎంతటి గొప్ప వ్యవస్థలయినా పాతాళానికి దిగజారిపోయి ప్రజా ప్రయోజనాలను బలి తీసుకుంటాయి. వాణిజ్య ప్రకటనలను దొడ్డి దారిలో ఆకట్టుకొని విశేషంగా లాభపడడానికి టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (టిఆర్‌పిలు)ను కృత్రిమంగా పెంచుకునే నిర్వాకానికి పాల్పడ్డాయంటూ రిపబ్లిక్ టివి, ఫక్త్ మరాఠీ, బాక్స్ సినిమా అనే మూడు టెలివిజన్ ఛానల్స్ పై గత వారం ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టి అరెస్టులు కూడా చేసిన ఉదంతం ఎలెక్ట్రానిక్ మీడియా ప్రతిష్ఠను దెబ్బ తీసింది. అరెస్టయిన వారిలో ఫక్త్, బాక్స్ ఛానళ్ల యజమానులు కూడా ఉన్నారు. రిపబ్లిక్ టివి ఛానల్ అధినేత ఆర్నాబ్ గోస్వామి భారతీయ జనతా పార్టీకి మితిమించి కొమ్ము కాసే వ్యాఖ్యాత అని పేరు గడించిన సంగతి తెలిసిందే. హిందుత్వ శక్తుల తరపున అవధులు మీరి వకాల్తా పుచ్చుకునే ఆయన వ్యాఖ్యానాలు తరచూ వివాదాస్పదం అవుతూ ఉంటాయి. బిజెపి వ్యతిరేక శక్తులపై ఆయన విమర్శలు రాళ్ల దెబ్బలను తలపిస్తూ ఉంటాయి.

కాంగ్రెస్ పార్టీ నాయకుడు శశిథరూర్ గోస్వామిపై కేసు కూడా పెట్టాడు. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ ఆత్మహత్య కేసులో రిపబ్లిక్ టివి ప్రసారాలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. సుశాంత్ సింగ్‌ది ఆత్మహత్య అని దర్యాప్తులు నిగ్గు తేల్చినా, హత్య కోణాన్ని ప్రచారంలో పెట్టి ఆయన స్నేహితురాలు, నటి రియా చక్రవర్తి పాత్రపై పదేపదే వేలెత్తి చూపుతూ రిపబ్లిక్ టివి చేసిన ప్రసారాల సందర్భంగా ఆర్నాబ్ పై ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజక వ్యాజ్యం నడుస్తున్నది. శివసేన, బిజెపి మధ్య గల రాజకీయ శత్రుత్వం నేపథ్యంలో ఆర్నాబ్ నాలుక మరింత పదునెక్కిందనే అభిప్రాయం నెలకొన్నది. అటువంటి వ్యక్తి యాజమాన్యంలోని రిపబ్లిక్ టివి దొడ్డి దారి టిఆర్‌పిలను ఆశ్రయించిందనే ఆరోపణ రుజువైతే ఆయన ప్రతిష్ఠ మసకబారుతుంది. బిజెపికి కూడా ఆ దెబ్బ తగులుతుంది. బిజెపి సామాజిక మాధ్యమాలను అదుపు చేస్తున్న దనే అభిప్రాయం ఇప్పటికే నెలకొని ఉన్నది. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ఊపందుకున్నది.

అక్కడ ఎన్‌డిఎ ప్రయోజనాలను పెంపొందించడం కోసం బీహార్‌కు చెందిన సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తిని లక్షంగా చేసుకొని రిపబ్లిక్ టివి రెచ్చిపోయిందనే విమర్శ తెలిసిందే. ఎక్కువ మంది ఎక్కువ సేపు ఏ ఛానళ్ల కార్యక్రమాలు వీక్షిస్తారో వాటికి ప్రముఖ వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తుల ప్రకటనలను విరివిగా విడుదల చేయడం సహజం. ప్రజలు అధికంగా చూసే ఛానళ్లల్లో తమ ప్రకటనలు ప్రసారమైతే తమ ఉత్పత్తుల అమ్మకాలు విశేషంగా పుంజుకుంటాయనే ఆశతో అవి ఆ విధంగా చేస్తాయి. ఈ వాణిజ్య ప్రకటనల మీద వివిధ కంపెనీలు ఖర్చు పెట్టే సొమ్ము రూ. 25 వేల కోట్ల మేరకు ఉంటుందని అంచనా. అందుచేత తప్పుడు మార్గాల్లో టిఆర్‌పిని పెంచుకునే కుట్ర చోటు చేసుకుంటున్నది. ఛానళ్ల రేటింగ్ తెలుసుకోడానికి ‘పీపుల్స్ మీటర్ల’ను బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా (బార్క్) కొన్ని ఎంపిక చేసిన ఇళ్లల్లోని టివిలకు అమరుస్తుంది. ఈ పనిని బార్క్ హన్సా రీసెర్చ్ అనే సంస్థకు అప్పగించింది.

ఈ సంస్థ ముంబై మహా నగరంలో 2000 పైచిలుకు పీపుల్స్ మీటర్లను నెలకొల్పి ఛానళ్ల రేటింగ్‌ను తెలుసుకొని బార్క్‌కు అందజేస్తూ ఉంటుంది. గతంలో టామ్ అనే సంస్థ ఈ పని చేస్తూ ఉండేది. అప్పుడు టామ్, ఇప్పుడు బార్క్ కూడా టివి ఛానళ్లతో కుమ్మక్కయ్యాయనే ఆరోపణలను ఎదుర్కొన్నాయి. హన్సా మాజీ ఉద్యోగులు కొందరు పీపుల్స్ మీటర్లను అమర్చిన గృహాల వివరాలను రిపబ్లిక్ టివికి, ఫక్త్ మరాఠీకి, బాక్స్ సినిమా ఛానల్‌కు అందించాయని, ఆయా ఇళ్ల యజమానులకు ఈ టివి సంస్థలు లంచమిచ్చి తమ కార్యక్రమాలను ఎక్కువ సేపు చూసేలా ఏర్పాటు చేసుకున్నాయన్నది ప్రధాన అభియోగం.

తమ మాజీ ఉద్యోగులు పీపుల్స్ మీటర్ల సమాచారాన్ని లీక్ చేసినట్టు హన్సా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనించవలసిన విషయం. రేటింగ్‌లు తెలుసుకోడానికి హన్సా ద్వారా బార్క్ దేశ వ్యాప్తంగా 44 వేల మీటర్లను ఏర్పాటు చేసినట్టు సమాచారం. మామూలుగా ఒక్కో ఛానల్‌ను వారం రోజుల్లో 15 లేదా 20 నిమిషాల పాటు చూస్తారనుకుంటే ఈ కుమ్మక్కు ఛానళ్లు కొద్ది ఇళ్లల్లో రెండేసి గంటల పాటు తమ కార్యక్రమాలు చూసేటట్టు ఏర్పాటు చేసుకొని టిఆర్‌పిలను విశేషంగా పెంచుకుంటున్నాయని భావిస్తున్నారు. ఇటువంటి దొంగ పద్ధతుల వల్ల జరిగే హాని అపారం. మొత్తంగా ఎలెక్ట్రానిక్ మీడియా విశ్వసనీయతకు విఘాతం కలుగుతుంది. ఆర్నాబ్ గోస్వామి వంటి వారు రాజకీయ దురుద్దేశాలతోనే ముంబై పోలీసులు తమపై ఈ కేసు పెట్టారని వాదించడం సహజమే. అయితే ఇందులోని వాస్తవాలు నిగ్గు తేలడం దేశంలోని ప్రసార మాధ్యమాల ప్రతిష్ఠకు అత్యంత ఆవశ్యకం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News