Monday, May 6, 2024

యాసంగిపై అప్రమత్తం

- Advertisement -
- Advertisement -

Be vigilant on yasangi cultivation

 

యాసంగి సాగు మొత్తం 72 లక్షల ఎకరాలు దాటే అవకాశం

యూరియా సరఫరా విషయంలో జాప్యం తలెత్తకుండా చర్యలు

అధికారులను ఆదేశించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : యాసంగి సాగుపై అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. యాసంగి సాగు మొత్తం 72 లక్షల ఎకరాలు దాటే అవకాశముందన్నారు. వానాకాలంలో ప్రభుత్వ విన్నపాన్ని మన్నించి నియంత్రిత సాగుకు రైతులు మద్దతు పలికారని తెలిపారు. యాసంగిలో మొక్కజొన్న వేసుకునేందుకు రైతులకు అవకాశం ఇద్దామనుకున్నామన్నారు. కానీ ఇప్పటికే అధికంగా ఉన్న దేశ, అంతర్జాతీయ వ్యాప్త నిల్వల మూలంగా మొక్కజొన్న సాగు చేస్తే రైతులు నష్టపోతారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ నేపఖథ్యంలో మొక్కజొన్నకు మద్దతుధర వచ్చే అవకాశం లేని విషయాన్ని ఎఒ, ఎఇఒలు రైతులకు తెలియజెప్పాలన్నారు.

సోమవారం మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసం నుండి శాఖ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డితో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, మొక్కజొన్నకు ప్రత్యామ్నాయ, మార్కెట్ డిమాండ్ గల పంటలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

ప్రాజెక్టులు, చెరువులలో పుష్కలంగా సాగు నీరు, అనుకూల పరిస్థితులు, ప్రభుత్వ వ్యవసాయ సానుకూల విధానాల మూలంగా సాగు గత యాసంగికన్నా గణనీయంగా పెరుగుతుందన్నారు. కరోనా మూలంగా ప్రజలు పట్టణాలు విడిచి పల్లెలకు వచ్చి గతంలో భీడుపడిన భూములను కూడా సాగుచేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సాగు విస్తీర్ణం పెరుగుదలకు ఇది కూడా దోహదపడిందన్నారు. ముఖంగా పెసర్లు, మినుములు, జొన్న, వేరుశనగ, పప్పుశనగ, పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు తదితర డిమాండ్ , మద్దతుధర ఉన్న పంటలను ఏఏ ప్రాంతాలలో సాగుకు ప్రోత్సహించగలమో అధికారులు నివేదిక సిద్ధం చేయాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే యాసంగి సాగుకు సంబంధించి విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు.

యాసంగి సాగుకు తెలంగాణకు కేంద్రం 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, ఇతర కాంప్లెక్సు ఎరువులతో కలిపి మొత్తం 18.30 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించిందన్నారు. ఈ నేపథ్యంలో యూరియా సరఫరా విషయంలో ఎలాంటి జాప్యం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా సరఫరాలో మెరుగ్గా వ్యవహరించని, ఎక్కడైనా అవకతవకలకు పాల్పడిన సెంటర్లు ఉంటే వాటిని గుర్తించి యాసంగిలో లోపాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతువేదికల నిర్మాణం మరింత వేగవంతం చేసి దసరా వరకు పూర్తికావాలన్నారు. వీటి నిర్మాణం విషయంలో అధికారుల పనితీరు అభినందనీయమని ప్రశంసించారు. క్రాప్ బుకింగ్ కు సంబంధించిన వివరాలను తుదిరూపుకు తీసుకురావాలని ఆదేశించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News