Sunday, April 28, 2024

రామకృష్ణయ్య హంతకులను కఠినంగా శిక్షించాలి

- Advertisement -
- Advertisement -

జనగామ ప్రతినిధి : బిఆర్‌ఎస్ నేతల భూకబ్జాలను అడ్డుకున్నందుకే రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్యను దారుణంగా హత్యచేశారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో కిరాయి హంతకుల చేతిలో ఇటీవల దారుణహత్యకు గురైన రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య కుటుంబ సభ్యులను బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆయన అనుచరులు ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములను అక్రమంగా కబ్జా చేస్తుంటే అడ్డుకున్నందుకే సుఫారి హంతకులచే రామకృష్ణయ్యను దారుణంగా హతమార్చారన్నారు.

హత్యకు సూత్రదారులైన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ భర్త అంజయ్య, సర్పంచ్ సతీష్‌రెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయడంలేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అండతో బిఆర్‌ఎస్ నేతలు హత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. హంతకులను కాపాడుతున్న స్థానిక ఎమ్మెల్యేపై, సూత్రదారులపై పిడి యాక్ట్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఫామ్‌హౌజ్‌కు కూతవేటు దూరంలో జరిగిన హత్యను కేసీఆర్ ఎందుకు ఖండించడంలేదని ప్రశ్నించారు. పట్టపగలు కిడ్నాప్ చేసినా పోలీసులు సకాలంలో స్పందించి కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. హంతకులను పట్టుకోవడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు.

నిత్యం పేదల పక్షాన న్యాయం కోసం పోరాడుతున్నందుకే దారుణహత్య చేశారని తెలిపారు. రాజకీయ నాయకులు, పోలీసుల అండతోనే హంతకులు తప్పించుకు తిరుగుతున్నారని అన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో దళితులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో గూండాలకు టికెట్లు ఇచ్చే బిఆర్‌ఎస్ పార్టీని ఓడించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సిద్ధయ్య, జిల్లా ఇన్‌చార్జ్ నీర్మాల రత్నం, నియోజకవర్గ ఇన్‌చార్జ్ జేరిపోతుల కుమార్, స్టేషన్‌ఘన్‌పూర్ ఇన్‌చార్జ్ తాళ్లపల్లి వెంకటస్వామి, పాలకుర్తి ఇన్‌చార్జ్ సోమారపు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News