Friday, April 19, 2024

బిజెపి దొంగల పార్టీ: ఎర్రబెల్లి, సత్యవతి

- Advertisement -
- Advertisement -

 

మహబూబాబాద్: బిజెపి దొంగల పార్టీ అని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే పని బిజెపి పెట్టుకుందని దుయ్యబట్టారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి, సత్యవతి మీడియాతో మాట్లాడారు.  మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని, ప్రజలను మోసం చేస్తుందని, తెలంగాణ పై కక్ష కట్టిందన్నారు. కేంద్ర మంత్రులు అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. సిఎం కెసిఆర్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందిందని, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన మహాత్ముడు సిఎం కెసిఆర్ అని ప్రశంసించారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. ఆడబిడ్డకు మేనమామగా కళ్యాణాలక్ష్మి పథకం ఏర్పాటు చేశామన్నారు. వృద్ధులకు బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అయిదు వందల పెన్షన్ కూడా రావడం లేదని, తెలంగాణ రాష్ట్రంలో 3 వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన గొప్ప వ్యక్తి సిఎం కెసిఆర్ అని మెచ్చుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరానికి నీళ్లు అందించిన మహాత్ముడు కెసిఆర్ అని, సాగు నీరు, మంచినీరు, 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రజలకు చేరువ చేయడంతో పాటు కాళేశ్వరం నీళ్లతో పంటలు బాగా పండి, దిగుబడి పెరగడానికి కారణం కెసిఆర్ అని ఎర్రబెల్లి, సత్యవతి కొనియాడారు. రైతులు పండించిన ప్రతి గింజను కెసిఆర్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ప్రతి ఏటా 3 వేల కోట్లు నష్టం వచ్చినా భరిస్తూ కెసిఆర్ కొనుగోలు చేస్తున్నారని, లట్టుంగాడు, పొట్టుంగాడు వచ్చి వరి వేయమన్నారని, తీరా సమయానికి చేతులు ఎత్తేశారని ఎర్రబెల్లి, సత్యవతి మండపడ్డారు. దేశంలో ఎక్కడా, ఏ ప్రభుత్వం కూడా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. పక్క రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని, పక్క రాష్ట్రాల రైతులు మన రాష్ట్రంలో ఎందుకు పుట్ట లేదా? అని బాధపడుతున్నారన్నారు. బావుల దగ్గర కరెంట్ మీటర్లు పెట్టాలని కేంద్రం కుట్ర చేస్తుందని, కెసిఆర్ బొందిలో ప్రాణం ఉండగా మీటర్లు పెట్టనివ్వనని మాట ఇచ్చి మహానుభావుడని ప్రశంసించారు. ఒక్కో మీటర్ కు వేలాది రూపాయల బిల్లు వస్తుందని, రైతులు లాభ పడాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యమన్నారు. రైతులు, బాగా డిమాండ్ ఉండే ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని, ఎకరాకు లక్షా 40 వేల వరకు ఆదాయం వస్తుందని, పాలకుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా ఆయిల్ పామ్ నర్సరీ, నూనె తీసే ఫ్యాక్టరీ పెట్టిస్తున్నామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చూడాలని, సమస్యలు వస్తే వెంటనే వాటిని పరిష్కరించాలన్నారు. టోకెన్లు ఇవ్వడంతో పాటు పద్ధతి ప్రకారం, ప్రతి గింజ కొనాలని సూచించారు. ఎవరైనా వచ్చి రెచ్చ గొడితే రెచ్చి పోవద్దని ఎర్రబెల్లి, సత్యవతి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News