Tuesday, April 30, 2024

మళ్లీ టాలీవుడ్ షేక్..

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్ కేసులో ఈడి దూకుడు…
ఎక్సైజ్ సిట్ అధికారి శ్రీనివాస్ నుంచి వివరాల సేకరణ
నేడు విచారణకు హాజరు కానున్న దర్శకుడు పూరీ జగన్నాథ్

మన తెలంగాణ/హైదరాబాద్: మళ్లీ టాలీవుడ్ షేక్ అవుతోంది. డ్రగ్స్ కేసులో ఈడి దూకుడు పెంచింది. విచారణ షురూ చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ సిట్ అధికారి శ్రీనివాస్ నుంచి ఈడి అధికారులు వివరాలు సేకరించారు. 2017 సంవత్సరంలో డ్రగ్స్ కేసు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు నేతృత్వం వహించిన శ్రీనివాస్ ఈడి అధికారులకు పూర్తి వివరాలు సమర్పించారు. సిట్ దర్యాప్తు క్రమాన్ని ఈడికి వివరించారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నేటి నుంచి ఈడీ విచారణ కొనసాగనుంది. ఈ మేరకు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ మంగళవారం విచారణకు హాజరవ్వనున్నారు. నేడు ప్రారంభమయ్యే విచారణ సెప్టెంబర్ 22 వరకూ కొనసాగనుంది. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. నిర్దేశించిన తేదీల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అదే విధంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసును దర్యాప్తు చేసిన అబ్కారీ శాఖ సిట్ అధికారులకు సైతం ఈడి నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు మరికొంతమందిపై విచారణ జరిపే అవకాశం ఉంది. ప్రస్తుతం మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడి అధికారులు సైతం 12 మంది సినీ రంగానికి చెందిన వారిని సాక్షాలుగానే ప్రశ్నించే అవకాశం ఉంది. మనీ లాండరింగ్ జరిగినట్లు తేలితే ఆ వ్యక్తులపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
2017లో సిట్ విచారణ
హైదరాబాద్‌కు చెందిన అనేక మంది ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓల్డ్ బోయినపల్లికి చెందిన కెల్విన్‌తో పాటు చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన సోదరులు అబ్దుల్ వహీద్, ఖుద్దూస్‌లను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు 2017 జులై 2న అరెస్ట్ చేశారు. వీళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో పాటు విద్యార్థులు, సినీ ప్రముఖులకు డ్రగ్స్ విక్రయించినట్లు అనుమానించారు. దీంతో ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు విభాగం(సిట్) ఏర్పాటైంది. డ్రగ్స్ కేసులో అబ్కారీ శాఖ సిట్ అధికారులు మొత్తం 12 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఇందులో 12 మంది సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు మరో 12 మందిని విచారించారు. ఇప్పటివరకు 12 నేరాభియోగపత్రాలు దాఖలు చేశారు. అభియోగ పత్రాల్లో ఆఫ్రికా దేశాలకు చెందిన మత్తు సరఫరాదార్లతో పాటు స్థానికంగా డ్రగ్స్ విక్రయించే వ్యక్తులున్నారు. 12 మంది సినీ తారల గోళ్లు, తల వెంట్రుకల నమూనాలు సైతం సేకరించిన అబ్కారీ అధికారులు ఎక్కడ కూడా వాళ్ల ప్రస్తావన తీసుకురాలేదు. మరోవైపు సినీ తారల డ్రగ్స్ రాకెట్ లావాదేవీలపై ఈడి ఫోకస్ పెట్టనుంది. నిధులు విదేశాలకు ఎలా మళ్లించారన్న దానిపై ఈడీ వివరాలు రాబట్టనుంది.
కెల్విన్ అరెస్ట్‌తో టాలీవుడ్ డ్రగ్స్ లింకులు బట్టబయలు
కెల్విన్ అరెస్ట్‌తో టాలీవుడ్ డ్రగ్స్ లింకులు బయటపడ్డాయి. అప్పట్లో 30 లక్షల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న ఈడి.. షికాగో ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు గుర్తించింది. ఆస్ట్రేలియా, దక్షణాఫ్రికా నుంచి సైతం డ్రగ్స్ సప్లై అయినట్లు తెలుస్తోంది. దీనిపైనే ఈడి విచారణ జరగనుంది. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. డ్రగ్స్ కేసులో హవాలా మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. డ్రగ్స్ కోసం పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులను మళ్లించినట్లుగానూ గుర్తించారు. డ్రగ్స్ కొనుగోలు చేసి నిందితులకు హవాలా ద్వారా డబ్బులు తరలించారు. టాలీవుడ్‌లో పెను ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసులో హీరోలు, హీరోయిన్లు, నటీ నటులే కాకుండా సినీ పరిశ్రమలో పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు వినిపించాయి. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. ఎక్సైజ్ డిపార్టుమెంట్ గతంలో పలువురికి క్లీన్ చిట్ ఇవ్వడం కూడా సంచలనమైంది. ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఎంట్రీతో మళ్లీ టాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి.
విచారణ తేదీలు.. హాజరవ్వాల్సిన ప్రముఖులు
ఆగస్టు 31 పూరీ జగన్నాథ్
సెప్టెంబర్ 2 ఛార్మి కౌర్
సెప్టెంబర్ 6 రకుల్ ప్రీత్ సింగ్
సెప్టెంబర్ 8 రానా దగ్గుబాటి
సెప్టెంబర్ 9 రవితేజతో పాటు అతడి డ్రైవర్ శ్రీనివాస్
సెప్టెంబర్ 13 నవదీప్, ఎఫ్‌క్లబ్ జనరల్ మేనేజర్
సెప్టెంబర్ 15 ముమైత్‌ఖాన్
సెప్టెంబర్ 17 తనీష్
సెప్టెంబర్ 20 నందు
సెప్టెంబర్ 22 తరుణ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News