Tuesday, May 7, 2024

సన్‌రైజర్స్‌కు సవాల్

- Advertisement -
- Advertisement -

Tomorrow match between DC vs SRH

రేపు ఢిల్లీతో సమరం

దుబాయి: తొలి అంచె మ్యాచుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాన్ని దక్కించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. రెండో దశ ఐపిఎల్‌లో భాగంగా బుధవారం ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్‌కు చాలా కీలకంగా మారింది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన పరిస్థితి హైదరాబాద్‌కు నెలకొంది. దీంతో కేన్ విలియమ్సన్ సేన తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ఈ మ్యాచ్ బరిలో దిగనుంది. భారత్ వేదికగా జరిగిన మొదటి దశలో సన్‌రైజర్స్ అత్యంత చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచింది. ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. మరోవైపు ఢిల్లీ ఆరు విజయాలతో ప్లేఆఫ్ బెర్త్‌కు సమీపించింది. ఇకపై ఆడే మ్యాచుల్లో కనీసం రెండింటిలో గెలిచినా ఢిల్లీకి నాకౌట్ బెర్త్ ఖాయం. అయితే హైదరాబాద్ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. రెండో అంచె మ్యాచ్‌లు హైదరాబాద్‌కు సవాల్‌గా పరిణమించాయి. ఇకపై ఆడే అన్ని పోటీల్లోనూ గెలవక తప్పదు. ఇలాంటి స్థితిలో హైదరాబాద్ ఎలా ఆడుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

వారిద్దరే కీలకం..

ఇక ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆశలన్నీ సీనియర్లు కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్‌లపైనే ఆధారపడి ఉన్నాయి. కీలక ఆటగాడు జానీ బెయిర్‌స్టో వ్యక్తిగత కారణాలతో రెండో దశ టోర్నీకి అందుబాటులో లేకుండా పోయింది. దీంతో వార్నర్, కేన్‌లపై జట్టు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో పలు సీజన్‌లలో వార్నర్, విలియమ్సన్‌లు హైదరాబాద్‌ను ముందుండి నడిపించారు. ఈసారి కూడా ఇద్దరు జట్టుకు కీలకంగా మారారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వార్నర్ చెలరేగితే హైదరాబాద్‌కు భారీ స్కోరు ఖాయం. అయితే నిలకడలేమి అతనికి ప్రధాన అవరోధంగా తయారైంది. ఆ లోపాన్ని సవరించుకుంటేనే వార్నర్ భారీ స్కోర్లు సాధించే అవకాశం ఉంటుంది. ఇక కెప్టెన్ కేన్ బాధ్యతలు మరింత పెరిగాయి. బ్యాటింగ్‌తో పాటు సారథ్యంలో కూడా సత్తా చాటాల్సిన పరిస్థితి అతనికి నెలకొంది.

ఇప్పటికే వరుస ఓటములతో హైదరాబాద్ ప్లేఆఫ్ అవకాశాలను చాలా క్లిష్టంగా మార్చుకుంది. ఇప్పుడున్న స్థితిలో నాకౌట్‌కు చేరడం చాలా కష్టంగా కనిపిస్తోంది. కానీ ప్లేఆఫ్‌కు చేరక పోయినా కనీసం మెరుగైన స్థానంలో నిలవాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. ఇక మనీష్ పాండే, విజయ్ శంకర్, మహ్మద్ నబి, వృద్ధిమాన్ సాహా, జాసన్ హోల్డర్, రూధర్‌ఫోర్ట్ తదితరులతో హైదరాబాద్ బ్యాటింగ్ బలంగానే ఉంది. అంతేగాక రషీద్ ఖాన్, నటరాజన్, భువనేశ్వర్, హోల్డర్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో హైదరాబాద్ భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది.

తక్కువ అంచన వేయలేం..

మరోవైపు హైదరాబాద్‌ను తక్కువ అంచన వేయడం పొరపాటే అవుతుంది. ఇకపై జరిగే మ్యాచుల్లో మెరుగైన ప్రదర్శన చేసే సత్తా సన్‌రైజర్స్‌కు ఉంది. బ్యాటింగ్ గాడిలో పడితే ఎంతటి పెద్ద జట్టునైన ఓడించడం హైదరాబాద్‌కు అసాధ్యమేమీ కాదు. కొన్ని సీజన్‌లుగా సన్‌రైజర్స్ మెరుగైన ప్రదర్శన చేస్తూ వస్తోంది. అయితే ఈసారి అంతంత మాత్రం ప్రదర్శనతో నిరాశ పరిచింది. కానీ రెండో దశ మ్యాచుల్లో మళ్లీ గాడిలో పడే సత్తా సన్‌రైజర్స్‌కు ఉందని చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఉండడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

జోరు సాగిస్తుందా..

ఇక మొదటి అంచె పోటీల్లో నిలకడైన ఆటతో అలరించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. కీలక ఆటగాడు శ్రేయస్ అయ్యర్ చేరికతో ఢిల్లీ మరింత బలోపేతంగా మారింది. తొలి దశ మ్యాచ్‌లకు అయ్యర్ దూరంగా ఉన్నాడు. దీంతో అతని స్థానంలో మరో యువ ఆటగాడు రిషబ్ పంత్ జట్టు సారధ్య బాధ్యతలను చేపట్టాడు. రెండో దశ మ్యాచ్‌లకు కూడా పంత్‌కే కెప్టెన్సీని అప్పగించారు. ఇక పంత్ కూడా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ జట్టుకు ట్రోఫీ సాధించి పెట్టాలని లక్షంగా పెట్టుకున్నాడు. శిఖర్ ధావన్, పృథ్వీషా, అయ్యర్, పంత్, రహానె తదితరులతో ఢిల్లీ బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్‌లో కూడా ఢిల్లీ పటిష్టంగా కనిపిస్తోంది. అవేశ్ ఖాన్, అశ్విన్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఇక ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్ దాదాపు ఖరారు కావడంతో ఢిల్లీ ఎలాంటి ఒత్తిడి లేకుండా రెండో అంచె మ్యాచ్‌లకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి జోరును కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News