Sunday, May 5, 2024

పెళ్లిలో కలెక్టర్ దౌర్జన్యం.. సస్పెండ్ వేస్తూ ఆదేశాలు..

- Advertisement -
- Advertisement -

Tripura DM Suspended after forcibly stopping wedding

అగర్తల: గత నెల 26న త్రిపురలోని వెస్ట్ త్రిపుర జిల్లా మేజిస్ట్రేట్(కలెక్టర్) ఓ పెళ్లిలో దౌర్జన్యం చేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి త్రిపుర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్ల్లా మేజిస్ట్రేట్ శైలేష్ కుమార్ యాదవ్‌ను విధుల నుంచి తప్పించింది. దీనిపై రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి రతన్‌లాల్ నాథ్ మాట్లాడుతూ.. ‘యాదవ్ ఆదివారం రాష్ట్రప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మనోజ్ కుమార్‌కు ఒక లేఖ రాశారు. ఏప్రిల్ 26 వ తేదీ నాటి ఘటనకు సంబంధించి తనపై జరిగే దర్యాప్తు నిష్పాక్షికంగా ఉండాలనే ఉద్దేశంతో విధులనుంచి తప్పించాలని కోరారు. దీంతో ఆ బాధ్యతలను హేమేంద్ర కుమార్‌కు అప్పగించాం’ అని తెలిపారు. కాగా త్రిపురలో కరోనా వ్యాప్తి కట్టడికి రాత్రిపూట కర్ఫూను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో వివాహాలకు అనుమతులు ఇచ్చే అధికారాన్ని డిఎంకు కట్టబెట్టారు.

బెంగళూరుకు చెందిన ఓ యువకుడికి త్రిపురకు చెందిన యువతితో ఏప్రిల్ 26న వివాహం జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి పెళ్లి కూతురు తరఫు వారు అన్ని అనుమతులు తీసుకున్నారు. 26న పరిమిత అతిథులతో వివాహం జరుగుతుండగా రాత్రి 10 గంటల సమయంలో డిఎం శైలేష్ కుమార్ పోలీసులతో వచ్చి కళ్యాణ మండపంపై దాడి చేశారు. చాలా ఆవేశంగా కనిపించిన వారినందరినీ కొడుతూ, అసభ్య పదజాలంతో తిడుతూ కళ్యాణ మండపాన్ని ఖాళీ చేయించారు. అడ్డొచ్చిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ విచ్చలవిడిగా ఆదేశాలు జారీ చేశారు.ఈ క్రమంలో పెళ్లికొడుకు, పురోహితుడిపై చేయి చేసుకున్నారు. తమ వద్ద డిఎం ఆఫీసు వారు ఇచ్చిన అనుమతి ఉందని ఓ మహిళ చూపించగా డిఎం ఆ పత్రాన్ని చించేసి ఆమెపైనే విసిరేశారు. పదుల సంఖ్యలో అతిథులను అర్ధరాత్రిదాకా పోలీసుఅదుపులో ఉంచారు. ఈ తతంగమంతా అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. దీంతో ముఖ్యమంత్రి దీనిపై విచారణకు ఆదేశించారు.

courtesy by India today

Tripura DM Suspended after forcibly stopping wedding

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News