Tuesday, April 30, 2024

గ్రేటర్ పై గులాబీ గురి…

- Advertisement -
- Advertisement -

TRS

హైదరాబాద్: ఇటీవల జరిగిన మున్సిపల్ పోరులో విజయడంకా మోగించిన గులాబీ దళం వచ్చే ఏడాదిలో జరుగునున్న బల్దియా ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా రెప్పరెప్పలాడించేందుకు కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. నాలుగేళ్ల కాలంలో ప్రవేశపెట్టిన పథకాల్లో స్పీడ్ పెంచి ఆరునెలకాలంలో పూర్తి చేసేందుకు యువ అధికారులను రంగంలోకి దించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తికాగానే వెంటనే ఎన్నికల రణరంగంలోకి దూకే అవకాశం ఉందంటున్నారు.

గడిచిన ఎన్నికల్లో ఊహించని విధంగా 150 కార్పొరేట్ సీట్లలో 99 స్దానాలు కైవసం చేసుకుని బల్దియాపై కారు పరుగులు పెట్టించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో పాలక వర్గం గడువు తీరుతుండటంతో ఇప్పటి నుంచే తగిన వ్యుహాలు సిద్దం చేసుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో మూడు సంఖ్యల సీట్లలో గెలిచి మరోసారి తమ రికార్డును తామే తిరగరాస్తామని పార్టీ సీనియర్లు సవాల్ విసురుతున్నారు. ఈసారి అధికార పార్టీ నుంచి భిపాం దొరికితే కార్పొరేటర్‌గా గెలవడం నల్లేరు నడకేనని, ఆశావాహులంతా ఆశల పల్లకిలో తేలియాడుతున్నారు. వారం రోజుల నుంచి జీహెచ్‌ఎంసీ జోనల్ వారీగా అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు.

అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు పూర్తి చేసేందుకు తగిన నిధులు విడుదల చేస్తామని, అవినీతి జరగకుండా ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనికి తోడు చురుకైనా అధికారులు ఉండాలని భావించిన జీహెచ్‌ఎంసీలో ఐదుగురు ఉన్నతాధికారులను నియమించారు. నాలుగేళ్ల కాలంలో ప్రవేశపెట్టిన పథకాలు 70శాతం పూర్తికాగా చివరి దశలో ఉన్న డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, అదనపు బస్సు కొనుగోలు, కాలుష్య పరిశ్రమల తరలింపు, 20 చోట్ల పైఓవర్లు నిర్మాణం, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన, ఫార్మాసీటి, స్కైవేలు, సిసి రోడ్లు, టాయిలెట్ల నిర్మాణం, సమీకృత మార్కెట్లు వంటివి పూర్తి చేసేందుకు అధికారులకు సూచనలు చేస్తున్నారు. అదే విధంగా పార్టీలో కూడా చేర్పులు మార్పులు చేసేందుకు తమ టీంను సిద్దం చేస్తున్నట్లు అనుచరులు చర్చించుకుంటున్నారు.

ఈసారి యువనేతలను బల్దియా పోరులో దించేందుకు ప్రజాబలమున్న నేతల జాబితా తయారు చేస్తున్నట్లు, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు వ్యుహాలు రచించిన నేతలకు బాధ్యతలు అప్పగించనున్నట్లు పార్టీ శ్రేణులు అంతర్గత సంబాషనలో పేర్కొంటున్నారు. బల్దియా మేయర్ మళ్లీ టిఆర్‌ఎస్ ఖాతాలోకి వస్తే గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ స్దానాలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సులువగా గెలుచుకోవచ్చని, అందుకోసం ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలు చేస్తున్నట్లు గులాబీ పార్టీ పెద్దలు వెల్లడిస్తున్నారు.

టిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తరువాత మున్సిపల్ ఎన్నికల గెలుపు బాధ్యతలు పూర్తిగా యువనేత కేటీఆర్‌ను తీసుకుని మేయర్,చైర్మన్ సీట్లు గెలుచుకున్నారు. ఆయన రాజకీయ చాణ్యకానికి ప్రతిపక్ష కాంగ్రెస్,బిజెపి పార్టీలు బొక్కబొర్లా పడి సింగిల్ సీటుకే పరిమితమై ఉనికి కాపాడుకోలేక అవస్దలు పడుతున్నారు. వచ్చే ఏడాదిలో జరిగే బల్దియా పోరులో అదే విధంగా రాజకీయ ఎత్తుగడలు వేసి గులాబీ వికసించేలా యుద్దక్షేత్రానికి సిద్దమైన్నట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

TRS Focus on Greater Hyderabad Municipal Elections

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News