సుంకాల సమస్య పరిష్కారమయ్యే వరకు భారత్‌తో
సంప్రదింపుల ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ట్రంప్
ఇందుకు విరుద్ధంగా అమెరికా విదేశాంగశాఖ ప్రకటన
భారత్‌తో చర్చల్లో పూర్తి భాగస్వాములమవుతామని
స్పష్టీకరణ పుతిన్‌కు మోడీ ఫోన్ ఇండియా,
రష్యా మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేయాలని
ఇరువురు నేతల నిర్ణయం ఉక్రెయిన్‌తో సంక్షోభాన్ని
శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పుతిన్‌కు
ప్రధాని నరేంద్ర మోడీ సూచన
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చే శారు. టారిఫ్‌ల సంగతి పరిష్కారమయ్యే వరకు భారత్‌తో వాణిజ్యపరమైన సంప్రదింపులు ఉండబోవని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారంనాడు ఆయన ఓ మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాట్లాడారు. ఉ క్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పుతిన్ భేటీ అయ్యేందుకు సుముఖంగా లేకపోతే తాను సమావేశం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ట్రంప్ టారిఫ్‌ల భారాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తున్న సమయంలో ఆయన చేసిన ప్రకటన కొంత నిరాశ కలిగించింది. మరోవైపు అమెరికా విదేశాంగ శాఖ విరుద్ధమైన ప్రకటన చేసింది. భారత్ తమకు వ్యూహాత్మక విలువైన వ్యాపార భాగస్వామి అని పేర్కొంది. కొంతకాలంగా ఇరుదేశాల నడుమ టారిఫ్‌లతో కూడిన ఉద్రిక్తత కొనసాగుతోంది, అయినప్పటికీ భారత్‌తో చర్చల్లో పూర్తిగా భాగస్వాములమవుతామని
విదేశాంగ అధికార ప్రతినిధి టామీ పిగోట్ వెల్లడించారు. రష్యాతో భారత్ చమురు కొనుగోళ్లపై ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్లో సంభాషించుకున్నారు. భారత్‌పై అమెరికా ఎడాపెడా టారిఫ్‌లతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో వీరి నడుమ ఫోన్ చర్చలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వీరి నడుమ ఉక్రెయిన్ పరిణామాలపై చర్చ జరిగినట్లు మోడీ, విదేశాంగ శాఖ ప్రకటన సష్టం చేస్తోంది. ‘నా స్నేహితుడు పుతిన్‌తో ఫోన్ సంభాషణ అద్భుతంగా సాగింది. ఇరువురం ఉక్రెయిన్ తాజా పరిణామాలపై చర్చించుకున్నాం. ఈ సందర్భంగా తాజా అంశాలను నాతో పంచుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపాను. అదే సమయంలో ఉక్రెయిన్‌తో సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించా. దానికి భారత్ మద్దతు ఉంటుందని చెప్పా. అదే సమయంలో భారత్, రష్యా ద్వైపాక్షిక ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్లాలని రెండు దేశాలు భావించాయి. కొనసాగుతున్న బంధాన్ని మరింత పటిష్టవంతం చేసుకునేందుకు నిబద్ధులమై ఉండాలని నిర్ణయించుకున్నాం. త్వరలో పుతిన్ భారత్‌లో పర్యటిస్తారని భావిస్తున్నా. భారత్, రష్యా 23వ వార్షిక సదస్సు సందర్భంగా అది సాకారమవుతందని అనుకుంటున్నా’ అని ఎక్స్‌లో మోడీ తెలిపారు. విదేశాంగ శాఖ కూడా మోడీ, పుతిన్ ఫోన్ సంభాషణను ధ్రువీకరించింది.