Tuesday, April 30, 2024

సాహసోపేత పాలనా సంస్కరణలు

- Advertisement -
- Advertisement -

TS government is courageous administrative reforms

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా పరిపాలనా సంస్కరణలు అమలు చేసింది. ఏకకాలంలోనే పరిపాలనా విభాగాల పునర్విభజన చేపట్టింది. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం కొత్త పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 2016 అక్టోబర్ కు ముందు 10 జిల్లాలుండేవి. కొత్తగా మరో 23 జిల్లాలను ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 33 వరకు పెరిగింది. పరిపాలన సులభతరం చేసేందుకు, ప్రజలకు జిల్లా కేంద్రాలను దగ్గర చేసేందుకు జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం -1974 ప్రకారం మొత్తం 33 జిల్లాలను ఏర్పాటు చేసింది. రెవిన్యూ డివిజన్ల సంఖ్యను కూడా 43 నుంచి 73 వరకు పెంచింది. కొత్తగా 131 మండలాలను ఏర్పా టు చేయడంతో మొత్తం మండలాలు 590కు పెరిగాయి.

కొత్త మున్సిపాలిటీలు – కార్పొరేషన్లు

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను పునర్వ్యవస్థీకరించింది. జనాభా ఎక్కువ ఉన్న, పట్టణ స్వభావం కలిగిన పెద్ద గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చింది. 322 గ్రామాలను సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. ఏడు మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా అప్ గ్రేడ్ చేసింది. 2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 52 మున్సిపాలిటీలు ఉండేవి. కొత్తగా మరో 76 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 6 కార్పొరేషన్లు మాత్రమే ఉండేవి. అలాగే కొత్తగా 7 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లతో కలిపి మొత్తం 141 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి.

సమీకృత జిల్లా కలెక్టరేట్లు.. జిల్లా అధికారుల కార్యాలయాలు

రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లా కేంద్రాల్లో సమీకృత జిల్లా కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలు(డిపిఒ)లు ప్రభుత్వం నిర్మిస్తున్నది. 26 జిల్లాల్లో ప్రజలు, అధికారులకు సౌకర్యంగా ఉండేలా అన్ని వసతులతో కూడిన కలెక్టర్ కార్యాలయాలను ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఈ కలెక్టరేట్ల నిర్మాణానికి 201718 బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయించారు. రూ.1,337 కోట్ల మొత్తం వ్యయంతో 26 సమీకృత జిల్లా కలెక్టరేటు కాంప్లెక్సులు, 13 సమీకృత జిల్లా పోలీసు కాంప్లెక్సులు, 2 పోలీసు కమిషనరేట్లను నిర్మిస్తున్నారు. మొత్తం 18 సమీకృత కలెక్టరేట్లను రూ.1,032 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు. రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుకమిషనరేట్లు మాత్రమే వుండేవి. వీటికి అదనంగా మరో 7 పోలీసు కమిషనరేట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

కొత్త గ్రామపంచాయతీలు

కొత్త పంచాయతీరాజ్ చట్టంతో రాష్ట్రంలో నూతనంగా 4,383 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. పాతవి 8,690 గ్రామపంచాతయతీలు ఉండగా కొత్తగా ఏర్పాటైన వాటితో కలిసి మొత్తం గ్రామపంచాయతీల సంఖ్య 12,751 కి చేరింది. కొత్తగా ఏర్పాటైన పంచాయతీలకు ఇతర గ్రామాలు, మండల కేంద్రాలతో రోడ్ కనెక్టివిటీ ని ప్రభుత్వం రూ.5 వేల కోట్లతో చేపట్టింది. రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు అన్నిటికీ కలిపి సంవత్సరానికి రూ.8 వేల కోట్ల చొప్పున 5 ఏళ్లలో రూ.40 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

TS government is courageous administrative reforms

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News