Sunday, April 28, 2024

ఈనెల 20నుంచి కొత్త చార్జీలు అమల్లోకి…!

- Advertisement -
- Advertisement -

ఈనెల 20నుంచి కొత్త చార్జీలు అమల్లోకి…!
భారీగా పెరగనున్న భూముల విలువలు, కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు
సాఫ్ట్‌వేర్ ఆధారంగా కొత్త చార్జీల నిర్ధారణ
అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అందిన ప్రతిపాదనలు
పెరగనున్న వ్యవసాయ భూముల విలువలు ?
రెండురోజుల్లో మార్గదర్శకాలు విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్: భూముల విలువల పెంపుతో పాటు కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 20వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిస్తోంది. ముఖ్యంగా మంగళవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలిసింది. భూములు, ఆస్తుల విలువ పెంపునకు సంబంధించిన సబ్ రిజిస్ట్రార్‌ల ప్రమేయం లేకుండా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా భూముల విలువలను నిర్ధారించినట్టుగా సమాచారం. ఇప్పటికే భూముల విలువలకు సంబంధించి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రతిపాదనలు అందగా ఈనెల 20 నుంచి వాటిని అమల్లోకి తీసుకురావడానికి సబ్ రిజిస్ట్రార్‌లు సైతం సిద్ధమయినట్టుగా తెలిసింది. నేడు లేదా రేపు దీనికి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది.
పెరిగిన ధరలు ఇలా ఉండే అవకాశం..
ఉదాహరణకు…. ప్రస్తుతం మణికొండలో అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్‌కు సంబంధించి ఎస్‌ఎఫ్‌టి ధర ప్రస్తుతం 1,500 రూపాయలు ఉండగా, ఇక నుంచి ఆ ధర రూ.2,500ల నుంచి రూ.3,000ల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిసింది. దీంతోపాటు ఓపెన్ ప్లాట్‌లోని భూమి గజం విలువ రూ.5,000లు ఉంటే అక్కడ ఇక నుంచి అదనంగా రూ.2,500ల నుంచి రూ.3,000లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. అయితే కొన్ని ప్రాంతాలను బట్టి కూడా ఆ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.
వ్యవసాయేతర భూముల విలువ గరిష్టంగా 50 శాతం పెంచాలని….
వ్యవసాయేతర భూముల విలువను ఇప్పటి కన్నా గరిష్టంగా 50 శాతం పెంచాలని రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఈ క్రమంలో సాగుభూములు గరిష్ట, కనిష్ట విలువల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. భూముల మార్కెట్ విలువ పెంపుతో పాటు, రిజిస్ట్రేషన్, సత్సంబంధిత 20 రకాల సేవలపై విధించే ఛార్జీలను పెంచనున్నట్టుగా తెలిసింది. రాష్ట్రంలో వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తుల విలువ గరిష్టంగా 50 శాతం పెరగనుండగా ప్రాంతాల వారీ విలువ ఆధారంగా అవి 20 శాతం, 30 శాతం, 40 శాతం మేర పెరగనున్నాయి.
గత సంవత్సరం నివేదిక ఆధారంగా
ఎనిమిదేళ్ల తర్వాత భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో తదనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. 2020 జనవరిలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సిద్ధం చేసిన నివేదికలోని అంశాలతో పాటు ఏడాదిన్నర వ్యవధిలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రాతిపదికగా చేసుకుని భూముల విలువను నిర్ధారించినట్లు సమాచారం. గతంలో ప్రతిపాదనలు రూపొందించినప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు మాట లేదు. తాజాగా అది తెరపైకి వచ్చిన క్రమంలో దానికి చేరువలో భూముల మార్కెట్ విలువ భారీగా పెరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. సవరించిన ధరలను త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది.
పెంపు ఇందుకే..
1.ఎనిమిదేళ్లుగా భూముల విలువను సవరించలేదు. ఈ కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జిఎస్‌డిపీ), తలసరి ఆదాయం రెట్టింపయ్యాయి.
2. నూతన ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు అభివృద్ధి చెందింది. సాగునీటి వసతి విస్తరించడంతో భూముల విలువ భారీగా పెరిగింది.
3. రాష్ట్రంలో ఐటి, ఔషధ, పర్యాటకం, స్థిరాస్తి రంగాల్లో పెరుగుదల, కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్ రోడ్డు వివిధ రంగాల్లో అభివృద్ధి నేపథ్యంలో భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం సవరించాల్సి వస్తుంది.
4.గతంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన సెంట్రల్ వాల్యుయేషన్ సలహా కమిటీ భూముల విలువను సవరించాలని ప్రతిపాదించింది.
విలువ పెరగనున్న వాటి వివరాలు ఇలా…
భూములు, ఇళ్లు, ప్లాట్లు, ప్లాట్ల క్రయవిక్రయాలపై ప్రస్తుతం స్టాంపు డ్యూటీ 4శాతం ఉండగా ట్రాన్స్‌ఫర్ డ్యూటీ 1.5, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5 శాతంగా ఉంది. మొత్తం 6శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలను చెల్లిస్తున్నారు. ఇకపై అవి 7.5 శాతంగా అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలు తదితర.. భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలు, విక్రయ అగ్రిమెంట్/ జీపీఏ, డెవలప్‌మ్మెంట్ అగ్రిమెంట్, జీపీఏ, డెవలప్మెంట్ కన్‌స్ట్రక్షన్ అగ్రిమెంట్, కుటుంబీకుల భాగపక్షాల రిజిస్ట్రేషన్ చార్జీలు, కుటుంబ, కుటుంబేతరుల మధ్య ఒప్పందాలు, బహుమతి (గిఫ్ట్), టైటిల్ డీడ్ డిపాజిట్, జీపీఏ (ఆథరైజేషన్, ఆథరైజేషన్ లేకుండా), వీలునామా, లీజు సహా ఇతర సేవల ఛార్జీలు పెరగనున్నాయి.

TS Govt to implement new registration charges from July 20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News