Wednesday, May 1, 2024

ఎట్టకేలకు దిగివచ్చిన ట్విటర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్ ఎట్టకేలకు భారత ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడం ప్రారంభించింది. ఇన్నాళ్లకు భారత్‌లో రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిగా భారత్‌కు చెందిన వినయ్ ప్రకాశ్‌ను నియమించింది. ఈమేరకు సంస్థ వెబ్‌సైట్‌లో ఆయన వివరాలు పొందుపరిచింది. ఇందులోని ఈమెయిల్ ఐడికి భారత్ లోని వినియోగదారులు తమ ఫిర్యాదులను పంపించ వచ్చని ఆదివారం ప్రకటించింది. భారత్‌లో ట్విటర్‌ను సంప్రదించ వలసిన చిరునామా కూడా తెలియచేసింది. బెంగళూరు లోని నాలుగో అంతస్థు ది ఎస్టేట్ 121 డికెన్సన్ రోడ్ బెంగళూరు పిన్ 560042 అని చిరునామా పేర్కొంది. దీంతో కొత్త ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలకు సంబంధించి ట్విటర్‌కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న ప్రతిష్టంభన తొలగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం, ట్విటర్ మధ్య వివాదం చివరకు ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్లడం, ఐటి నిబంధనలు పాటించడంలో ట్విటర్ విఫలమైందని ఇటీవల ఢిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయడం, ట్విటర్ తీరుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఇవన్నీ ఇటీవల జరిగిన పరిణామాలు.

కొత్త నిబంధనల ప్రకారం 50 లక్షల యూజర్లు దాటిన సామాజిక మాధ్యమాలు తప్పనిసరిగా గ్రీవెన్స్ ఆఫీసర్‌తోపాటు చీఫ్ కాంప్లయెన్స్ ఆఫీసర్‌ను, నోడల్ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉంది. మిగతా సామాజిక మాధ్యమాలన్నీ కొత్త నిబంధనలకు అంగీకారం తెలిపినా ట్విటర్ మాత్రం వెంటనే స్పందించలేదు. తనకు ఇంకా సమయం కావాలని అడుగుతూ వచ్చింది. 1.75 కోట్ల మేర వినియోగదారులున్న ట్విటర్ నిబంధనలను పాటించని కారణంగా ప్రభుత్వం మాధ్యమ సంస్థలకు ఇచ్చే చట్టపరమైన రక్షణలను కూడా ఎత్తివేయడంతో గత నెల మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయింది. దీనిపై ట్విటర్ కోర్టును ఆశ్రయించినా చుక్కెదురైంది. పలువురు యూజర్లు చేసిన అభ్యంతరకర పోస్టులకు కూడా ట్విటర్‌పై కేసులు నమోదయ్యాయి. గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించడానికి తనకు 8 వారాల గడువు కావాలని గురువారం ఢిల్లీ హైకోర్టును కోరిన ట్విటర్ నాలుగు రోజుల్లోనే గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించడం గమనార్హం.

Twitter India appoints Vinay Prakash as resident grievance officer

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News