లక్నో: అత్యాచారం కేసులో పోలీసులు ఓవర్ యాక్షన్ చేయడంతో లా విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బరాబంకి ప్రాంతంలో చోటుచేసుకుంది. దీంతో సదరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గ్రామ పంచాయతీ అధికారి తన స్నేహితుడితో కలిసి తనపై సామూహిక అత్యాచారం చేశాడని స్థానిక పోలీస్ స్టేషన్‌లో లా విద్యార్థిని (22) ఫిర్యాదు చేసింది. రెండు నెలల క్రితం ప్రభుత్వాధికారిపై పోలీసులు కేసు నమోదు చేయకుండా బాధితురాలును ఇంటికి పంపించారు. దీంతో నిందితుడు బాధితురాలును చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించింది. పోలీసులు కేసు నమోదు చేసినప్పటికి దర్యాప్తులో నిందితుడికి అనుకూలంగా స్థానిక ఎస్‌ఐ వ్యవహరించడంతో బాధితురాలు ఇంట్లో ఉరేసుకుంది. స్థానిక ఎస్‌పి ఆకాశ్ తోమర్ ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేశాడు. ఈ అత్యాచారం కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.