Thursday, May 2, 2024

 బస్సు ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉంది:సజ్జనార్

- Advertisement -
- Advertisement -

 డిపోల మూసివేతపై జరుగుతున్న ప్రచారం అవాస్తవం
 ఉద్యోగుల సంక్షేమం ఆర్‌టిసికి చాలా ముఖ్యం
 బస్సు ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉంది
 బస్టాండ్‌లలోని షాపుల్లో అధిక ధరలకు విక్రయిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి
 మెగా రక్తదాన శిబిరంలో ఆర్‌టిసి ఎండి సజ్జనార్

VC Sajjanar about TSRTC Lands Sale

 

మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు ఆర్‌టిసి డిపోలను మూసివేతపై వస్తున్న వార్తలు అవాస్తవమని ఆర్‌టిసి ఎండి విసి సజ్జనార్ స్పందించారు. భూములను అమ్మే ఆలోచనఆర్‌టిసికి లేదన్నారు. ఎంజిబిఎస్ ఆర్‌టిసి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆర్‌టిసి ఎండి సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం ఆర్‌టిసికి చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. కొన్ని కారణాల వల్ల ఆర్‌టిసి బస్సులు, సిబ్బంది మార్పులు జరుగుతున్నాయన్నారు. ఇప్పడిప్పుడే ప్రజలు ఆర్‌టిసి వైపు మళ్లుతున్నారన్నారు. యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయం వల్ల ఆదాయంతో పాటు ఓఅర్ కూడా పెరిగిందని, ఆర్‌టిసి బస్సు ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని సజ్జనార్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఎంజిబిస్‌లోని స్టాళ్లలో ధరలపై ఆయన ఆరా తీశారు. అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్న షాపు నెంబర్ 26ను వెంటనే మూసివేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధిక ధరలకు ఎవరూ విక్రయించినా వెంటనే ఆయా షాపులపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఐదైనా షాపుపై మూడుసార్ల కన్నా ఎక్కువ ఫిర్యాదులు వస్తే శాశ్వతంగా ఆ స్టాల్‌ను మూసివేయించాలని ఆయన అధికారులకు సూచించారు.
1,359 రూట్లలో బస్సుల పునరుద్ధరణ
1,359 రూట్లలో ఆర్‌టిసి బస్సులను పునరుద్ధరించామని, బస్సులు అవసరం ఉన్న చోట లోకల్ డిఎం, ఆర్‌ఎంలు సర్వే చేస్తున్నారన్నారు. కొన్నిచోట్ల ఆక్యుపెన్సీ తక్కువ మరికొన్నిచోట్ల ఎక్కువ ఉందన్నారు. ఎవరికైనా బస్సు అవసరం ఉంటే డిఎంని సంప్రదించాలన్నారు. జోగులంభ వెళ్లినప్పుడు భక్తులు బస్సు అడిగారని, వచ్చే శనివారం నుంచి జోగులంభకు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సు నడుస్తుందన్నారు. టిఎస్ ఆర్‌టిసి బస్సులను ప్రయాణికులు ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డీజిల్ ధరలు పెరగడంతో పాటు కరోనాతో ఆర్‌టిసి సంస్థ, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉద్యోగుల సంక్షేమం ఆర్‌టిసికి చాలా ముఖ్యమన్నారు. సిబిఎస్ హాంగర్ ప్లేస్‌లో ఆర్థిక పరిస్థితి దృష్టా ఇంకా నిర్ణయం తీసుకోలేదని భవిష్యత్‌లో ఆలోచిస్తామన్నారు. బస్టాండ్‌లలో ఎలాంటి పార్కింగ్ దందా నడవడం లేదని ఆయన పేర్కొన్నారు. సంస్థ సిబ్బంది డిఏ, సిసిఎస్ బకాయిలను త్వరితగతిన చెల్లింపులు చేసేందుకు, ప్రణాళికలు చేస్తున్నామన్నారు. సంస్థ లాభాల బాటలో పయనించాలంటే, ఉద్యోగుల పాత్రే కీలకమని సజ్జనార్ తెలిపారు. ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఆయన తెలిపారు.


97 డిపోల్లో రక్తదాన శిబిరాలు
టిఎస్‌ఆర్‌టిసి యాజమాన్యం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో 97 డిపోలు 67 సొసైటీల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామని సజ్జనార్ తెలిపారు. సంవత్సర కాలంగా బ్లడ్ కొరత ఏర్పడుతుందని, తలేసిమియా వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ పేషంట్స్, యాక్సిడెంట్ అయిన వారికి బ్లడ్ ఎంతో అవసరమని సజ్జనార్ తెలిపారు. నర్సంపేట డ్రైవర్ శ్రీనివాస్ ఇప్పటివరకు 80 సార్లు బ్లడ్‌ను డోనెట్ చేశారని ఆయన ప్రశంసించారు. శ్రీనివాస్‌తోనే నర్సంపేటలోని బ్లడ్ డోనేట్ శిబిరాన్ని ప్రారంభింపచేశామని సజ్జనార్ తెలిపారు. ఆర్‌టిసి సిబ్బంది, కుటుంబ సభ్యులు బ్లడ్ డోనేట్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్‌టిసి యాజమాన్యం, సిబ్బందికి 100 శాతం వ్యాక్సిన్‌షన్‌ను పూర్తి చేశామన్నారు. కొత్త వేరియంట్‌పై భయపడాల్సిన అవసరం లేదన్నారు. మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని ఆయన సూచించారు. ప్రతి బస్సును శానిటేషన్ చేస్తున్నామన్నారు. చాలామంది ఉత్సాహంతో మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారని, సెకండ్ డోస్ వేసుకోవడం లేదన్నారు. ప్రజలంతా వ్యాక్సిన్ వేసుకోవాలని ఎండి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. జూబ్లీ బస్‌స్టేషన్‌లో జరిగిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులో ఆర్‌టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు.

VC Sajjanar about TSRTC Lands Sale

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News