Wednesday, May 8, 2024

పార్టీని ముంచుతాడు

- Advertisement -
- Advertisement -

VH reacted strongly against Congress party

 

టిపిసిసి అధ్యక్ష పదవి రేవంత్‌రెడ్డికి ఇస్తే టిడిపిని ముంచినట్టే కాంగ్రెస్‌ను కూడా
అంతం చేస్తాడు, ఆయనకు కట్టబెడితే నేను తప్పుకుంటా : విహెచ్ ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రేవంత్‌కు పిసిసి ఇస్తే తాను పార్టీలో కొనసాగేది లేదని, తప్పుకుంటానని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంపై విహెచ్ తీవ్రంగా స్పందించారు. వాస్తవాలు బయటపడతాయని తనను కలువనివ్వడం లేదని ఆరోపించారు. ఈ మేరకు ఎంపి రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్‌కు పిసిసి పదవి ఇస్తే జైలు చుట్టూ తిరగాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. ‘ఎప్పుడు నేను నోరు జారి మాట్లాడలేదు. అవినీతి భూకబ్జాలు చేయలేదు. నాకు కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదో అర్థం కావడం లేదు. వాస్తవాలు చెబుతాననే కొందరు నన్ను కలువనివ్వడం లేదు. ఏ ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ ఎందుకు రివ్యూ చేయదు? రేవంత్ రెడ్డి 48 డివిజన్లు బాధ్యతలు తీసుకున్నారు గానీ కేవలం ఇద్దరిని మాత్రమే గెలిపించార’ని విహెచ్ అన్నారు. తెలుగుదేశం పార్టీని ముంచిన రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్‌ను ముంచాలని చూస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

సోనియాకు సమాధి కట్టాలని రేవంత్ అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయనపై ఓటుకు నోటు, భూకబ్జా కేసులు ఉన్నాయని విహెచ్ పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి పిసిసి ఇస్తే జైలు చుట్టూ తిరగాలని ఎద్దేవా చేశారు. విజిటింగ్ కార్డులు ప్రింట్ చేస్తానని నేతల చుట్టూ తిరిగిన ఆయనకు ఇన్ని కోట్లు ఎక్కడ్నించి వచ్చాయి? అని విహెచ్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి చరిత్ర తనకు తెలుసునని విహెచ్ పేర్కొన్నారు. తాను ఫోన్ చేస్తే ఇంఛార్జి మాణికం ఠాగూర్ స్పందించడం లేదన్నారు. తానేమైనా రౌడీనా? దొంగనా? అని ప్రశ్నించారు. తన మాటను ఎవరూ వినడం లేదన్నారు. ప్యాకేజీలకు ఆయన అమ్ముడుపోయి ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి తప్పుడు నివేదిక పంపారని విహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ వాళ్లు ఏది చెబితే అది వినాలా? అని విహెచ్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో కొందరు డబ్బులకు అలవాటు పడ్డారని విహెచ్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి వల్లే పార్టీ నష్టం జరుగుతోందని విహెచ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో బిసి వర్గాలకు చెందిన సీనియర్లను పక్కనబెట్టి రెడ్డి సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యతనివ్వడం దారుణమన్నారు.

ఏ అర్హత ఉందని రేవంత్‌రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి కట్టబెడతారు? అని ఆయన ప్రశ్నించారు. తనతో పాటు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నాయకులను పక్కనబెట్టడం ఎంత వరకు సబబు అని విహెచ్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి పిసిసి చీఫ్ పదవి కట్టబెట్టడం అంటే తన మనసు ఒప్పుకోవడం లేదని విహెచ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కాలంగా పనిచేస్తున్న సీనియర్లకు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్‌తో పాటు కొందరిని అసలు వదిలేది లేదని విహెచ్ అన్నారు. వీరి అక్రమాలపై సిబిఐకి లేఖ రాస్తానని విహెచ్ వెల్లడించారు. తాను ఎలాంటి అవినీతికి, అక్రమ సంపాదనకు పాల్పడలేదని విహెచ్ గద్దద స్వరంతో చెప్పారు. అధిష్టానాని(హైకమాండ్)కి అన్ని వివరాలు చెప్పినా కూడా రేవంత్‌రెడ్డికే పిసిసి ఇస్తే తాము చేసేది చేస్తామని విహెచ్ స్పష్టీకరించారు.

టిపిసిసి అధ్యక్షుడి ఎంపిక ‘క్లైమాక్స్’కు చేరినట్లేనా..?

టిపిసిసి అధ్యక్షుడి ఎంపిక ‘క్లైమాక్స్’కు చేరిందని అంటున్నారు. టిపిసిసి అధ్యక్ష రేసులో రేవంత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఫైనల్ లిస్టులో నిలవగా.. మాస్ ఫాలోయింగ్, ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన రేవంత్‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో ఏదైనా తేడా వస్తే తప్ప పిసిసి అధ్యక్షుడు పదవి రేవంత్‌రెడ్డికే దక్కే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెసు సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యలను బట్టి రేవంత్‌రెడ్డి పేరు పిసిసి అధ్యక్ష పదవికి ఖరారైనట్లు అర్థమవుతోంది. గురువారం సంగారెడ్డి ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తపర్చగా… నేడు విహెచ్ పార్టీ హైకమాండ్‌పై నిప్పులు చెరగడంతో పాటు తాడో పేడో తేల్చుకుంటామని స్వరం పెంచారు. రేవంత్‌రెడ్డిపై విహెచ్ తీవ్రమైన వ్యాఖ్యలను చేయడాన్ని బట్టి అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు భావించవచ్చునని చెబుతున్నారు. రేవంత్‌రెడ్డికి ఎంత క్రేజ్ ఉందో.. తనకు అంతే క్రేజ్ ఉందని పిసిసి పదవిని రెడ్డికి ఇవ్వాలంటే ఒరిజినల్ రెడ్డికి ఇవ్వాలన్నారు. బిజెపి దూకుడుగా వ్యవహరిస్తున్న తరుణంలో ఆర్‌ఎస్‌ఎస్ నుంచి వచ్చిన వ్యక్తికి పిసిసి అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని విహెచ్ ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డికి పిసిసి పదవి ఖరారు కావడం వల్లనే విహెచ్ తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారనేది రాజకీయ విశ్లేషకుల భావనగా ఉంది.

కాంగ్రెస్ మార్క్ రాజకీయంతో
సమన్వయమిలా.. సీనియర్లకు సముచిత స్థానం…

మరోవైపు పిసిసి పదవిని ఆశిస్తూ వస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సంతృప్తి పరిచే చర్యలకు సైతం హైకమాండ్ సిద్ధమైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్లూసి)లో ఆయనకు స్థానం కల్పించే అవకాశం ఉంది. టిపిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఎఐసిసిలో స్థానం కల్పించే అవకాశం ఉంది. ఎస్పీ కోటాలో సంపత్‌కుమార్‌కు, బీసీ కోటాలో మధుయాష్కీ గౌడ్‌కు మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీకి కార్యనిర్వాహక అధ్యక్ష పదవులు ఇచ్చే అవకాశం ఉంది. 2018 ఎన్నికల్లో ప్రచారకమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన మల్లు భట్టి విక్రమార్కకు తిరిగి ఆ పదవి అప్పగించే అవకాశాలున్నాయి. ఆ పదవిలో ఉన్న విజయశాంతి బిజెపిలో చేరడంతో మల్లు భట్టి విక్రమార్కకు లైన్ క్లియర్ అయినట్లు చెబుతున్నారు. అదే జరిగితే పిసిసి అధ్యక్ష పదవికి పోటీపడిన శ్రీధర్‌బాబును సిఎల్పీ పక్ష నేతగా నియమించే అవకాశాలున్నాయి.

కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించే విషయాన్ని కూడా హైకమాండ్ పరిశీలిస్తోంది. కోమటిరెడ్డి అందుకు అంగీకరిస్తే.. మల్లు భట్టి విక్రమార్కను సిఎల్పీ నేతగా కొనసాగించి.. శ్రీధర్‌బాబును కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయి. మరోవైపు టిపిసిసికి సలహా కమిటీని ఏర్పాటు చేసే ఆలోచనను కూడా హైకమాండ్ యోచనలో ఉందని చెబుతున్నారు. సలహా కమిటీలో సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, దామోదర రాజనర్సింహా, పాన్నాల లక్ష్మయ్య, విహెచ్‌లను నియమించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ కమిటీ కూర్పుపై మాణికం ఠాగూర్, కేసి వేణుగోపాల్‌లు రాహుల్‌గాంధీతో చర్చించనున్నట్లు సమాచారం.

ఒకట్రెండు రోజుల్లో పిసిసి చీఫ్ ప్రకటన వెలువడే ఛాన్స్..!

ఈ విధంగా పార్టీలో ఏ ఒక్కరూ చేజారకుండా హైకమాండ్ తనదైన శైలిలో పావులు కదుపుతూ అందర్నీ సమన్వయం చేస్తూ తెలంగాణలో పార్టీని బతికించడమే ఏకైక లక్షంతో దూకుడు స్వభావం, మాస్ ఫాలోయింగ్ వున్న రేవంత్‌రెడ్డికి వ్యతిరేకత రాని విధంగా పావులు కదుపుతోందని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, తన నిర్ణయానికి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని హైకమాండ్ ఇప్పటికే కొందరు సీనియర్ నేతలకు సమాచారం అందించిందని చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో పిసిసి చీఫ్ ప్రకటన చేసే అవకాశం మెండుగా వుందని అంటున్నారు. లేని పక్షంలో జనవరి మొదటివారంలో తాననుకున్న వ్యక్తినే టిపిసిసి చీఫ్‌గా పార్టీ హైకమాండ్ ప్రకటించనుందని సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News