Sunday, April 28, 2024

33 % ఫిట్‌మెంట్‌తో త్వరలో పిఆర్‌సి?

- Advertisement -
- Advertisement -

Coming soon PRC with 33% fitment

 

రిటైర్మెంట్ వయసు మీద కూడా నిర్ణయం ప్రకటించే అవకాశం

నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో సిఎం కెసిఆర్ సమావేశం ?
పిఆర్‌సితో పాటు ఉద్యోగుల పదవీ విరమణపై చర్చించే అవకాశం
ఫిట్‌మెంట్ 33 శాతంగా ప్రకటించనున్న ప్రభుత్వం !
ఈనెల 28 లేదా 29వ తేదీన సిఎస్‌కు పిఆర్‌సికి నివేదిక అందించనున్న చైర్మన్ బిస్వాల్
ఉద్యోగులకు మేలు చేసేలా నివేదిక

మనతెలంగాణ/హైదరాబాద్ : త్వరలో ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. ఉద్యోగులతో పాటు పింఛనర్లకు నూతన సంవత్సర కానుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈనెలాఖరులోగా పిఆర్సీ కమిషన్ పదవీకాలం పూర్తికానున్న ఈ నేపథ్యంలో సకల హంగులతో ఉద్యోగులకు మేలు చేసేలా పిఆర్‌సి నివేదిక సిద్ధమయినట్టుగా సమాచారం. గతంలో 9 పిఆర్‌సి అమల్లోకి వచ్చే ముందు 22 శాతం ఐఆర్ ఇవ్వగా, 38 శాతం ఫిట్‌మెంట్, 10 పిఆర్‌సి అమల్లోకి వచ్చే ముందు 27 శాతం ఐఆర్ ఇవ్వగా, 43 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా బిస్వాల్ కమిటీ నేతృత్వంలో 2018 మే 18వ తేదీన పిఆర్‌సి కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా ఈ కమిషన్‌లో సభ్యులుగా ఐఏఎస్ అధికారి బిస్వాల్ చైర్మన్‌గా, విశ్రాంత ఐఏఎస్‌లు ఉమా మహేశ్వరరావు, మహ్మద్ అలీరఫత్‌లు సభ్యులుగా నియమితుల య్యారు. ప్రస్తుతం ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగుస్తోంది. అయితే ఈ కమిషన్ ఉద్యోగులకు 33 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని సూచించినట్టుగా తెలిసింది.

ఈనెల 28 లేదా 29వ తేదీ మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ నివేదికను పిఆర్సీ చైర్మన్ బిస్వాల్ అందజేయనున్నట్టుగా సమాచారం. శాఖల వారీగా, కేడర్ వారీగా కనీస మూలవేతనం, గరిష్ట వేతనాలు, అలవెన్స్‌లను నివేదికలో పొందుపరిచేలా బిస్వాల్ కమిటీ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు ఇప్పటికే మంజూరు చేసిన డిఏను కలిపి కొత్త పిఆర్‌సి అంచనాలను ఈ కమిషన్ రూపొందించినట్టుగా తెలిసింది.

పదవీ విరమణ వయస్సు పెంపుపై కూడా….

ఈ నేపథ్యంలోనే ఉద్యోగసంఘాలతో సిఎం కెసిఆర్ సమావేశం కావాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడి పిఆర్సీపై ప్రకటనతో పాటు పదవీ విరమణ వయస్సు పెంపుపై కూడా ఓ ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టుగా తెలిసింది. ఏప్రిల్ 2021 నుంచి ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిలను నగదు రూపంలో చెల్లించడంతో పాటు పదవీ విరమణ వయస్సుపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జూలై 2018 మార్చి నుంచి 2021 వరకు నోషనల్‌గా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. కేంద్రం డిఏను ప్రకటించగానే వెంటనే రాష్ట్ర ఉద్యోగులకు దానిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. పిఆర్‌సి తుదినివేదికను కమిటీ ప్రభుత్వానికి సమర్పించనున్న నేపథ్యంలో ఆర్థికశాఖ సైతం జీతభత్యాల పెంపుదలపై ప్రభావం ఎంత, ఏ మేరకు ఫిట్‌మెంట్ ఇస్తే ఎంత భరించాల్సి ఉంటుందన్న అంశాలపై గణాంకాలను సిద్ధం చేసినట్టుగా అధికారికవర్గాలు పేర్కొన్నాయి.

పిఆర్సీ నివేదికలో పేర్కొన్న అంశాలు ఇలా..!

అయితే 33 శాతం ఫిట్‌మెంట్‌ను ఉద్యోగులకు ఇవ్వాలని పిఆర్‌సి కమిషన్ ఆ నివేదికలో సూచించినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు కనీస పింఛన్‌ను రూ.6,500ల నుంచి రూ.10 వేల వరకు, ఉద్యోగుల కనీస వేతనాన్ని కూడా రూ.20 వేల వరకు పెంచాలని పిఆర్సీ నివేదికలో పేర్కొన్నట్టుగా సమాచారం. దీంతోపాటు హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లను యధాతథంగా అమలు చేయడంతో పాటు, రిటైర్‌మెంట్ గ్రాట్యుటీని రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షలకు పెంచాలని, పట్టణాల్లో పనిచేసే ఉద్యోగులకు 30 శాతం, జిల్లా స్థాయిలో పనిచేసే వారికి 20 శాతం, మండల స్థాయిలో పనిచేసే ఉద్యోగులకు 15 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని బిస్వాల్ కమిటీ ఈ నివేదికలో సూచించినట్టుగా సమాచారం. దీంతోపాటు ఉద్యోగి యొక్క ఇంక్రిమెంట్ 3 శాతంగా కొనసాగించడంతో పాటు పూర్తి పింఛన్‌కు అర్హత కలిగిన సర్వీస్ 33 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాలకు కుదించాలని, ఆటోమెటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీం (ఏఏఎస్‌ను 5,10,15,20,25)గా ఇవ్వాలని కమిషన్ సూచించినట్టుగా తెలిసింది. ఇక నుంచి పదేళ్లకు ఒకసారి ఉద్యోగుల జీతభత్యాలపై సమీక్ష జరపాలని ఈ కమిషన్ సూచించినట్టుగా తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News